అనుష్ఠాన వేదాంతం
____
ఆధ్యాత్మిక బోధకుల వద్ద తరచుగా ఈ క్రింది మాటలు వింటూ ఉంటాం...
ఉత్త మాటలు వలన లాభం లేదు...ఆచరణ ఉండాలి...
ఉత్త గ్రంథాలు చదవడం వలన ప్రయోజనం లేదు....
ఆచరణ ముఖ్యం...
ఉత్త గురుబోధలు వినటం వలన ఒరిగేదేమీ లేదు....
ఆచరణ ప్రధానం....
కావలసింది వాచా వేదాంతం కాదు....అనుష్ఠాన వేదాంతం...అని.
ఇలా చెప్పేవారందరూ బాధ్యతను బోధిస్తున్నట్టు కనబడే బాధ్యతారహిత గురువులే....
ఒక గురువు శిష్యుడికి మంత్రోపదేశం చేసి,
మంత్రాన్ని ధ్యానించేటప్పుడు కోతిని గుర్తుకు తెచ్చుకోవద్దన్నాడట...
నువ్వు కోతి గుఱించి ప్రత్యేకంగా చెప్పకుంటే, వాడికసలు కోతి గుర్తుకొచ్చే ఛాన్సే లేదు....
గుర్తుకు రావాలనే చెప్పాడు ఆ గురువు....
యెందుకలా?
శిష్యుడు సాధనలో పురోగతి చెందకుంటే తన మీద కేసు రాకుండా తెలివిగా తప్పించుకునేందుకు గురువు పన్నిన పన్నాగం అది.
శిష్యుడికి సరియైన అవగాహన కలిగించకుండా....
ఆచరణ ముఖ్యం అని చెప్పడం కూడా అంతే.
అవగాహన కలిగిస్తే....ఆచరణ యొక్క అవసరం రానే రాదు.
ఆధ్యాత్మికం అనేది పూర్తిగా అవగాహన విషయమే...
ఆచరణకు సంబంధించినది కానేకాదు.ఆచరించడానికి వీలైనది - ఆచారం(ధర్మం)
ఆచరించడానికి వీలుకానిది - ఆధ్యాత్మికం(సత్యం)
* * *
ఆచరణ బాహ్య విషయం.
అవగాహన ఆంతర విషయం.
ధర్మాన్ని కేవలం తెలుసుకుంటే చాలదు...ఆచరించాలి.
సత్యాన్ని కేవలం తెలుసుకుంటే చాలు...అనుభవించవచ్చు.
ధర్మానికి, సత్యానికి తేడా ఇదే.....
* * *
అనుష్ఠాన వేదాంతం....అనే మాటే తప్పు....
అనుష్ఠించడానికి ఏమీ ఉండదు అందులో....
ధర్మాన్ని అనుష్ఠించగలం...."ధర్మానుష్ఠానం" అనే మాట సరి.
"అనుష్ఠానవేదాంతం" అనేమాట సరికాదు.
ఆధ్యాత్మికం అనేది కేవలం అవగాహన చేసుకోవాల్సిన విషయం...అంతే.
తల్లిదండ్రుల యెడల పుత్రుడు యెలా ఉండాలో
భర్త యెడల భార్య యెలా ఉండాలో
చెప్పేది ధర్మం....ఇది ఆచరణాత్మకం.
ఉన్నదానిని ఉన్నది అని చెప్పేది ఆధ్యాత్మికం.
ఇది అప్పటికప్పటికే అనుభవంలోకి వచ్చే విషయం.
* * *
"నీవిలా ఉండు" అని చెబుతుంది ధర్మం.
"నీవెలా ఉన్నావో" చెబుతుంది ఆధ్యాత్మికం.
కాబట్టి కర్తవ్య బోధ చేసే ప్రతీది ధర్మం.
ఏ కర్తవ్యమూ లేని ఏకాత్ముడవు నీవు అని చెప్పే ప్రతీది ఆధ్యాత్మికం.
ధర్మం బాహ్యవిషయం.
సత్యం ఆంతర విషయం.
బాహ్యంలో యెంత వెతకినా సత్యం కానరాదు.
ఆంతరంలో ఆత్మనిష్ఠకు తప్ప ధర్మనిష్ఠకు చోటులేదు.
నీతి(ధర్మం) అనేది పరమం(ultimate) కాదు,
అది పరమపదాన్ని చేర్చే ఓ సాధనం మాత్రమే.
* * *
16 ఏళ్ల తిరుచ్చిళి వేంకటేశ్వరశర్మకు
ధర్మం అంటే ఏంటో తెలియదు, సత్యం అంటే ఏంటో తెలియదు.
కానీ ఆత్మ అతణ్ణి ఆవహించి మనిషిని ఋషిగా మార్చివేసింది.
అతని ప్రతి నడకా ధర్మమయ్యింది.
అతని ప్రతి పలుకూ సత్యమయ్యింది.
భూలోకంలో భగవంతునికి చిరునామాగా మారి
ఆ బాలుడు "భగవాన్" అయ్యాడు.
ధర్మమూర్తి - రాముడు.
సత్యమూర్తి - రమణుడు.
ధర్మాన్ని మనమై ఆవహించాలి.
సత్యమే మనల్ని ఆవహిస్తుంది.
* * *
ధర్మంలో సత్యం, సత్యంలో ధర్మం ఉండదని కాదు.
అవి రెండూ ఒకే వస్తువు.
సత్యం యొక్క బాహ్యరూపం ధర్మం.
ధర్మం యొక్క ఆంతరరూపం సత్యం.
ధర్మం చలిస్తుంటుంది...చరిస్తుంటుంది....
సత్యం అచలంగా ఉంటుంది.
ధర్మం - మార్గం.
సత్యం - గమ్యం.
* * *
"నేను బాబు" అన్నదాంట్లో -
బాబు అనేది - ధర్మం.
నేను అనేది - సత్యం.
* * *
No comments:
Post a Comment