Tuesday, September 27, 2022

ధనం,జనం,యవ్వనం… అన్నీ అశాశ్వతమే!

 ధనం,జనం,యవ్వనం…
                అన్నీ అశాశ్వతమే!
                    ➖➖➖✍️

ఆత్మజ్ఞానం కావాలంటే అందుకు అనువైనది మానవ జన్మయే!

అలాంటి మానవజన్మ లభించి కూడా ఆత్మజ్ఞానాన్ని అలక్ష్యం చేసి లౌకిక సంపదలు, భోగాలే ప్రధానం అనుకొని జీవితం గడిపినవారి గతి ఏమవుతుందో శంకరాచార్యులవారు ఇలా వివరించారు:
 
మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్‌ కాలః సర్వం
మయామయమిదమఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా
 
ధనమున్నదని, అనుచరగణం ఉన్నదని, యవ్వనం ఉన్నదని గర్వించకు. ఈ మొత్తం ఒక్క నిమిషంలో హరించిపోతుంది.
ఈ ప్రపంచం అంతా భ్రమతో కూడుకున్నదని, మాయాజాలమని తెలుసుకొని ఆ పరమాత్మ స్థానాన్ని గ్రహించి అక్కడకు చేరుకో, ఆత్మానుభూతిని చెందు! అని దీని అర్థం.

ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి. 

ఈ క్షణికమైన సంపదలను చూసుకొని మనిషి గర్విస్తాడు,అహంకరిస్తాడు. 

కొందరికి ధనగర్వం, 
కొందరికి తన కోసం ఏదైనా చేయగలిగే అనుచరులున్నారనే గర్వం, 
కొందరికి తమ యవ్వనాన్ని చూసుకుని గర్వం.

కానీ ఒక్కసారి భూకంపం వస్తే ఇళ్లు,ఆస్తులు నేలమట్టమై పోతాయి. 
నాకేం? కోట్ల ఆస్తి ఉంది. బ్రహ్మాండమైన భవనం ఉంది అని గర్వించినవాడు మరుక్షణంలో ఎవరో దయతో పంపించే ఆహార పొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది. ఆ క్షణంలో ధనం, జనం ఏవీ రక్షించవు. 

అలాగే యవ్వనం కూడా శాశ్వతంగా ఉండదు.వృద్ధాప్యం వెక్కిరిస్తూ మన నెత్తిమీదకు వచ్చికూర్చుంటుంది. 
కాబట్టి ఇదంతా మాయాజాలమని, క్షణికమైనవని భావించాలి. 
అలాగని అన్నీ వద్దనుకోవాల్సిన పని లేదు. వాటిని అనుభవించడంలో తప్పు లేదు. కానీ, వాటితో అటాచ్‌మెంట్‌ పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే, అవి పోయినప్పుడు భరించలేని దుఃఖం తప్పదు. 

జీవితంలో అతి ముఖ్యమైనవిగా భావించాల్సినవి ఇవి కావు. 

శాశ్వత ఆనందప్రాప్తికి బ్రహ్మపదంలో ప్రవేశించాలి.

ఆ పరమానందం, నిత్యానందం లభించాలంటే చలించే మనస్సును బ్రహ్మంలో నిలిపి, 
ఆ బ్రహ్మంలో మనస్సును ప్రవేశపెట్టి బ్రహ్మంగా ఉండిపోవాలి. 

పరమాత్మలో ఐక్యం కావాలి.✍️

                   🌷🙏🌷

  🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

No comments:

Post a Comment