Friday, December 20, 2024

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
             *యజ్ఞం శుభప్రదం*

*భారతీయ సనాతన ధర్మం యజ్ఞయాగాదులకు ఇచ్చినంత ప్రాధాన్యం దేనికీ ఇవ్వలేదు. గంగా గోదావరి వంటి పావన జలాలతో పునీతమైన భారతావనినే మహాయజ్ఞశాలగా పెద్దలు అభివర్ణించారు.*

*పార్వతీ పరమేశ్వరులు సోమిదమ్మ సోమయాజులుగా అహోరాత్రాలు చేసే జగత్‌ కల్యాణం అనే మహా యాగానికి ఋత్విజులుగా వేదాలను సృష్టించి, యజ్ఞవాటికగా భారతావనిని ఏర్పరచారంటారు.*

*యజుర్వేదం యాగాలను విశేషంగా వివరిస్తుంది. త్రిమూర్తులు చేసిన యజ్ఞం నుంచి లలితాంబ ఆవిర్భవించిందని, దశరథుడి పుత్రకామేష్టియాగ ఫలం శ్రీరాముడి అవతారమని, ద్రౌపది ఆవిర్భావమూ యజ్ఞంనుంచే అని మన పురాణాలు చెబుతాయి.*

*పండితులు నేటికీ దేవతలకు అగ్నిలో ఆహుతులు ఇచ్చే దేవయజ్ఞాన్ని, శ్రాద్ధకర్మలు అనే పితృయజ్ఞాన్ని, వేదాధ్యయనం అనే బ్రహ్మయజ్ఞాన్ని, ఆకలిగొన్నవారికి అన్నం పెట్టే మనుష్యయజ్ఞాన్ని, ప్రాణుల క్షుద్బాధను తీర్చే భూతయజ్ఞాన్ని చేస్తుంటారు. వీటినే పంచ మహాయజ్ఞాలంటారు.*

*యజ్ఞం అంటే దేవతలను అగ్నిలో ఆరాధించి, ఆజ్యాన్ని (ఆవునెయ్యి), హవిస్సును (అన్నం) స్వాహాకారంతో అగ్నికి సమర్పించడం.*

*యజ్ఞాలలోచాలారకాలుఉన్నా, నిజానికి సోమయాగాలనే యజ్ఞాలుగా చెబుతారు. ఏడు విధాల సోమయాగాలు ఉన్నాయి. సోమలత నుంచి తీసిన సోమరసంతో యాగాలు చేస్తారు కనుక ఈ యాగాలను సోమయాగాలంటారు. చంద్రుడి లతారూపమే సోమలత అని, అరుణవర్ణంలో పున్నమిరోజున 15 పత్రాలతో నిండుగా ఉంటుందని, చంద్రుడిలా దీని ఆకులు రోజుకు ఒకటి కృష్ణ పక్షంలో తరుగుతూ శుక్ల పక్షంలో పెరుగుతూ ఉంటా యని వేదమంటోంది. చంద్రుడి అమృత కళలు దీనిపై వర్షిం చడం వల్ల ఈ లతాసారం బ్రహ్మానందరసం పీయూషం అని, దేవతలకు ఇదే ఆహారం అని వేదం విశేషంగా కీర్తించింది. నేడు ప్రత్యామ్నాయంగా అమృత వల్లి(తిప్పతీగ)ని వినియోగిస్తున్నారు.*

*హోమాలు చేసే ప్రధానవేదికను శయనచితి అంటారు. గరుత్మంతుణ్ని వేద స్వరూపుడిగా భావించి, ఈ చితిని గరుడాకృతిలో నిర్మిస్తారు. అరణిని మథించగా పుట్టిన అగ్నిని ఈ గరుడచితికి యజమాని భార్య(సోమిదమ్మ) యజ్ఞంకోసం తీసుకువస్తుంది. యజ్ఞంలో స్వాహాకారంతో యజుర్వేద మంత్రాలను పఠిస్తూ అధ్వర్యుడు ఆహుతులిస్తాడు.*

*ఋగ్వేదాన్ని హోత, సామగానాన్ని ఉద్గాత పఠిస్తారు. నాలుగు వేదాలలో నిష్ణాతుడైన బ్రహ్మ, యాగాన్ని పర్యవేక్షిస్తాడు. యజమానులే ఋత్విజులుగా వ్యవహరించే సత్రయాగాలు, రాజులు చేసే అశ్వమేధ రాజసూయ యాగాల వివరణ వేదంలో ఉంది.*

*యాగంలో వినియోగించే ధనం, ద్రవ్యం పవిత్రమైనవిగా ఉండాలి. మట్టిపాత్రలనే వాడాలి. రాలిన కట్టెలనే సమిధలుగా సేకరించాలి. వాయుకాలుష్యాన్ని రూపుమాపి మేఘాలను ఆకర్షించే రావి, మేడి వంటి పంచ పల్లవాలనే వాడాలి. ఔషధగుణాలున్న సుగంధద్రవ్యాలనే హవనం చేయాలి. లోహాలలో వెండి, బంగారం, రాగినే పూర్ణాహుతిలో వేయాలి. ఈ నియమాల్లో ఎంతో శాస్త్రీయ పరిజ్ఞానం దాగి ఉంది.*

*అందరూ కలిసి సమైక్యంగా సామరస్యభావంతో చేసే బృహత్‌ కార్యం యజ్ఞం.*

*ఎన్నో ఆధ్యాత్మిక చర్చలు, అన్నదానాలు, విత్త వినిమయానికి అద్భుత అవకాశం యజ్ఞం- శుభప్రదం అంటుంది విష్ణుపురాణం.*

*సేవాభావన, సమష్టితత్వం, అంకితభావన, ఆధ్యాత్మిక చైతన్యం, సంపద సద్వినియోగం... ఇవే యజ్ఞ ఫలాలు.*
🍁🍁🍁 🍁🍁🍁 🍁🍁🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*

🌴🦚🌴 🦚🌴🦚 🌴🦚🌴

No comments:

Post a Comment