Saturday, September 10, 2022

ఏడు లోకములు-మానవుడు

 🌸 *శ్రీమద్భాగవతము* 🌸 
 
🌹  *ఏడు లోకములు-మానవుడు*🌹 
 
🌺 మానవ మనస్సుకన్న పైన అంతరిక్ష ప్రజ్ఞ, దానికి పైన పంచభూతముల ప్రజ్ఞలు, మహదహంకారములు, తన్మాత్రలు నడుచు ప్రజ్ఞలుండును. ఆయా ప్రజ్ఞలలో చరించు జీవులున్నారు, వారే దేవతలు, గంధర్వులు, కిన్నర కింపురుషాదులు, సిద్ధులు, సాధ్యులు మున్నగువారు. 

వీరు ద్రవ్యముల స్థితిగతులను, లోకముల ధర్మములను వర్తింపజేయుచుందురు. వీరి వలననే వివిధ ద్రవ్యములకు వివిధ లక్షణములు, రూపములు, రంగు, రుచి, వాసన మున్నగునవి కలుగుచున్నవి. నరుని మనస్సు పై లోకములకును, క్రింద లోకములకును ద్వారముగ ఉన్నది. కనుకనే నరలోకమును మాధ్యమలోకము అని గూడ వ్యవహరింతురు. అభ్యాసవశమున కామక్రోధాదులచే నరుని ప్రజ్ఞ క్రింది లోకములలో వర్తించును. తపస్సు, బ్రహ్మచర్యము, భూతదయ మున్నగువాని అభ్యాసమున పై లోకములందు వర్తించును. 

ఏ లోకమునందైనను కర్మలు, ఫలితములు, కార్య కారణరూపమున వర్తింపక తప్పదు. ఇన్ని లోకముల యందును అంతర్యామియై భగవంతుడు ఉన్నాడు. ఏ లోకమువారైనను మనస్సును భగవదర్పితము చేసినపుడు ప్రజ్ఞ బ్రహ్మ లోకము దాటి వర్తించును. అది దాటిన వెనుక కార్యకారణ సంబంధము ఉండదు కనుక కర్మల ఫలితములు ఉండవు. అది దాటువరకు సాధకుని ప్రజ్ఞ సత్యలోకము దాక ప్రసరించినను వెనుదిరిగి ఏమరపాటు చెందుచుండును. “బ్రహ్మ లోకము వరకు గల లోకములు మరల తిరిగివచ్చు లోకములు”, అని కృష్ణుడు గీతలో చెప్పినది దీనిని గూర్చియే. సర్వము భగవంతునిమయము అను తెలివి స్థాపించుకొనినప్పటి నుండి ప్రజ్ణకు పునరావర్తము కలుగదు. ఈ సర్వాంతర్యామి లోకమున పదునాలుగు లోకములును జీవించుచునే ఉన్నవి, కాని దానిని తాకలేవు………..✍ *మాస్టర్ ఇ.కె.*  
 
(లోకాస్సమస్తాః. సుఖినో భవంతు. ఓం శాంతిః శాంతిః శాంతిః) 🌺శ్రీమద్భాగవతము. 1(1) 99

No comments:

Post a Comment