ప్రకృతి వైద్యం:
#రిఫైన్డ్ వంటనూనెల్లో విషాలున్నాయా?
డాక్టర్ జీవీ పూర్ణచందు గారి వ్యాసం
ప్ర: డాక్టరుగారు! పూర్వంలాగా మనకు సహజంగా నూనె గింజల్లోంచి తీసిన వంటనూనె దొరకటం లేదు. దొరికినా కల్తీ కలవలేదని ఎంతవరకూ నమ్మవచ్చో తెలీటం లేదు. ప్యాకెట్లలో దొరికే రిఫైన్డ్ నూనెలు ఆరోగ్యానికి మంచివేనా? వాటి వివరాలు చెప్పగలరు.
(జి. కైలాసరావు, పెదపాడు)
జ: #రిఫైన్డ్_నూనె లో మంచి అనేది ఒక బ్రహ్మ రహస్యం. దాని గురించి సామాన్య మానవుడికి ఏమీ తెలీదు. రిఫైన్డ్ ఆయిల్ పేరుతో మనం చచ్చినట్టు కొనవలసి వస్తున్న వంటనూనె ప్యాకెట్లు నిరపాయకరమైనవనీ, నూనెగింజల్లోంచి నేరుగా తీసిన నూనెకన్నా మెరుగైనవనీ, రుచికరమైనవనీ, మనకు మన ప్రభుత్వం హామీ ఇచ్చిందా? మన శాస్త్రవేత్తలు అలా భరోసా ఇచ్చారా? మనం వంటల్లోకి వాడుతున్న ఈ రిఫైన్డ్ బాటిల్ లేదా ప్యాకెట్టు నూనెల మంచీ చెడు గురించి పూర్తిగా తెలిసే వాటిని వాడుతున్నామా? కనీసం నూనె ప్యాకెట్టు మీద ఆ కంపెనీ వాళ్ళైనా అలా అని హామీలాంటిదేమైనా వ్రాశారా? ఇవి ఏవీ నిర్థారించుకోకుండానే మనం ప్రచార ఆర్భాటానికి లోబడి ప్యాకెట్టు నూనెల్ని వాడేస్తున్నాం.
సాంకేతికంగా ఎక్కువ రిఫైన్ చేసిన వంటనూనెని “ప్లాష్టిక్ ఫాట్” అంటారు. ఈ రిఫైన్మెంట్ అనేమాటకు పరిశుభ్రం చేయబడిన అనే అర్థాన్ని మనం ఊహించుకుంటున్నాం. కానీ, అది అపోహే! రిఫైన్ చేయటం అనేది మూడంచెల్లో జరుగుతుంది. మొదటి దశలో నూనెలోని కొవ్వుని స్థీరీకరిస్తారు. దీన్ని న్యూట్రలైజేషన్ (N) అంటారు. రెండవదశలో బట్టల షోడా లాంటీ ఒక రకం మట్టిని కలిపి దాని రంగుని తొలగిస్తారు. దీన్ని బ్లీచింగ్ (B) అంటారు. మూడవ దశలో దాని వాసనను కూడా తీసేస్తారు. దీన్ని డీ-ఆడరైజేషన్ (D) అంటారు. ఈ విధంగా నూనెలోని సహజమైన రంగు, రుచి, వాసనలన్నీ పోయిన ఈ నూనెని NBD OIL అంటారు.
వాడకం దారుడికన్నా అమ్మకం దారుడికే రిఫైన్ ఆయిల్ వలన ప్రయోజనం ఎక్కువ... ఇలా రిఫైన్ చేస్తే, అది కిరాణా కొట్లో ఎక్కువ రోజులపాటు నిలవుంటుంది. వేరుశనగనూనె వంటకాలకు కమ్మని రుచి నిస్తోంది. ఎక్కువ రోజులు నిలవుంటే ఆ సువాసన పోయి మాగుడు వాసన వస్తుంది. అందుకని, ఆ నూనెకున్న సువాసనని తొలగించేస్తే ఇంక మాగుడు వాసన రాదన్నమాట. అదీ వాణిజ్య ప్రయోజనం. ఇందులో మన ఆరోగ్య ప్రయోజనం ఏమీ లేదు. కానీ, మనం కమ్మని సువాసనని మాత్రం కోల్పోతున్నాం. రిఫైన్ చేయటానికి ఫాస్ఫారిక్ ఆమ్లం లాంటి రసాయనాలను కూడా కలుపుతారని తెలుస్తోంది. దాని చెడు ప్రభావం ఆ నూనె మీద ఎంత ఉంటుందో మనకు తెలీదు.
వేరుశనగ నూనె గోదుమ రంగులోనూ, నువ్వులనూనె నల్లగాను, పప్పునూనె బంగారు రంగులోనూ ఇలా ఒక్కో నూనె ఒక్కో సహజ వర్ణంలో చూడగానే గుర్తుపట్టేలా ఉంటాయి. దానిని బ్లీచింగ్ చేసినందువలన కొంచెం తెల్లగా ఉండే రిఫైన్ నూనె తయారౌతుంది. దాన్నిశక్తిమంతమైన ఫిల్టర్స్, ప్రెస్సులు, పాలిషింగ్ ఫిల్టర్లతో శుద్ధి చేస్తారు. 200 డిగ్రీలదాకా వేడి చేస్తారు కూడా! అందువలన ఆ నూనెలోని ప్రాధమిక అంశాలన్నీ మారిపోయి, ఒక విధమైన ఫాటీయాసిడ్ తయారౌతుంది. ఈ ప్రక్రియని ఐసోమెరైజేషన్ అంటారు. ఇదే ‘ప్లాష్టిక్ ఫాట్’ అంటే! ఇలా అతి వేడి దగ్గర కాయటం వలన ఈ నూనెలో ఉండే లిగ్నాన్ లాంటి ఫైటో కెమికల్స్ అనే ఉపయోగ కారక అంశాలు కూడా తొలగించబడి, క్యాన్సర్ కారకమైన(ఎక్రిలమైడ్‘లాంటి) విషరసాయనాలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంట్లో ఒకసారి కాచిన నూనెని వంటనూనె అంటారు. మామూలు నూనెకీ ఈ వంటనూనెకీ ఎలాంటీ తేడా ఉన్నదో అలాంటి తేడానే మామూలు నూనెకీ రిఫైన్ నూనెకీ ఉంది. ఈ నూనెల తయారీ విషయంలో అపోహలను తొలగించి, అత్యున్నత ప్రమాణాలతో ఆరోగ్య దాయకమైన నూనెగా రిఫైన్డ్ నూనెని ప్రభుత్వం నిర్థారించవలసిన అవసరం ఉంది.
మార్కెట్లో రిఫైన్ నూనె తప్ప మామూలు నూనె దొరకడం లేదు కాబట్టి, దాన్నే ఆధునిక అమృతంగా భావించి తెచ్చి, బూరెలమూకుడులో సలసలా కాచి, కోమలమైన కూరగాయల ముక్కల్ని తరిగి అందులో వేసి, నరకలోకంలో పాపుల్ని వేయించినట్టు వేయించుకుని ఉప్పు కారం చల్లుకుని ఇదే కూరంటే...అనుకుంటూ తింటున్నాం. ఆ నూనెని పదే పదే కాచి మరింత విషతుల్యం చేసుకుంటున్నాం.
పోషక విలువల మీద పరిశోధన చేసిన ఉడో ఎరామస్ అనే రచయిత తన FATS THAT HEAL, FATS THAT KILL అనే పుస్తకంలో “ఉపయోగ పడే కొవ్వుల్ని అపకారం చేసే విధంగా మార్చే రిఫైన్డ్ నూనెల్ని వాడటం వలన జబ్బులు కొని తెచ్చుకున్నట్టే అవుతుందనీ, chemically extracted/ refined నూనెలు కేన్సరుకు దారితీస్తాయని హెచ్చరించాడు. నూనె గింజల్లోంచి సహజంగా తీసిన నూనెని పూర్తి అసహజంగా మార్చి మనం ఆరోగ్యాన్ని పణంగా పెట్టుకుంటున్నాం అని ఇది చదివితే అర్థం అవుతుంది.
రిఫైన్ చేయని సహజమైన వంటనూనెలో Omega-6 polyunsaturated fatty acids అనే చెడ్ద కొవ్వు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది గుండె జబ్బులకు దారితీయవచ్చుననేది ఒక వాదన. ఇది సోయాబీన్ నూనె, సన్ ఫ్లవర్ నూనె , ప్రత్తి నూనెలకే గానీ, ఆలివ్ నూనె, కొబ్బరి నూనె, నువ్వులనూనెలకు వర్తించవని ఇంకో వాదన కూడా ఉంది. సహజమైన నూనెలో చెడ్డకొవ్వు గురించిన ప్రచారం మీద కూడా శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలున్నాయి.
వాణిజ్య ప్రయోజనాలకోసం జనారోగ్యాన్ని పణంగా పెడ్తున్నారు. పాశ్చాత్యదేశాల్లోనే ఈ వొరవడి మొదలయ్యింది! దాని ఫలితాల్ని పాశ్చాత్యులతోపాటు మనం కూడా అనుభవించాల్సి వస్తోంది.
ఏ నూనె మంచిదని అడక్కండి! నూనె ఒక బ్రహ్మపదార్ధం. వాణిజ్య పరంగా మనకు దొరుకుతున్న వంటనూనె లోని మంచీ చెడుల్ని తర్కించకుండా జంతుసంబంధమైన నెయ్యి, వెన్నలకు వ్యతిరేక ప్రచారం వలన ప్రయోజనం లేదు.
ఆయుర్వేద శాస్త్రం ఏ ద్రవ్యాన్నైనా నూనెలో వేసి వండితే దాని శక్తి సగానికి సగం హరించుకు పోతుందనీ, పైగా విషతుల్యం అవుతుందని హెచ్చరించింది. కూరల్ని, ఇతర వంటకాల్ని నూనెలో వేసి వండటానికి ప్రాధాన్యత నివ్వకండి. ఇప్పుడు దొరుకుతున్న రిఫైన్డ్ నూనెలకూ ఈ సూత్రం వర్తిస్తుంది. నూనె వాడకాన్ని నాలుగో వంతుకు తగ్గించుకోవటమే ఉత్తమ ప్రత్యామ్నాయం.
No comments:
Post a Comment