ఎవరితే తన మనసును అదుపులో పెట్టుకుంటారో, అటువంటి వారు ఎల్లప్పుడు ప్రశాంతంగా ఉంటారు. అటువంటి వారికి చలి, వేడి, సుఖము, దుఃఖము, సన్మానము, అవమానము అన్నీ పరమాత్మ అనుగ్రహాలుగానే కనిపిస్తాయి. అన్నిటినీ సమానంగా చూచే శక్తి లభిస్తుంది.
మానవులు సామాన్యంగా ద్వంద్వాలకు లోనవుతుంటారు. సుఖదుఃఖాలు, లాభనష్టాలు, రాగద్వేషాలు, మానావమానాలు, శీతోష్ణాలు మొదలైన వాటికి లోబడి ప్రవర్తిస్తుంటారు.
ఈ ద్వంద్వాలను సమానంగా చూడటం ఎవరికీ సాధ్యం కాదు. సుఖం కలిగినపుడు పొంగి పోవడం, దుఃఖం వచ్చినపుడు కుంగిపోవడం మానవ లక్షణం. ఎవరైనా తనను పొగిడితే పొంగిపోవడం, ఎవరైనా తిడితే కోప్పడటం, దిగులు పడటం, కుంగిపోవడం సామాన్యంగా జరిగేదే.
ఎవడైనా మనకు సన్మానం చేసి పొగిడితే పొంగిపోతాం. అదే సభలో ఎవడైనా తిడితే కుంగి పోతాం. వేసవి కాలంలో ఎండను తిట్టుకుంటాం, వానాకాలంలో చిత్తడి వర్షాన్ని తిట్టుకుంటాం. చలికాలంలో చలిని తిట్టుకుంటాం. వాటి వల్ల వాతావరణం ఆహ్లాదంగా ఉంటే పిక్నిక్కులకు వెళ్లి ఎంజాయి చేస్తాం. ఇలా ద్వంద్వాలకు లోబడి ప్రవర్తించడం మానవ లక్షణం.
ఈ ప్రకారంగా ద్వంద్వాలకు లోబడిన మనసు ఎల్లప్పుడూ అశాంతితో, చంచలంగా ఉంటుంది. నిలకడ ఉండదు. అలా కాకుండా మనసును జయించిన వాడు, మనస్సును నిలకడగా ఉంచుకోగలిగినవాడు, ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. అతనిని శీతోష్ణాలు, సుఖదుఖాలు, మానము, అవమానము ఏమీ ప్రభావితం చేయలేవు. సర్వకాల సర్వావస్థలయందు నిర్వికారంగా సంతోషంగా ప్రశాంతంగా ఉంటాడు.
పెద్ద పర్వతమును ఎంతటి గాలి అయినా చలింపచేయలేదు. అలాగే మనస్సును జయించిన వాడికి ఈ ద్వంద్వములు ఏమీ చేయలేవు. అతడు నిశ్చలంగా ద్వంద్వాలకు అతీతంగా పరమ శాంతితో ఉంటాడు.
కాబట్టి ప్రతి వాడూ అభ్యాసం చేతా, వైరాగ్యం చేతా, వివేకం చేతా మనసును తన అదుపులో పెట్టుకోడానికి ప్రయత్నం చేయాలి.
అందుకే పరమాత్మా..
"సమాహితః" అన్నారు అంటే మన మనసును పరమాత్మయందు లగ్నం చేయాలి. అంటే మనకు సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా దాన్ని పరమాత్మకు అర్పించాలి. ఆ సుఖదుఃఖాలను పరమాత్మ ప్రసాదంగా స్వీకరించాలి. అప్పుడే మనసు అదుపులో ఉంటుంది. ప్రశాంతత లభిస్తుంది. బయట ప్రపంచంలో ఉన్న శీతోష్ణములు, సుఖదుఃఖాలు, సన్మానము అవమానము మనల్ని బాధించవు. అన్నిటినీ సమానంగా చూచే శక్తి లభిస్తుంది.
No comments:
Post a Comment