Sunday, July 21, 2024

కల్కి సినిమా విడుదల అయిన దగ్గర్నుంచి అర్జునుడు గొప్పవాడా? కర్ణుడు గొప్పవాడా? అన్నీ సంవాదం నడుస్తోంది ఇద్దరిలో ఎవరు గొప్ప?

 కల్కి సినిమా విడుదల అయిన దగ్గర్నుంచి అర్జునుడు గొప్పవాడా? కర్ణుడు గొప్పవాడా? అన్నీ సంవాదం నడుస్తోంది ఇద్దరిలో ఎవరు గొప్ప?
సినిమాలు, సీరియళ్ళలో ఎలా చూపించినా, ఎవరు ఏమిటనేది వ్యాసభారతం ఆసాంతం చూస్తేనే తెలుస్తుంది.

మహాభారత కాలంలో ఉన్న కొద్దిమంది ఉత్తమ విలువిద్య నిపుణుల్లో కర్ణుడు కూడా ఒకడు. ఒక వ్యక్తిగా అతనిలో గుణాలు ఉన్నాయి, దోషాలు కూడా ఉన్నాయి. కర్ణుడు అస్త్ర విద్యలో నిపుణుడే ఐనా, అతని అస్త్రములన్నీ శాపగ్రస్తములు. నేర్చుకున్న విద్యలు కపటంతో నేర్చుకున్నాడు. అటువంటి విద్య ఎన్నటికీ అక్కరకు రాదు. కర్ణుడు స్వతహాగా గర్వి, అభద్రతాపరుడు. అర్జునుడి పట్ల అసూయతో విద్యలనభ్యసించాడు.

వయసులో కర్ణుడు పాండవులందరికన్నా కనీసం పదేళ్ళు పెద్దవాడు. వయసులో అంత చిన్నవాడైన అర్జునుడితో అతని పోటీ, ఏదో చిన్నపిల్లాడితో కాలేజీ కుర్రాడు వైరం పూనినట్టు ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆ కాలపు సాటిలేని విలుకాడు అనిపించుకోవాలన్నది కర్ణుడి ధ్యేయం, కానీ అందుకోసం అంత చిన్నవాడైన అర్జునుడిని దాటాలి. ఈ అసూయే కాలంలో వైరంగా మారింది. తనను తాను సాటిలేని విలుకాడుగా నిరూపించుకోవడం కోసం దుర్యోధనుడితో స్నేహం అతనికి ఆసరా అయ్యింది.

కర్ణుడు, అర్జునుడు ఇద్దరు ద్రోణ-కృపాచార్యుల వద్ద చదువుకున్నవారే. అక్కడ అర్జునుడు విద్యలో పైకెదగడానికి ప్రయత్నిస్తే, ఆ అర్జునుడిని చూసి అసూయ పెంచుకున్నవాడు కర్ణుడు. కానీ అర్జునుడు మాత్రం ఏనాడు కర్ణుడు గురించి అంతగా ఆలోచించినట్టు కనపడదు. విద్యంటే అమితమైన ప్రేమ, ఆ విద్యలో రాణించాలి. ఆ విద్యలకై గురువుల కడ ఒదిగి ఉండు వినయము, ఆ విద్య నేర్చు సమయంబున ఎనలేని దీక్ష, కృషి అతణ్ణి మరో స్థాయిలో నిలబెట్టాయి.

పరశురాముడి తర్వాత జ్ఞానార్జన, అస్త్రసముపార్జన కర్ణుడు నిలిపివేసాడు, కానీ అర్జునుడు ఆగలేదు. దేవతలు, ఇంద్రుడు, వసువులు, అగ్నివేశుడు, కృష్ణుడు, శివుడు ఇలా ఎందరివద్దనో కృషితో, తపస్సుతో ధనుర్వేదమును, సకలాస్త్రములను సంపాదించాడు. 'అర్జునుడు దగ్గరున్నన్ని అస్త్రములు ఎవ్వరి దగ్గర లేవు. అతణ్ణి నిర్జించడం మీకెవరికి సాధ్యం కాదు. ముల్లోకాల్లో అతణ్ణి జయించగలిగేవారు లేరు.' అని పరశురాముడు సభామధ్యమున తన శిష్యులైన భీష్మద్రోణకర్ణులు వింటుండగా బాహాటంగా ఉద్యోగపర్వంలో ప్రకటించాడు.

మనకొక విద్య వచ్చినా దానిని నిరూపించుకోవటానికి సరైన అవకాశాలు రావాలి. చదివిన చదువుకు ప్రశ్నాపత్రంలాంటివి అవన్నీ. అక్కడే మన ప్రతిభ బయటపడుతుంది. అర్జునుడుకి, కర్ణుడుకి సమంగా వచ్చిన అవకాశాలు - ద్రుపదుడి పరాభవం, ద్రౌపది స్వయంవరం, ఘోషయాత్ర, ఉత్తరగోగ్రహణం. ఈ అన్ని సందర్భాల్లో కర్ణుడు విఫలమయ్యాడు, అర్జునుడే రాణించాడు.

వ్యక్తిత్వంలో, ధర్మాచరణలో కూడా అర్జునుడే కర్ణునికన్నా అధికుడు. ద్రౌపది వస్త్రాపహరణం, ఉత్తరగోగ్రహణం వంటివి అందుకు తార్కాణాలు. యతో ధర్మస్తతో కృష్ణః అంటారు, భగవానుడు అర్జునుడు వైపు ఉన్నప్పుడే తెలిసింది కదా ఎవరు ధర్మాత్ముడో.

అర్జునుడు చేసినన్ని యుద్ధాలు, అనుభవం కర్ణుడుకు లేదు. యుద్ధవిద్యలో అర్జునుడికి తెలియని విషయం లేదు. యుద్ధవిద్యలో కర్ణుడుకి తెలియని మరొక అంశం వ్యూహరచన, దాని భేదన. అర్జునుడుకి తెలియని వ్యూహ రచన-భేదము లేదు. అందుకే పద్మవ్యూహం నాడు అర్జునుడు లేకుండా చూసుకోవలసి వచ్చింది. అర్జునుడి పట్ల కర్ణుడి వైరం ఎంతటివరకు వెళ్ళిందంటే, పాండవులు తన తమ్ముళ్ళని శ్రీకృష్ణుడు ద్వారా తెలిసాక, నలుగురు పాండవుల్ని చిక్కినా విడిచిపెడతానని మాటిచ్చాడు కానీ అర్జునుడి గురించి మాత్రం మాటివ్వలేదు. కురుక్షేత్రం ముందటి వరకు ఎన్ని అవకాశాలు వచ్చినా కర్ణుడు ఒక్కసారి కూడా అర్జునుడుకన్నా మెరుగని నిరూపించుకోలేకపోయాడు
అర్జునుడు స్వతహాగా సంయమశీలుడు, ఉగ్రంగా యుద్ధం చేయడం అతని లక్షణం కాదు. కానీ అభిమన్యుడు చనిపోయిన మర్నాడు యుద్దపు 14వరోజున చూడాలి అర్జునుడి ఉగ్ర రూపం. ఒకటి కాదు మూడు వ్యూహాలు - శకట, పద్మ, శుచి వ్యూహాలు ప్రవేశించి భేదించుకుని వెళ్తాడు జయద్రథుడి కోసం. ఆ రోజు పాండవులకెంత ముఖ్యమో కౌరవులకు అంతకన్న ఎక్కువ ముఖ్యమైనది. కానీ ఆరోజు అర్జునుడు కాలాగ్ని సముడు. అతన్ని ఆపడం దేవతలతో సహా ఎవ్వరి తరమయ్యేది కాదు. He was unstoppable. బీభత్సుః అనే నామం ఎందుకు వచ్చిందాని తెలుస్తుంది. ఒంటిచేత్తో ఆనాడు 7 అక్షౌహిణుల సైన్యాన్ని మట్టుపెట్టాడు. అర్జునుడి బాణపరంపరకు ఎదురుగా 2 మైళ్ళ వరకు ఒక్క సైనికుడు మిగిలేవాడు కాదు. ఆనాడు భూరిశ్రవసుడు, కర్ణుడు, అశ్వత్ధాముడు, శల్యుడు, వృషసేనుడు, కృపుడు, ఇందరు మహారథులు జయద్రథుడికి కాపలా ఉన్నారు. వీళ్ళలో ఒక్కరు కూడా అర్జునుడుని ఆపలేకపోయారు. ఒకసారి కాదు రెండు సార్లు అర్జునుడి చేతిలో కర్ణుడు చావకుండా అశ్వత్ధామ కాపాడాడు. చివరకు జయద్రథుని అర్జునుడుకి వదిలేసి, అందరితో కలిపి కర్ణుడు కూడా యుద్ధభూమి నుండి పారిపోతాడు. అది అర్జునుడి అసలు పరాక్రమం.

ఇలా ఎంతైనా చెప్పొచ్చు. ఇక ఆఖరుగా కర్ణుడుకి అర్జునుడుకి కలిపి 17వరోజున జరిగిన యుద్ధం చాలా ముఖ్యమైనది. ఆనాడు యుద్ధానికి వెళ్ళే ముందు, తన సారథి శల్యుడుతో కర్ణుడు నేరుగా అన్న మాటలివి. Right from the horse's mouth అంటారే, అటువంటి వాక్యాలివి -

ఓ శల్యా ! నేను విన్నంతలో, ఏ యోధుడు ఈ ప్రపంచం మొత్తం మీద అటువంటి మహారథుడు లేడని కీర్తి గడించాడో, అటువంటి అర్జునుడితో నేను ఈ రోజు ఆజికి దిగుతాను. శ్వేతాశ్వరథారూఢుడై రణభూమియందు చరించే ఈ అర్జునుడి చేతిలో నాాకీనాడు మృత్యువు తథ్యము. నా మరణంతో కౌరవుల మిగతా వీరులంతా నిశ్చితంగా సమసిపోతారు. ఆ అర్జునుడి చేతులకు ఏనాడు చెమట పట్టదు, అవి ఏనాడూ వణకవు. అతని అస్త్రశస్త్రములు సుదృఢమైనవి. ఆతని చేతులు అమిత వేగముతో కదులుతాయి. అటువంటి పాండుపుత్రుడు అర్జునకు సమయోధుడు ఎక్కడ లేడు.

కర్ణుడు-అర్జునుడు ఇద్దరు మహాయోధులు, ఎవరి వ్యక్తిత్వాలు వారివి. కానీ కర్ణుడా? అర్జునుడా? అంటే మాత్రం అర్జునుడే అన్నిటా గొప్పవాడు. ఆ విషయాన్ని కర్ణుడు కూడా ఒప్పుకున్నాడు.

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః

తత్ర శ్రీర్విజయో భూతిర్ధృవా నీతిర్మతిర్మమ

No comments:

Post a Comment