అణ్ణామలై జాతకం ప్రకారం సన్యాసి అవుతారని తెలిసి ఆయన తండ్రి ఆయనను చదివించలేదు[1]. అయినా తనంతట తానే చదవడం నేర్చుకున్నారు. 17 ఏళ్లకు ఇంట్లో నుండి పారిపోయి, 22 యేళ్లకు రమణ మహర్షి దగ్గరికి చేరారు. అయనకి వ్యక్తిగత సహాయకుడిగా ఉంటూ, ఆశ్రమంలో భవన నిర్మాణ కార్యక్రమాలను పర్యవేక్షించారు. అలా పది ఏళ్ళు గడచిన తర్వాత మహర్షి ఆదేశం మేరకు, తదుపరి జీవితమంతా తత్త్వ విచారణకు అంకితం చేసి, ఆత్మజ్ఞానాన్ని పొందారు.
అణ్ణామలై స్వామి ప్రత్యేకత ఏమిటంటే ఆయన బోధనలు సూటిగా ఆచరణాత్మకంగా ఉంటాయి. ‘మనసు’ గురించి ఆయన ఈ విధంగా చెప్పారు.
మనము గాఢంగా నిద్రిస్తున్న ప్రతీసారి మన మనసు మాయమవుతుంది. ఈ విషయాన్ని మనము కాదనలేము. మరి ఆ సమయంలో మనము పూర్తిగా లేమా అంటే అలానూ అనలేము. అంటే మనస్సు లేకుండా మన ఉనికి సాధ్యమే. అది లేకుండా మనము ఉండగలుగుతున్నామంటే, మనము మన మనస్సు ఒకటి కాదు. ఈ విషయం మనకు నిశ్చయంగా మన రోజూవారీ అనుభవంలో రూఢీ అవుతూనే ఉంది.
కానీ పొద్దున్న మనసు మేల్కొనడంతోనే మనము లేచామని భ్రమపడతాము. ఇది ఎంత అజ్ఞానం. మెలకువ, కలత నిద్ర, గాఢ నిద్ర స్థితులను మీరు నిశితంగా గమనిస్తే, స్థితి ఏదైనా మీ ఉనికి నిరాటంకంగా కొనసాగుతుందనీ, మీ మనస్సే వచ్చి పోతుంటుందనీ మీ అనుభవంలోనే తెలుస్తుంది.
ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని, మీరు మరుసటి రోజు లేవగానే, మీ ఉనికిని మనస్సుతోను, ఆలోచనలతోనూ ముడిపెట్టకండి. కేవలం వాటిని గమనించండి. మిమ్మల్ని ఆవహించనివ్వకండి. ఇలా చేస్తూ పొతే కొన్నాళ్ళకి మీకు ఒక విషయం అనూహ్యంగా అనుభవైక్యమౌతుంది. అదేంటంటే, మీ ఉనికి “నేను” అనే రోజు ఉదయించే కథను, ఆలోచనలను దాటి, చైతన్యమనే క్షేత్రంలో స్థిరపడుతోంది.
ఈ యెఱుక అనూహ్యత ఎటువంటిదంటే, మసక చీకటిలో తాడును చూసి పాము అని భయపడి, వెలుగులో అది తాడే అని తెలిసినపుడు అప్పటివరకూ ఉన్న భయం ఎలా కరిగిపోతుందో, అలా చైతన్యం అనే వెలుగులో ‘నేను’ అనే భ్రమ, దాని తాలూకు భయాలు, వ్యాకులత, రాగద్వేషాలు కరిగిపోతాయి.
“నేను” అంటే శరీరము మనస్సుల కలయిక అనేది కుంచితమైన అవగాహన. ఈ భావన మనలో జీవిత కాలంగా కరడుగట్టింది. “నేనంటే అల్పమైన శరీరం, మనస్సు, ఆలోచనలూ కాను, అవి ఏర్పడే క్షేత్రాన్ని” అని తీక్షణ విచారణ ద్వారా నమ్మకం ఏర్పరుచుకుంటే, ఈ అజ్ఞానం నెమ్మదిగా పలుచనై, ఒకనాటికి పూర్తిగా ఆవిరైపోతుంది. అపుడు, ఆకాశంలో వచ్చి పోయే మేఘాలు, ఆకాశాన్ని ఎలా ఏ విధంగానూ ప్రభావితం చేయవో, మీ మదిలో వచ్చి పోయే ఆలోచనలు కూడా మిమ్మల్ని ప్రభావితం చేయవు. అపుడు మిగిలేది అనిర్వచనీయమైన శాంతి.
No comments:
Post a Comment