కాలక్షేపం
➖➖➖✍️
బతుకుపోరాటంలో అనుక్షణం మనిషి తీరికలేకుండా కాలాన్ని అమిత వేగంగా గడిపేస్తున్నాడు. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో ఏ పనీ లేకుండా కాలాన్ని గడపవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి సమయాల్లో గడవని కాలాన్ని గడిపేందుకు ఎన్నుకునే మానసిక వినోదమే - ‘కాలక్షేపం'.
కాలక్షేపాలు రెండు విధాలు. శరీరానికీ, మనసుకూ హితాన్ని చేకూర్చేవి ఒకటో రకం. శరీరాన్నీ, మనసునూ పాడుచేసేవి రెండో రకం.
శ్రేష్ఠత, న్యూనతల్లోనూ ఈ రెండింటి సంఖ్యలు సరిపోతాయి. మనిషి సహజ స్వభావాన్నిబట్టి, ఎవరి సంస్కారాన్ని అనుసరించి, వారు ఆయా రకాల కాలక్షేపాలను ఎన్నుకుంటారు.
'యద్భావం తద్భవతి'
ఎలాంటిది ఎన్నుకుంటే, అలాంటి ఫలితమే వారికి లభిస్తుంది. కాలక్షేపాన్ని ఎన్నుకోవడంలోనూ సహజస్వభావం ప్రముఖ పాత్ర వహిస్తుంది. అందుకే కాకి పద్మవనంలో నివసించడానికి ఇష్టపడదనీ, హంస బావిలో విహరించడానికి ఒప్పుకోదనీ, మూర్ఖుడు విద్వాంసుల మధ్యలో ఉండటానికి అంగీకరించడనీ, సేవకుడు సింహాసనంపై కూర్చోవడానికి ప్రయత్నించడనీ, చెడు మార్గాన్ని అనుసరించిన స్త్రీ సజ్జనుడితో జీవించడానికి ఇష్టపడదనీ, ఇవన్నీ వారి సహజ స్వభావంవల్ల కలిగిన లక్షణాలే అనీ ఒక ప్రాచీన సూక్తి చెబుతోంది.
సత్కాలక్షేపాన్ని గురించి వర్ణించని వాంగ్మయం లేదు. సంసారం అనేది ఒక విషవృక్షం లాంటిదనీ, అయినా దానికి రెండు అమృత ఫలాలు ఉన్నాయనీ, ఒక ఫలం పేరు: 'సుభాషిత రసాస్వాదమనీ, రెండో ఫలం పేరు: 'సజ్జన సాంగత్యం' అనీ పంచతంత్రం చెబుతోంది.
మంచి మాటల్ని వింటూ ఉండటం, మంచివాళ్లతో స్నేహం చేయడం అనేవి సత్కాలక్షేపాలని అర్ధం. అందుకే బుద్ధిమంతులైనవాళ్లు కావ్యశాస్త్ర వినోదాలతో కాలాన్ని గడుపుతూ ఉంటే, మూర్ఖులు మాత్రం చెడు అలవాట్లతోనూ, నిద్రతోనూ, ఇతరులతో పోట్లాడటం తోనూ కాలాన్ని గడుపుతారని ఒక నీతిశ్లోకం చెబుతోంది.
సత్కాలక్షేపం చేయాలంటే సజ్జనులతో సాంగత్యం చేయాలి. వారితో సంభాషించాలి. వారిని తాము నివసించే చోటికి ఆహ్వానించాలి. వారికి ప్రీతిని కలిగించాలి. ప్రీతి అంటే పైపై మాటలు కాదు. అది ఆరు విధాలుగా ఉంటుందనీ, ఇష్టమైనది ఇవ్వడం, తీసుకోవడం, మనసులోని భావాన్ని స్పష్టంగా విశదపరచడం, అడిగి తెలుసుకోవడం, కలిసి భోజనం చేయడం, తినిపించడం అనేవి ఆరు విధాలైన ప్రీతి లక్షణాలనీ పంచతంత్రంలో విష్ణు శర్మ ప్రబోధిస్తాడు.
ఆపదలో తప్ప సత్కాలక్షేపాన్ని గురించి స్మరించకపోవడం మానవ స్వభావం. మహా భారతంలో పరీక్షిత్తు శృంగి శాపంతో ఆసన్నమరణుడైనప్పుడు మహా భాగవత సత్కథలను వినాలని ఇష్టపడటం ఇందుకు ఉదాహరణ.
అందుకే కేవలం ఆపదలు సంభవించినప్పుడే కాకుండా, సుఖసంతోషాలతో తులతూగే సమయంలోనూ సత్కాలక్షేపమే శ్రేయోదాయక మని శ్రీ శంకర భగవత్పాదులు అంటారు.
ఆయన చెప్పిన భజగోవింద బోధ సుప్రసిద్ధం.
దానికి 'ఓ మూఢుడా! నీవు ఎల్లవేళల్లోనూ 'గోవింద' నామాన్ని జపించు... నీవు పోయేకాలం వస్తే నీ శాస్త్ర పాండిత్యం నిన్ను రక్షించలేదు. కనుక ఇప్పుడే మేలుకో!' అని అర్థం.
సత్కాలక్షేపం అంటే మంచి పనులతో కాలం గడపడం. దాన్ని మనం నిత్య జీవితంలో ఎన్నో విధాలుగా మలచుకోవచ్చు. దీనావస్థలో ఉన్నవారిని ఆదుకోవడం, ఇతరుల అభివృద్ధికి అవసరమైన తోడ్పాటును అందిం చడం, ఆత్మోన్నతికోసం ప్రయత్నించడం, అందరి మేలునూ కోరడం. ఇవన్నీ ఆ కోవకే చెందుతాయి.
అందువల్ల విశ్వశ్రేయం కోసం సత్కాలక్షేపం చేస్తూ తృప్తిగా జీవించాలని కోరుకుందాం.✍️
. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
No comments:
Post a Comment