Sunday, September 18, 2022

మంచితో మసలు... ✍️ పూజ్యగురువులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు.

👌 ...ఏష ధర్మః సనాతనః👌

40. మంచితో మసలు...

✍️ పూజ్యగురువులు శ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు.
🌹💫🌈💫🌈🕉️🕉️💫🌈💫🌈🌹

🙏 మంచితో మసలు... 🌹

అన్ని ధర్మాలకీ ఆధారం సత్సంగం. సంగం - అంటే సంపర్కం. సద్విషయాలతో, సత్పురుషులతో సంపర్కమే సత్సంగం. మనిషికి సంగం అనివార్యం.

💫 సంగం ప్రభావం మనసుపై ప్రగాఢం. మన ఆలోచనలు, ఆచరణలు 'సంగం' వల్లనే బలపడతాయి. ఆధ్యాత్మికమార్గంలో, అభ్యుదయపథంలో సత్సంగం ఆవశ్యకం - అని శాస్త్రాలు నిర్దేశిస్తున్నాయి.

💫 ఇద్దరు ఋషులు వాదన చేస్తుండగా ప్రసంగ సందర్భంగా - 'నా అభిప్రాయం తప్పితే నా వెయ్యేళ్ళ తపస్సు ధారపోస్తాను' అన్నాడట ఒక ఋషి.

💫 'నేను ఒక రోజు సత్సంగఫలాన్ని ధారపోస్తాను' అని పలికాడట రెండవ ఋషి.

వెయ్యేళ్ళ తపస్సు ఒకరోజు సత్సాంగత్యంతో సమానమని దీని భావం.

తులయామ లవేనాపి న స్వర్గం నా పునర్భవమ్|
భగవత్సంగి సంగస్య మర్తాన్యాం కిముతాశిషః||

- అని శ్రీ మద్భాగవతం చెబుతోంది.

💫 'భగవద్భక్తులతో సాంగత్యం ఒక్క నిమిష మాత్రమే అయినప్పటికీ అది స్వర్గాపవర్గ సుఖాలకంటే గొప్పది. అటువంటి దానికి లౌకిక సుఖాలు సాటి రావని వేరే చెప్పాలా?’ జ్ఞానమార్గంలో, భక్తి యోగంలో సత్సాంగత్య మే ప్రధానం. మనిషిని పరమాత్మవైపు మళ్లించే త్రోవ మహాత్సంగం.

💫 సత్పురుషుల నుండి వెలికి వచ్చే సద్విషయాలు శ్రవణం చేస్తుంటే మనస్సు ఆ 'సత్' తో తాదాత్మ్యం చెందుతుంది. శాంతికీ, చిత్తశుద్ధికీ హేతువవుతుంది.

వ్రతాని యజ్ఞశ్చందాసి తీర్థాని నియమాయమాః।
యథావరుంధౌ సత్సంగః సర్వసంగాపహెూహిమామ్||

💫 ‘వ్రతాలు, యజ్ఞాలు, వేదాలు, తీర్థాలు, నియమాలు, యమాలు... ఇవేవీ కూడా "సత్సంగం" వలె నన్ను వశ్యుని చేయలేవు' అని సాక్షాత్తూ శ్రీ కృష్ణ భగవానుడే ఉద్ధవునితో వివరించాడు. (శ్రీమద్భాగవతం)

మహత్సంగస్తు దుర్లభో౬గమ్యో౬మోఘశ్చ॥

(నారదభక్తి సూత్రాలు - 39)

💫 మహాపురుషుల సాంగత్యం...
1) దుర్లభం, 2) అగమ్యం,
3) అమోఘం.

🌈 దుర్లభం: దొరకడం కష్టం. స్వధర్మ పరాయణులు, సాధు ప్రవర్తన కలవారు, భగవత్తాదాత్మ్యం కలవారు, జ్ఞానులు - అయినవారు అరుదు. వారు లభించడమే అత్యంత కష్టసాధ్యం. అనేక జన్మల పుణ్యసంస్కారం ఉంటే గానీ మహాత్ములు తారసపడరు. మంచి ఎప్పుడూ అరుదే.

🌈 అగమ్యం: వారు తారసపడినా గుర్తించడం కష్టం. ప్రచారం, ప్రకటన పట్టని సత్పురుషులు తమను తాము మరుగుపరచుకుంటారు. వారు అత్యంత నిరాడంబరంగా సంచరిస్తారు.
ఉదా: పిచ్చివానివలె సంచరించే శుకయోగింద్రుల వంటివారు, వారిని పోల్చుకోవడమే కష్టం.

🌈 అమోఘం: ఒక వేళ వారి సాంగత్యం దొరికిందా, అది 'వ్యర్థంకాదు' తప్పక సత్ఫలితం ఇస్తుంది. ఈశ్వరానుగ్రహం వలననే సత్సాంగత్యం లభిస్తుంది. సత్సంగం వల్లనే ఈశ్వరప్రాప్తి సిద్ధిస్తుంది. అసలు భగవంతునికీ వారికీ భేదం లేదు.

సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహమ్ |
మదన్యత్తే నజానంతి నాహం తేభ్యోమనాగపి||

💫 “సత్పురుషులు నాకు హృదయం. వారికి నేను హృదయం. నన్ను తప్ప వారు ఇతరమేదీ ఎరుగరు. వారిని తప్ప నేను ఇతరాన్ని గుర్తించను" అని శ్రీకృష్ణ వచనం.

💫 ఇదే భావాన్ని... 'తస్మింస్తజ్జనే భేదాభావత్' (భగవానునికి ఆయనవారైన భాగవతులకీ భేదం లేదు) అని నారదుడు వాక్రుచ్చాడు.

త దేవ సాధ్యతాం- తదేవ సాధ్యతామ్

💫 'సత్సంగాన్నే సాధించు. దానినే సాధించు' అని నొక్కి నొక్కి ఉద్ఘాటించాడు.

💫 భక్తిమార్గంలో ఉన్నవారు భగవంతుని గురించి భావించే భాగవతులతోనే మసలాలి. వారివల్ల మెళకువలు తెలుస్తాయి, సాధన బలపడుతుంది. మనలో పూర్వజన్మ సద్వాసనల వలన అంకురించిన ఆధ్యాత్మిక సంస్కారం వృక్షమై ఫలించాలంటే సత్సాంగత్యమే దోహదం. అది లేకుంటే ఆ సంస్కారం మొలక దశలోనే నశిస్తుంది.

💫 తనకోసం తపించేవారిని తన దగ్గరికి రప్పించుకోడానికి పరమేశ్వరుడు, తనవారైన సత్పురుషులను ముందు పంపిస్తాడు. ఒక విధంగా - ఆ రూపంలో తానే వస్తాడని భావించవచ్చు. 'దైవం మానుషరూపేణ' అనే దానికి ఇదే సరియైన సమన్వయం.

💫 పరీక్షిన్మహారాజు పరమపద ప్రాప్తికై తహతహలాడుతూ ఉన్న దశలో- శుకమహర్షి అటువైపు వచ్చాడు. ఇదే భగవత్కృపకి నిదర్శనం. ఆ సత్పురుషుని శరణువేడాడు పరీక్షిత్తు.

💫 గోదోహనకాలం (ఆవుపాలు పిదికే సమయం) మాత్ర మే నిలిచే అవధూత, ఏడు రోజులపాటు ఆ మహారాజు సమక్షంలో ఉండి భాగవతాన్ని ఉపదేశించడమే పరీక్షిత్తు భాగ్యం. ఆ సత్సంగం అమోఘమై ఫలించింది.

💫 రహెూగణుడనే రాజుకి జడభరతుని సాంగత్యం చేత జ్ఞానం లభించింది. వివేకానందుని శ్రీరామకృష్ణుల సాంగత్యమే తరింపజేసింది. వివేకానందుల సాంగత్యం మరెందరినో యోగుల్ని చేసింది. ఒక నావ ఎందరినో ఒడ్డుకు చేర్చినట్లుగా సత్పురుషుడు అనేక మందిని తరింప జేస్తాడు.

💫 దుష్టసంస్కారాలు కలిగినవారిని కూడా సత్సంగం మంచి వైపు మళ్లిస్తుంది. దారులుకొట్టి బ్రతికే బందిపోటు దొంగ సత్పురుషుల సాంగత్యం వల్లనే రామయోగిగా మారి రామకథను అందించిన వాల్మీకి అయ్యాడని - ఆధ్యాత్మ రామాయణం చెప్తున్న గాథ.

💫 మంచి మార్గంలో పయనిస్తున్న వారికి సత్పురుషుల సహవాసం మార్గ బంధువుగా లభించి, ఆ మార్గంలో మరింత సులభంగా ముందుకు తీసుకువెళుతుంది. అందుకే మంచి సంస్కారాలున్న వారు, మంచివారి కలయికనే కోరుకుంటారు. దానివల్ల వారిలో సద్భావాలు చెదిరిపోకుండా, మరింత బలపడతాయి. అందుకే ప్రయత్నపూర్వకంగా సత్సాంగత్యాన్ని సాధించాలని శాస్త్రాల బోధ.

💫 మహత్సంగం నిరంతరం మనల్ని దివ్యానుభూతిలో ఉండేటట్టు చేస్తుంది. నిప్పుమీద ఉన్నంత సేపు నీరు వేడెక్కినట్టు, సంగం బట్టి భావాలుంటాయి. సంగం దూరమైతే మళ్లీ మనస్సు మామూలు స్థితికి రావచ్చు. పైగా - లోకంలో మన విశ్వాసాన్ని చెదరగొట్టి, అయోమయంలో పడేసే విషయాలు వేలకొలది ఉన్నాయి. వాటి దుమారం నుండి రక్షించేది సత్సంగం మాత్రమే.

💫 ఏదో ఒకదానికి అంటుకొనే లక్షణమున్న మనస్సుకి సద్విషయాలు లభించకపోతే, దుర్విషయవిషాలు అంటుతాయి. అవి మనసులో ప్రవేశించి విషమయం చేస్తాయి.

💫 సత్సాంగత్యాన్ని సాధించవలసినదని ప్రబోధించిన నారదుడు- 'దుస్సంగః సర్వదైవ త్యాజ్యః' - దుస్సంగాన్ని అన్ని విధాల విడిచిపెట్టాలని హెచ్చరించాడు. (నారదభక్తి సూత్రాలు)

💫 మానవులే కాదు విషయాలు కూడా సంపర్కమే. మంచిని దూరం చేసే సాహిత్యం, కాలక్షేపం, పదార్థాలు ఇవన్నీ దుస్సాంగత్యమే. 'సత్' సంపదను వృద్ధిచేసే వాఙ్మయాదులు సత్సంగమే. ఉత్తమ సంస్కారాలను వృద్ధిచేసే సారస్వత సంగీతాదుల సంపర్కం మనస్సుకి మహౌషధంలా పనిచేసి, దుర్భా వజాడ్యాన్ని పోగొడుతుంది.

💫 పరిమిత శక్తులు కలిగిన బుద్ది దుష్ట సాంగత్యం వల్ల తొందరగా కలుషితమవుతుంది. బలహీనమైన శారీరక స్థితి కలిగిన వానిని కలుషిత వాతావరణం తొందరగా రోగగ్రస్తుని చేసినట్లుగా, సాధనాబలంలేని సామాన్య బుద్ధులు నాస్తిక దుర్జన సంపర్కం వల్ల తొందరగా దుష్ప్రభావానికి లోనవుతాయి.

💫 లౌకిక విషయాలే సమస్తమనుకొని వాటితోనే ఆనందిస్తూ, ధర్మాల హద్దులను అతిక్రమించే వారే దుర్జనులు. ‘వారి వలన సత్యం, పవిత్రత, దయ, బుద్ధి, మననశీలత, లజ్జ, కీర్తి, శోభ, క్షమ, నిగ్రహశక్తి, ఐశ్వర్యం - మొదలైన ఉత్తమగుణాలు అంతరిస్తాయని కపిలాచార్యుని బోధ (భాగవతం).

💫 ప్రతివాని మనసులో తరంగాలవలె ఉండే దుష్టసంస్కారాలు, మనోవికారాలు, దుస్సాంగత్యం వలన సముద్రాల వలె అవుతాయని నారదుని మాట. అసలు ఏ సంగమూ లేని మనస్సు నిర్మలమౌతుంది. ఆ స్థితికి సత్సంగమే దారి చూపుతుందని ఆదిశంకరులు ప్రసిద్ధ వచనం.

'సత్సంగత్వే నిస్సంగత్వం...'

💫 సాధుపురుషులు విశ్వాసానికి బలమిస్తారు. శాంతిని ప్రసాదిస్తారు. అందుకే భగవద్భజనాసక్తులు నిరంతరం సత్పురుషులతో సంచరిస్తూ తద్వారా సద్విషయమైన పర మాత్మభావనలో తన్మయులై ధన్యులవుతారు.

మచ్చిత్తా మద్దత ప్రాణాః బోధయన్తః పరస్పరం!
కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతిచ॥
(భగవద్గీత)

💫 ‘నాపై చిత్తం, ప్రాణాలు ఉంచిన మహాత్ములు ఒకరి కొకరు బోధించుకుంటూ, చర్చించుకుంటూ నిత్యం తృప్తిగా ఆనందిస్తారు. (కృష్ణవచనం)

ఇదీ సత్పురుషుల స్థితి. అటువంటి మహాత్ముల పాదాలకు అంజలిద్దాం. వారి సాంగత్యాన్ని ప్రసాదించమని భగవంతుని ప్రార్థిద్దాం. 🙏

🌹💫🌈💫🌈🕉️🕉️💫🌈💫🌈🌹

సేకరణ

No comments:

Post a Comment