Saturday, March 4, 2023

దీపం ఉండగానే....* పూజ్యగురువులు శ్రీ చాగంటి వారి - *"మహేశ్వరవైభవమ్"* నుండి

 🌹దీపం ఉండగానే....*
పూజ్యగురువులు శ్రీ చాగంటి వారి -
*"మహేశ్వరవైభవమ్"* నుండి 🌹
🍁🍁🍁🍁🍁🍁🍁🍁

 భాగవతంలో పోతన గారు ఒక అద్భుతమైన                      పద్యాన్ని యముని నోట వెంట చెప్పించారు... 

*మచ్చిక వీరికెల్ల బహుమాత్రము జోద్యము, దేహి వుట్టుచున్* 
*జచ్చుచు నుంట జూచెదరు, చావక మానెడువారి భంగి నీ* 
*చచ్చినవాని కేడ్చెదరు చావున కొల్లక డాగవచ్చునే?* 
*ఎచ్చట బుట్టె నచ్చటికి నేగుట నైజము ప్రాణికోటికిన్.*

ఒక చనిపోయిన శవాన్ని పెట్టుకుని...
చావబోయే శవాలు విచిత్రంగా ఏడుస్తుంటాయి.!                అంతకన్నా అశ్చర్యం ఉండదు.*
ప్రతివారికీ పుట్టినవాడు చనిపోతాడని తెలిసికూడా ఏడుస్తారు. జీవుడు కాలంలో ఎక్కడో తిరిగి తిరిగి, ఎక్కడ నుండి వచ్చాడో అక్కడకు వెళ్ళిపోవడం నైజం. ఆ మాయ నుండి ఎలా మారాలో, 
శంకర భగవత్పాదులు దాని పరిశీలనానికి
మార్గాన్ని చెప్పారు.

*కాతే కాంతా కస్తే పుత్రః* 
*సంసారో౬య మతీయ విచిత్రః*
*కస్య త్వం కః కుత ఆయాతః*
*తత్త్వం చింతయ తదిద భ్రాతః ॥*  (భజగోవిందం)

*కాతే కాంతా* 

భార్య ఎవరు? ఎక్కడ నుండి వచ్చింది?
అది తెలియదు.

*కస్తే పుత్రః*

నీ పుత్రులు ఎక్కడనుండి వచ్చారు? అదీ తెలియదు.

*సంసారొ౬య మతీవ విచిత్రః*

భార్యాబిడ్డలే సంసారం. ఎప్పటికి జీవయాత్ర అవుతుంది? ఎన్నాళ్ళీ ప్రయాణం?

*కస్యత్వం?*

నువ్వు ఎవరు?

*కః కుత ఆయాతః*

ఎక్కడనుంచి వచ్చావు?

మా అమ్మగారి కడుపులో నుండి వచ్చాను
అంటే... కడుపులోకి రావడానికి ముందు ఎక్కడున్నావు, అంతకు ముందు ఎక్కడ తిరుగుతున్నావు? ఎప్పటికి ఈ జీవయాత్ర ఆగేది? ఎన్నాళ్ళీ ప్రయాణం అని విసుగు లేదా?

*పునరపిజననం పునరపి మరణం* 
*పునరపి జననీ జఠరే శయనం |*

ఇన్నేళ్ళు అయింది, ఇంక *ఎవ్వారి రక్షించెదన్* అంటాడు ధూర్జటి. అందువలన నా కోసం నేను చేసుకున్నది లేదు కాబట్టి ఈశ్వరా, నాకు జ్ఞానమియ్యి చాలు.

రామకృష్ణ పరమహంస ఒక అద్భుతమైన ఉపమానం చెపుతుండేవారు. ఒక త్రాచుపాము ఒక కప్పని పట్టుకుని మింగుతూంది, సగం కప్పని మింగింది. కప్ప వెనకభాగం పాము నోట్లో ఉంది, ముందు భాగం బయటికి ఉంది. కప్ప నోటి భాగం ముందు ఒక ఈగ ఎగురుతున్నది. ఆ ఈగని పట్టుకోవడానికి కప్ప నాలిక చాపుతున్నది. ఏమి ఆశ్చర్యం? పరమసత్యం. ఎవరెంతకాలం ఉంటారో తెలియదు. 

శరీరంతో ఈశ్వరుణ్ణి పొందాలన్న ఒక్క ఆలోచన లేక, అన్ని విషయాలలో ఎంతో జాగ్రత్త తీసుకుంటాం. ఆత్మద్రోహం చేసుకుంటున్నాం. ఇంత గొప్ప ఉపాధి వచ్చినా ఏ పుణ్యకార్యమూ చెయ్యలేదు, ఏ నామమూ చెప్పలేదు. మిగిలినవాటి మీద పరమశ్రద్ధ. 

ఒక్కసారి ఊపిరి ఆగిపోతే కొత్త చాపలో చుట్టి తీసుకుని వెళ్ళి కాల్చేస్తారు. 11 రోజులు దాటిపోతే ఎవరూ గుర్తుకూడా ఉంచుకోరు. అంత మాత్రానికి వెంపర్లాడటమెందుకు? జీవుడు మళ్ళీ జన్మకు జాగ్రత్త పడాలి కదా! దానికేమీ చెయ్యడం లేదు. ఈశ్వరుడి గురించిన చింతే లేదు. ఎప్పుడో అంటావెందుకు? జీవుడు కూడా వచ్చే జన్మకు జాగ్రత్త పడాలి కదా! దానికి చేసింది లేదు. ఎప్పుడు చేస్తావు అంటే,

*దంతంబుల్ పడనప్పుడే తనువునం దారూఢి యున్నప్పుడే* 
*కాంతాసంఘము రోయనప్పుడె జరాక్రాంతంబు గానప్పుడే* 
*వింతల్‌మేన జరించనప్పుడే కురుల్ వెల్వెల్ల గానప్పుడే* 
*చింతింపన్‌వలె నీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వరా!*

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కాలం అనుల్లంఘనీయం. బహుధా పరాకు చెపుతుంది. ఉండని ఉపాధిని ఆధారం చేసుకుని ఉపాసన ద్వారా ఎప్పుడూ ఉండే సత్యంలోకి వెళితే, శరీరం పడిపోతున్నా బెంగ ఉండదు. సత్యం ఎరుకలోనికి తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెడితే, ఈ జన్మలో కాకపోయినా, ఎప్పటికైనా ఈశ్వరుని దగ్గరకు నడుస్తాం. వెళ్ళిపోయిన ఒక్క క్షణాన్ని వెనకకు తెచ్చేవారు లేరు. ఈశ్వర శాసనానికి నడిచే కాలంలో జాగ్రత్త పడకపోతే ఇబ్బందిపడతాం. శరీరంతో తెచ్చిపెట్టుకున్నవన్నీ దానితోనే వెళ్ళిపోతాయి. 

కాలానికి ఉన్న గొప్ప లక్షణం గ్రసించటమే.
కాలానికి శంకరాచార్యులు చెప్పిన పర్యాయపదం -  *జగద్భక్షకః కాలం*  - *జగత్తుని పుట్టించి జగత్తుని తింటుంది.* దాని ముందు ఎవరైనా పడిపోవలసిందే. ఎంత గొప్పవారైనా నిలబడగలిగినవారు లేరు. ఎంత గొప్పవాడైనా, భగవాన్ రమణులైనా, పరమాచార్యస్వామి అయినా శరీరాలు పడిపోవలసిందే. ఉండిపోతుందన్న భ్రాంతితో తెచ్చిపెట్డుకున్నవన్నీ శరీరంతో వెళ్ళిపోతాయి. 

శంకరభగవత్పాదులు కాలం గురించి చేసిన *భజగోవింద శ్లోకాలు* చదివితే.... బాదం పప్పుని, కాయని గూటం పెట్టి కొట్టి తీసినట్లు ఉంటాయి. పట్టిన పిచ్చిని బూజుకర్ర పెట్టి దులిపినట్లు దులుపుతాయి ఆ శ్లోకాలు. మోహవిచ్ఛేదం జరుగుంది. అందువల్లనే దానికి *మోహముద్గరం* అని పేరు. అందులో.....

*మా కురు ధనజన యౌవనగర్వం*
*హరతి నిమేషాత్కాలః సర్వం*
*మాయామయ మిద మఖిలం హిత్వా*
*బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ॥*

నేను అన్న భావన, అహంకారం, ధనం, జనం, గర్వం అన్నీఊపిరి ఆగడంతో పోతాయి. తనవారు అనుకున్నవాళ్ళందరూ పోతారు.  ఏం మిగిలింది? ఏమీ మిగలలేదు. చేసిన పుణ్యం ఉంటే వస్తుంది, లేకపోతే ఏమీ రాదు. ఇవన్నీ తియ్యడానికి ఎంతో సమయం పడుతుంది అనుకుంటారేమో......! 
ఒక నిమిషంలో అన్నీ తీసెయ్యగలదు. కాలానికి లొంగక శరీరం ఉండగా బ్రహ్మపదం పొందడానికి ప్రయత్నం చెయ్యాలి. కాలాన్ని గెలిచినవారు లేరు. ఒంట్లో ఓపిక ఉండగా చేసుకోవాలి. కాలం ఈశ్వరస్వరూపమై హెచ్చరిక చేస్తుంది. 
జాగరూకతతో మెలగాలి...
.🌹సర్వేజనాసుఖినోభవంతు 🌹

No comments:

Post a Comment