Wednesday, September 14, 2022

మానవత్వ పరిమళం

 మానవత్వ పరిమళం

రెండక్షరాల ప్రేమకు- ఇతరులకు సాయం చేసే చేతులు ఉంటాయి. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు పరుగులు తీసే పాదాలుంటాయి. ఆక్రందన వినగలిగే చెవులు ఉంటాయి. కష్టాల్ని ప్రత్యక్షంగా చూసే కళ్లుంటాయి. ఈ లక్షణాలున్న రెండక్షరాల ప్రేమను రెట్టింపు చేస్తే నాలుగక్షరాల మానవత్వం అవుతుంది. ఇది ఎక్కడి నుంచి పుడుతుంది? పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. విలువలు, మర్యాదలు, సంస్కృతి, సంప్రదాయాలు, సుఖాలు, దుఃఖాలు... అందరూ కలిసి పంచుకునేవారు. ఇంట్లో పెద్దవారు అనుబంధాలకు పెద్దపీట వేసేవారు. కలుషితాలను సైతం కలుపుకొనిపోయే నదీప్రవాహంలా మానవత్వంతో సాగిపోయే సమాజం ఉండేది.

జీవితంలో సాధించడం, అనుభవించడం, సాఫల్యం పొందడం అనేవి ముక్కాలి పీటకు మూడుకాళ్ల వంటివి. ఇందులో మొదటి రెండింటితోనే చాలామంది జీవితాన్ని గడిపేస్తుంటారు. జీవిత సాఫల్యం సులువుగా లభించదు. దీనికి కావలసిన ముడిసరకు- ప్రేమ. దీన్ని పంచడం, పెంచడం, తిరిగి పొందడంలో సమత్వం ఆచరించాలి.

రమణ మహర్షి పశుపక్ష్యాదుల పట్ల ప్రేమ, ఆదరణ చూపేవారు. జంతువులను, పక్షులను ప్రేమతో పలకరించి లాలించేవారు. తన చేతులతో తినిపించేవారు. అది చూసిన ఓ భక్తుడు 'భగవాన్! మేము మీ మాట కోసం, మీ చేతి ప్రసాదం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నా, మా చూడరు. ఇది న్యాయమా?' అని దానికి రమణులు చిరు నవ్వుతో 'పశువులు, పక్షులు అత్యంత సహజంగా నా దగ్గరకు వస్తాయి. ఏ కోరికలు, ఏ ప్రశ్నలు వాటికి ఉండవు.

అందుచేత వాటిని నేను సహజంగా ప్రేమిస్తాను. వాటి పట్ల మానవత్వంతో ప్రవర్తించడం నాకు ఇష్టం అన్నారు.

సాఫల్యం సాధించడానికి మానవత్వంతో పాటు, దాన్ని ప్రదర్శించడానికి ఫలితాలకు అతీతమైన ధైర్యం కావాలి. మరణించాక కూడా గుర్తుండి పోవాలంటే, చరిత్ర పుటల్లో రాయదగిన పనులు చెయ్యాలి. రాముడికి ఉడత చేసిన సాయం చిన్నదే. కానీ అది నేటికీ ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. పరోపకారమే పుణ్యమని, పరపీడనం పాపమని అష్టాదశ పురాణాల సారాంశం.

సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడ్పడాలన్నారు గురజాడ. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని మదర్ థెరెసా ఆచరించి చూపారు. ఇతరులకు చేసే మేలే నిజమైన సంపద అన్నది మహమ్మద్ ప్రవక్త ప్రబోధం. నువ్వు జీవించడమే కాదు, సాటి వారిని కూడా జీవింపజేయాలని జీసస్ బోధించాడు. వీటన్నింటి అంతరార్థం ఒక్కటే- ప్రేమపూరిత మానవత్వం.

నేటికీ కుబేరులే కాకుండా సగటు మనుషులు ఎందరో ఎన్నో రూపాల్లో మానవత్వం కనబరుస్తున్నారు. విద్య, వైద్యం, తాగునీరు వంటి సామాజిక సమస్యలతో పాటు ప్రకృతి విపత్తులు, ప్రాణాంతక రోగాల సమయాల్లోనూ చేయూత ఇస్తున్న ఎంతోమంది అదృశ్య దానకర్ణులు ఉన్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు జీవకారుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.

అయినవారికి మనం సాయం చేయడం మంచితనం. అదే అందరూ మనవారే అనుకుని చేసే సహాయం- మానవత్వం. సమస్త ప్రాణికోటినీ సమదృష్టితో చూడాలి. దానివల్ల ఎదురయ్యే సాఫల్య వైఫల్యాలను సమభావంతో స్వీకరించినప్పుడే అనిర్వచనీయమైన మానవత్వం పరిమళాల్ని వెదజల్లుతుంది.

No comments:

Post a Comment