Thursday, September 8, 2022

జీవితకాలంలో ఏ క్షణమూ.. విడవకూడనిది, మరువరానిది - సచ్ఛీలం !

 ॐశ్రీవేంకటేశాయ నమః
💝 జీవితకాలంలో ఏ క్షణమూ.. విడవకూడనిది, మరువరానిది - సచ్ఛీలం !
💖 ’సౌశీల్యసంపద’ కలవాడికి సముద్రం పిల్లకాలువలా కనిపిస్తుంది. 
💕 మేరుపర్వతం చిన్నరాయిలా అగుపిస్తుంది. 
💕 ’సింహం - జింకపిల్లలా తోస్తుంది’ అంటాడు భర్తృహరి మహాకవి.
❤️ సచ్ఛీలత కలిగిన వాడికి పాము పూలదండగా, కాలకూటవిషం అమృతంగా మారతాయని ఆయన సుభాషితం చెబుతుంది.
❤️ సదాచారుడికి పరాజయమే ఉండదు. 
💕 ఎందుకంటే అతడు ధర్మవర్తనుడు, సత్యసంధుడు, పరహితవ్రతుడై ఉంటాడు. 
💕 ఏ ఆపదా ఏమీ చేయలేదు. 
💕 ఏ సమస్యా కృంగదీయదు.
💕 ఏ దుఃఖమూ దుర్బలుణ్ని చేయదు.
❤️ ఆరోగ్యం లోపించినా, సంపద తరిగినా, మళ్లీ ఏదోవిధంగా సంపాదించుకోవచ్చు.
💕 శీలసంపద పోతే, తిరిగిపొందడం అనేదే జరగదు!
❤️ భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన, సౌశీల్యసంపదను మానవుడు ఎంతగా పెంచుకుంటే అంత మంచిదని ‘మనుస్మృతి’ చెబుతోంది.
❤️ అతడు ఆర్జించే విద్య, విత్తం, కీర్తి- అవి ఏవైనా శీలసంపద లేనిదే శోభిల్లవని సనాతనధర్మం స్పష్టీకరిస్తోంది.
❤️ మనిషికి మంచి నడవడి ప్రధానమని, అది నశిస్తే ఏ విధమైన శక్తీ అతణ్ని రక్షించలేదని ‘విదురనీతి’ వెల్లడిస్తోంది. 
❤️ సచ్ఛీలి కానివాడు కుటుంబంలో, సమాజంలో ఒంటరివాడవుతాడు. 
💕 ఎంత బలగం ఉన్నా అతణ్ని ఎవ్వరూ కాపాడలేరు.
❤️ ఇంతకీ శీలవంతుడు అంటే ఎవరు ?
💕 ధార్మికుడు. సకలప్రాణుల్ని ప్రేమించేవాడు, సాటివాడైనా, అపరిచితుడైనా మేలుచేసేవాడు. కలలోనైనా ఎవరికీ అపకారం చేయనివాడు, ఇతరులకు అపకారం కోరనివాడు. అతడే సచ్ఛీలుడు. 
❤️ సంయమనం, క్షమ, సహనం కలిగి ఉండటంతో పాటు కులమతభేదం లేకుండా, చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరినీ ఆదరించే సంస్కారం ఉన్నవాడే శీలవంతుడు. 
❤️ అహింస, ప్రేమ, సత్యసంధత వంటి సద్గుణాల్ని అలవరచుకున్నవాడు. క్రమశిక్షణ, సమయపాలన, చిత్తశుద్ధి కలిగినవాడే, సచ్ఛీలుడని మన శాస్త్రాలు చెబుతున్నాయి.
❤️ సజ్జనుడనే వాడు అరిషడ్వర్గాలకు, సప్తవ్యసనాలకు నిరంతరం దూరంగానే ఉంటాడు. 
❤️ మనిషికి సచ్ఛీలసంపద సిద్ధింపజేయడానికి పూర్వులు ప్రత్యేక సూత్రాల్ని నిర్దేశించారు.
❤️ ’యాజ్ఞవల్క్యస్మృతి’లో వాటిని ‘యమ-నియమాలు’ గా చెప్పారు.
💕 1. బ్రహ్మచర్యం,
💕 2. దూషణ భూషణలకు అతీతంగా ఉండటం,
💕 3. పరమాత్మధ్యానం,
💕 4. నిష్కపటం,
💕 5. పరుల సంపదను ఆశించక పోవడం,
💕 6. మధుర సంభాషణ,
💕 7. ఇంద్రియ నిగ్రహం
❤️ వీటిని యమములంటారు.

💕 స్నానం,
💕 మౌనం,
💕 ఉపవాసం,
💕 యజ్ఞ నిర్వహణ,
💕 వేదాధ్యయనం,
💕 గురు శుశ్రూష,
💕 బ్రహ్మచర్య దీక్ష,
💕 శాంత స్వభావం,
💕 విధి నిర్వహణలో జాగరూకత
❤️ ~వీటిని  నియమాలుగా పేర్కొంటోంది స్మృతి. 
❤️ తేజస్సు, క్షమ, ధైర్యం, అంతశ్శుద్ధి, బాహ్యశుద్ధి, నిరహంకారం - మానవుడి శీలసంపదను రెట్టింపు చేస్తాయి.
💕 ~ఈ లక్షణాలతో మానవుడు భగవంతుడు కాగలడని,‘భగవద్గీత’ లో శ్రీకృష్ణపరమాత్మ బోధించారు.
💖 రామాయణ, భారత, భాగవతాల్లో, అష్టాదశ పురాణాల్లో, సౌశీల్యవంతుల పాత్రలు మనకు కోకొల్లలుగా కనిపిస్తాయి. 
💕 ~అవే నేటికీ మానవాళికి అనుసరణీయాలు. 
💞 శీలానికి అంతశ్శుద్ధి, బాహ్యశుద్ధి రెండూ అవసరమే.
💕 విద్య, ధనం, యశస్సు పుష్కళంగా లభించినప్పటికీ కొందరు మాననీయులు కాలేరు.
💖 ~మనసు వికారాలతో నిండి ఉండటమే అందుకు కారణం.
❤️ శీలాన్ని మించిన సిరులు లేవని, అదే మనిషిని అందరికన్నా గొప్పగా చేస్తుందని యోగి వేమన అన్నాడు.
❤️ సచ్ఛీలుడి సాత్విక బుద్ధి ఒక్కటే దైవతత్వాన్ని అందించ గలదు.

❤️ దైవచింతన సచ్ఛీలుడికే సత్ఫలిత మిస్తుంది.
💝 అధర్మార్జనతో గుళ్లుగోపురాలు కట్టించేవాడికో, దేవతామూర్తులకు కిరీటాలు చేయించేవారికో, కీర్తికాంక్షతో దానధర్మాలు చేసేవాడికో కాదు.
❤️ ప్రాపంచిక విషయ కల్మషంలో కొట్టుమిట్టాడే వాడికి పారమార్థికచింతన అసలే ఒంటపట్టదు.
❤️ వ్యామోహమమకారాలు తగ్గించుకుంటున్న కొద్దీ మానవుడు సుగుణాలు పెంచుకోగలుగుతాడు.
❤️ అప్పుడే ముక్తిసాధనకు ఏ ఆటంకాలు లేని, చక్కనిబాట ఏర్పడుతుంది. 
💝 ~అంతేకానీ అనునిత్యం వంచనలతో, పరపీడనతో, లంచాలతో గడుపుతూ రోజూ గుళ్లల్లో ప్రదక్షిణలు కాదుకదా పొర్లుదండాలు పెట్టినా ఏ దేవుడూ క్షమించడుగాక క్షమించడు.
❤️ ॐశ్రీవేంకటేశాయ నమః

No comments:

Post a Comment