Thursday, September 29, 2022

నేటి యువతరం వింత పోకడలకు తల్లిదండ్రులే భాద్యులా

 నేటి యువతరం వింత పోకడలకు తల్లిదండ్రులే భాద్యులా. చదవండి. 

అమ్మ నాన్నలూ .. బాధ్యత ఉన్న పౌరులు
పెంచుదామ పిల్లలను పద్దతిగా 
ఆధునికత పేరుతోటి వెర్రి చేష్టలు 
మానిపించి తీర్చి దిద్దుదామ మనుషులుగా 
అతి గారంతో మనం చెడగొడుతుంటే 
మతి తప్పిన యువత భవిత చెదపడుతుందే...

అమ్మ, నాన్న, గురువులపై లేదు గౌరవం 
అతిథులు, బంధువులంటే ఆమడ దూరం 
ఇంటి పనులు చేయుటన్న తమకవమానం 
సొంత బరువు మోయలేని శరీర భారం 
మంచి మాట చెపితె చెప్పలేని కోపము 
తప్పు చేసి ఒప్పుకొనుటకెంతో రోషము 
వింతగ మారింది నవతరం 
ఇందుకు కారణ మయ్యాము తల్లిదండ్రులం

తెల్లవారు దాక సెల్లుతోటి ఆటలు 
తల్లి, తండ్రి వినకూడని చాటు మాటలు 
అమ్మ చేతి వంట అంటె ఏవగింపులు 
అడ్డమైన ఫాస్టు ఫుడ్స్ ఆరగింపులు
వికారమగు జుట్లు, టాటూలు, డ్రెస్సులు 
సంస్కారం మాటెత్తితే కస్సుబుస్సులు...!
వింతగ మారింది నవతరం 
ఇందుకు కారణ మయ్యాము తల్లిదండ్రులం

అమ్మ భాష అంటె వీరు ఆమడ దూరం 
ఇంగిలీషు లోన వొలకబోయు వయారం 
పబ్బు, క్లబ్బు కల్చరుతో దుమ్ము దుమారం 
విచ్చలవిడి తనము తోటి వీర విహారం
బెట్టింగులు, రేసుల మునిగే వ్యవహారం   
(చైన్) స్నాచింగుల నేరాలతో తేలు యవారం...!
వింతగ మారింది నవతరం 
ఇందుకు కారణ మయ్యాము తల్లిదండ్రులం

***
మారాలంటే యువతరం 
ముందుగ మారాలి మనం తల్లిదండ్రులం. 

ఇంగ్లీష్ చదువుల పై మోజెంత ఉన్ననూ 
ఇంటి లోన సంస్కృతి అలవాటు క్షేమము 
బాధ్యత, మర్యాద, మంచి, ఓర్పు, సహనము, 
ప్రేమ, గౌరవాలు నేర్పితేనె విజయము 
దైవ భక్తి, దేశభక్తి, సేవా గుణము 
అలవరచక యువత భవిత అంధకారము
మారాలంటే యువతరం 
ముందుగ మారాలి మనం తల్లిదండ్రులం. 

అమ్మమ్మలు, నానమ్మలు, తాతల కథలు
పండించును మన పిల్లల బంగరు కలలు
మన పూర్వులు, మహనీయుల మంచి పలుకులు 
చిందించును యువత భవిత లోన వెలుగులు  
ధర్మమార్గ మును విడువని తల్లిదండ్రులు 
యువతకు ఉత్తమ జీవనమిచ్చు దాతలు
మారాలంటే యువతరం 
ముందుగ మారాలి మనం తల్లిదండ్రులం. 
*** 
సేకరణ. మానస సరోవరం 

No comments:

Post a Comment