ఈ అనుభవాన్ని మనస్సులో ఎప్పటికీ పదిలపరచుకుంటాను
(స్వామివారితో శ్రీమతి బియాట్రిన్ పిట్నీలాంబ్ జరిపిన సంభాషణ)
శ్రీమతి లాంబ్ : ఈ తరం యువకుల మత విశ్వాసం పెరుగుతున్నట్లు గానీ, తరుగుతున్నట్లుగానీ, మీ పర్యటనల్లో కనిపించిందా?
స్వామివారు : భారతదేశంలో అనేక రాజకీయ పార్టీలున్నాయి. ఏ పార్టీకి మత ప్రాతిపదికలేదు. ఈతరం కుర్రకారుకు రాజకీయాలే తప్ప మరేది పట్టదు. ముఖ్యంగా విద్యార్థుల మీద రాజకీయ పార్టీల ప్రభావం ఎంతో వుంది. వారెవరికీ మతం మీద నమ్మకం లేదు.
శ్రీమతి లాంబ్ : కొంతకాలానికి పరిస్థితులు మెరుగౌతాయనే ఆశ తమకుందా?
స్వామివారు : విద్య అనేది మతాతీతంగా వున్నంతకాలం పరిస్థితు లిలాగేవుంటాయి, మెరుగుపడవు. క్రైస్తవుల విద్యాసంస్థల్లోనూ, ముస్లిం విద్యాసంస్థల్లోనూ వారివారి మతాలను గురించి చెబుతారు. కాని హిందూ పాఠశాలలో మాత్రం హిందూమతాన్ని గురించి చెప్పరు.
కాని ఇంట్లో వున్నప్పుడు మతాన్ని గురించి చెబితే పిల్లలెంతో శ్రద్ధగా వింటారు. ప్రశ్నలు వేసి ఇంకా చెప్పించుకుంటారు. పాఠశాలల్లో సాయంకాలం గంటకొట్టాక పిల్లలను కాసేపు కూర్చోబెట్టుకుని మతాన్ని గురించి మాట్లాడితే వారాసక్తిగానే వింటారు. ఇంకా తెలుసుకోవాలనే వుత్సాహం వారిలో కనబడుతుంది. ఇది ఒక విధంగా ఆశాజనకమైన పరిస్థితే. అంటే మతాన్ని గురించి తెలియచెప్పాలేగాని వినటానికీ, తెలుసుకోటానికి పిల్లలెప్పుడూ సిద్ధంగానే వుంటారన్న మాట. కొందరికి చదువులు ముగిసి పెద్దయ్యాక మతం మీద ఆసక్తి కలుగుతుంది. అప్పటిగ్గాని వారిలో వాసనారూపంగా వున్న కుతూహలం వికసించటం మొదలు పెట్టదు.
శ్రీమతి లాంబ్ : నిజంగా ఇది శోచనీయం. ఎందుకంటే మా పాశ్చాత్య దేశాల్లో అందరమూ మత, అధ్యాత్మిక వారసత్వానికి ప్రాచ్యమే కాణాచిగా భావించి దానినుండి వుత్తేజం పొందాలనుకుంటాము.
ఈ మాటలు విని స్వామివారు మాట్లాడలేదు. కొంచెం సేపు మౌనంగా వుండిపోయారు.
శ్రీమతి లాంబ్ : అమెరికాలోని మతపరిస్థితిని గురించి తెలుసుకోవాలని స్వామివారికి కుతూహలం లేదా?
స్వామివారు : ఉంది. అక్కడ పరిస్థితి గురించి విని తెలుసుకోవాలని వుంది. చెప్పండి.
శ్రీమతి లాంబ్ : విద్యావంతులైన క్రైస్తవులు పాత పురాణాలను ఇప్పుడు గుడ్డిగా నమ్మటం లేదు. అవి సాంకేతికసత్యాలే గాని అక్షరసత్యాలు కావని వారి దృష్టి. ఉదాహరణకు కన్య ఒక కొడుకును కన్నదంటే వారు నమ్మరు. అలాగే మృతపునరుత్థానం మీద వారికి బొత్తిగా నమ్మకం లేదు. క్రీస్తు పరదైవమనే ఆలోచనే వారికి రాదు. ఈ సిద్ధాంతాలన్నీ వేటికో సంకేతాలనీ, అక్షరాలా సత్య మనుకోటానికి వీల్లేదనీ వారి వాదం.
క్రైస్తవు లందరూ జీససను అనుసరిస్తారు. నిజమే. కాని జీసస్ ను ఒక మనిషిగా, గొప్ప మతగురువుగా మాత్రమే గుర్తిస్తారు. అంతేకాని దేవుడి కొడుకుగా మాత్రం కాదు. అంటే క్రైస్తవుల్లో చాలామంది క్రైస్తవ మతం ఒక్కటే మోక్షానికి మార్గం అనే సిద్ధాంతాన్ని నమ్మటం లేదన్న మాట. ఇతరమతాల్లో గూడా పారమార్థిక సత్యాలు వుండవచ్చునని వారు నమ్ముతున్నారన్నమాట.
స్వామివారు : క్రైస్తవ మతాచార్యుల్లోనూ, కేథలిక్కుల్లోనూ ఇలాటి భావాలు ప్రబలుతున్నాయా? ప్రోటీస్టాంటిజమ్ అనేది ఒక మతశాఖగా స్థిరపడినట్లు మీరు చెప్పే భావాలన్నీ ఒక ప్రత్యేకమైన
ఆలోచనాధోరణిగా స్థిరపడ్డాయా?
శ్రీమతి లాంబ్ : సామాన్యజనంలో ఇంకా పాత అభిప్రాయాలే వున్నాయి. ఆలోచనాపరుల్లోనూ, విద్యావంతుల్లోనూ ఇలాంటి భావాలు ఇప్పుడు బలపడుతున్నాయి. కేథలిక్కుల్లో కూడా విచారపరులైన వారికి ఈ కొత్త భావాలు బాగా నచ్చుతున్నాయి. అయితే పై నుంచి మతాచార్యులు పంపే ఆజ్ఞలను వారు శిరసావహించాలి గదా!
డా. రాఘవన్: అమ్మా, నేను అమెరికాలో వుండగా మీ సెనేట్లో కొంతమంది మతసంస్థలకూ, మతపాఠశాలలకూ ప్రభుత్వం గ్రాంట్లు మంజూరుచేయటాన్ని ప్రతిఘటించటం చూచాను.
శ్రీమతి లాంబ్ : అమెరికాలోని మతసంస్థలకు డబ్బువచ్చే మార్గాలు వేరే వున్నాయి.
స్వామివారు డాక్టర్ రాఘవ తో లాంబ్ మిమ్మల్నికూడా అడిగారనుకుంటాను ఈతరం యువకులను గురించి వారితో మీరేమన్నారు?
డా॥ రాఘవన్ : చాలామట్టుకు మీరన్నమాటలే అన్నాను. ఈతరం వారినీ, విద్యార్థులనీ, యితరులనీ నేను విభజించలేదు. ఆచారకాండ పాటించే విషయంలో కొంత నిర్లక్ష్యం కనపడ్డా, మతోత్సాహం మాత్రం మొత్తం మీద తగ్గలేదని కొంచెం ఆశాభావంతో మాట్లాడాను.
శ్రీమతి లాంబ్ : మిమ్ము దర్శించి మీతో మాట్లాడే ఆవకాశం కలిగించి నందుకు ఎంతో ధన్యురాలిని. ఈ అరటితోపులో ఇంతటి ప్రశాంత సుందరమైన వాతావరణంలో మీతో కొన్ని నిముషాలైనా ఆత్మీయంగా మాట్లాడటం ఒక అమూల్యమైన అనుభవం. ఈ అనుభవాన్ని మనస్సులో ఎప్పటికీ పదిలపరుచుకుంటాను.
శ్రీమతి లాంబ్ ఏం చేస్తున్నారో, వారు అధ్యయనం చేస్తున్న విషయం ఏమిటో, ఏం తెలుసుకోవటానికి భారతదేశం వచ్చారో స్వామివారడిగారు.
తాను న్యూయార్క్ విశ్వవిద్యాలయంలో భారతీయ చరిత్ర తత్త్వ సాహిత్యాధ్యా పకురాలుగా పనిచేస్తున్నాననీ, వర్తమాన భారతీయ పరిస్థితులు అధ్యయనం చేయటానికి వచ్చాననీ భారతీయ సంస్కృతి, కళలు, తత్త్వశాస్త్రం మీద తనకెంతో ఆసక్తి వుందనీ చెప్పారు.
ఆ ఉదయమే హిందూ దినపత్రికలో సమీక్షింపబడిన “భారతదేశం, ఓ మారుతున్న లోకం” అనే గ్రంథాన్ని వ్రాసినవారు వీరేనని స్వామివారితో డాక్టర్ రాఘవన్ అన్నారు.
మైసూరు మహారాజావారితో శ్రీమతి లాంజ్ కు ఎలా పరిచయం కలిగిందని స్వామివారు ప్రశ్నించారు.
న్యూయాఆర్క్ లోని ఏషియాటిక్ సొసైటీతో తనకు సంబంధం వుండటం మూలాన మహారాజావారు అమెరికా వచ్చినప్పుడు వారికి సహాయకురాలుగా వుండేదాన్ననీ, అప్పటి నుంచీ పరిచయముందనీ, వారి అతిథిగా మద్రాసు వచ్చాననీ, వారు కోరటంవలనే డాక్టర్ రాఘవన్ వెంటవుండి తనకు కంచిలోని దేవాలయాలు చూపారనీ శ్రీమతి లాంబ్ చెప్పారు.
ప్రస్తుతం శ్రీమతి లాంబ్ భారతీయ దేవాలయాలమీద ఒక గ్రంథం తయారుచేయటంలో నిమగ్నురాలై వున్నారని డాక్టర్ రాఘవన్ అన్నారు.
--- శ్రీమతి బియాట్రిన్ పిట్నీలాంబ్
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment