🌷సర్వజనామోదమైన ఏకైక నేను🌷
'నేను'ను ఎవడూ ఖండించలేడు.
సర్వజనామోదమైన ఏకైక తత్త్వం 'నేను'.
వ్యక్తావ్యక్తాలు
కార్యకారణాలు
సాకారనిరాకారాలు
ఏకకాలంలో ఈ రెంటినీ 'అనుభవం'లో కలిగి
ఏ నేనైతే ఉన్నదో ఆ నేనే 'నేను'.
నేను ఏ అనుభవమూ లేని
కేవలసాక్షి స్వరూపుడను.
నేను జగత్తులో ఉన్నప్పుడు నేను మాయాలోలుడను.
నేను జగత్తుగా ఉన్నప్పుడు నేను మాయామయుడను.
నాలో జగత్తు ఉన్నప్పుడు నేను మాయాతీతుడను.
నేనే అనేక నేనులుగా చెలామణి అవుతున్నాను.
నేను ఎవరూ కాదు.
నేను ఏదీ కాదు.
ఎవరూ నేను కాదు.
ఏదీ నేను కాదు.
మరి నేనెవడను?
దిక్కు తోచనివాడను.
దిక్కు లేనివాడను.
వ్యక్తి నుండి వచ్చినట్టు కనబడే మాట కూడా
నా('నేను') నుండి వచ్చినమాటే.
నేను ఎవరో ఒకరుగా, ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో అక్కడ, ఎలాగో ఒకలాగు "ఉన్నాను". ఇక బాధేముంది?
నాతో సహా ఈ ప్రపంచం నాలోనే పుట్టింది.
నాతో సహా ఈ ప్రపంచం నాలోనే ఉంటుంది.
నాతో సహా ఈ ప్రపంచం నాలోనే లయమైపోతుంది.
నా ప్రభావము దేనిమీదా ఉండదు.
దేని ప్రభావమూ నా మీద ఉండదు.
సకారణం, అకారణం రెండూ నేనే.
నన్ను అంటుకొనునది ఏదియు లేదు.
నేను అంటుకొనుటకు ఏమియు లేదు.
నేను ఏ విధమైన అంటు లేనివాడను.
అను అనుభవరూపమైన నా స్థితియే 'నేను' స్థితి అనగా స్వస్థితి.
నేను ఒక్కణ్ణే ఉంటే అదే గాఢనిద్ర(యదార్థ జాగ్రత్తు)
నేను అనేకం అయితే అదే స్వప్నము.
జాగ్రదవస్థలో నేనున్నాను అని తెలుస్తోంది కాబట్టి
నేను జాగ్రదవస్థలో ఉన్నట్టే.
స్వప్నావస్థలో నేనున్నాను అని తెలుస్తోంది కాబట్టి
నేను జాగ్రదవస్థలో ఉన్నట్టే.
సుషుప్తావస్థలో నేనున్నాను అని తెలుస్తోంది కాబట్టి
నేను జాగ్రదవస్థలో ఉన్నట్టే.
నేను సదా జాగ్రదవస్థలోనే ఉన్నాను.
నేను జాగ్రదవస్థగానే ఉన్నాను.
అన్యము లేని నాలో
అన్యముండే నేను ఉన్నాను.
నేను కాక మరొకటి ఉందనుకుంటే
నేను దారి తప్పినట్టే.
'నేను' కాక మరియొకదానికి ఉనికి ఉందనుట బంధము.
'నేను' కాక మరియొకదానికి ఉనికి లేదనుట మోక్షము.
'నేను కర్తను' అని నేను అన్నా అనకున్నా అనుకోకున్నా నేనే కర్తను.
నాలో నుంచే తల్లిదండ్రులు వచ్చారు.
తల్లిదండ్రుల నుంచి నేను రాలేదు.
నేను-
లోపల లేని వెలుపల.
వెలుపల లేని లోపల.
నేను చూడనిది అంటూ ఏదీ లేదు, ఎవరూ లేరు.
నన్ను చూచినది అంటూ ఏదీ లేదు, ఎవరూ లేరు.
నేను ఏదైనా ఎఱుగుదును.
నేను ఎవరినైనా ఎఱుగుదును.
ఏదీ నన్ను ఎఱుగదు.
ఎవరూ నన్ను ఎఱుగరు.
ప్రపంచానికి కేంద్రం అరుణాచలం.
అరుణాచలానికి కేంద్రం 'నేను'.
నేను భూతకాలమునకు ముందు
భవిష్యత్కాలమునకు తరువాత ఉన్నాను.
నేను ఇప్పుడు-ఇక్కడ-ఇలాగు ఉన్నట్లున్నాను.
నాకు కలిగే ప్రశ్నలన్నింటికీ సమాధానం - నేనే.
నాకు కలిగే సుఖదుఃఖాలన్నింటికీ కారణం - నేనే.
అన్యం తోచని నేనే
అన్యం తోచే నేనుగా ఉండేది.
ఉన్నది ఒకే సత్యము.
ఈ ఉన్నదే దైవము.
ఇది నేనే.
నేనే ఈ ఉన్నది.
ఉన్నది ఒకే శక్తి.
ఈ ఉన్నదే దైవము.
ఇది నేనే.
నేనే ఈ ఉన్నది.
ఉన్నది ఒకే ఒక ఆకర్షణ.
ఈ ఉన్నదే దైవము.
ఇది నేనే.
నేనే ఈ ఉన్నది.
ఉన్నది ఒకే ఒక ఆనందము.
ఈ ఉన్నదే దైవము.
ఇది నేనే.
నేనే ఈ ఉన్నది.
ఉన్నది ఒకే ఒక ఐశ్వర్యము.
ఈ ఉన్నదే దైవము.
ఇది నేనే.
నేనే ఈ ఉన్నది.
ఉన్నది
ఏకైక సత్యము.
ఏకైక శక్తి.
ఏకైక ఆకర్షణ.
ఏకైక ఆనందము.
ఏకైక ఐశ్వర్యము.
ఈ ఉన్నదే దైవము.
నేనే ఈ ఉన్నది.
ఇహ పరాలలో జరిగినట్లున్న, జరుగుతున్నట్లున్న, జరుగనున్నట్లున్న సకలమూ నాలోనే అనగా 'నేను' లోనే జరిగినట్లున్నది, జరుగుతున్నట్లున్నది, జరుగునున్నట్లున్నది.
మొదటివాడు ఎవడో తెలిస్తే
మొత్తం వాడే అనేది తెలుస్తుంది.
వాడు నేనే అనేది కూడా తెలుస్తుంది.
ఏదియూ కాక,
ఏదో ఒకటి అయి ఉన్నదే నేను.
నేనుగాక 'సర్వత్ర' ఏమి?
నేనుగాక 'వ్యాపకత్వం' ఏమి?
నాచే నేను.
నాతో నేను.
నా కొఱకు నేను.
నాకై నేను.
స్త్రీ 'నేను' అంటుంది.
పురుషుడూ 'నేను' అంటాడు.
'నేను' స్త్రీనీ కాను, పురుషుడనూ కాను.
లింగ వచన విభక్తులకు అందని లింగము నేను.
'నేను' యొక్క అర్థం - ఒకటి.
'నేను' అని, ఇక దానికి ఒక్క అక్షరం కూడా చేర్చకుండా ఉంటే, అదే దైవానుభవం.
సాకారమైన 'నేను' - అంతరిక్షం.
నిరాకారమైన 'నేను' - అవకాశం.
'నేను' అనేదొక్కటే నిజమైన సంతకం.
మిగతా పేర్లన్నీ దొంగసంతకాలే.
నేను మాత్రమే సత్యం.
ఇతరమంతా స్వప్నం.
నేనే విశ్వకేంద్రం.
నేనే దైవకణం.
నా యొక్క ఇచ్ఛాశక్తియే స్వాతంత్ర్యము.
ఆ స్వాతంత్ర్యమునకే 'మాయ' అని పేరు.
నేను నేను కాగలనే కాని,
నేను నేనుగా మాత్రమే ఉండగలను గాని
అద్వితీయుడైన నన్ను ఇంకొకడు పోలగలడా?
అన్నీ పలికే ఈ నేను
నేను అని పలికే నేను కాదు.
అన్నీ తలిచే నేను
నేను అని తలిచే నేను కాదు.
అన్ని అనుభవాలకు కారణమైన ఈ నేను
నేను అనే అనుభవమునకు కారణమైన నేను కాదు.
ఈ నేనుకు రాకడ,పోకడ ఉంటాయి.
ఇవి లేనే లేని ఆ నేనే నేను.
ఆ నేనే ఈ నేను.
కానీ ఈ నేను ఆ నేను కాదు.
No comments:
Post a Comment