☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
52. మధుమతీం వాచం వదతు శాంతివామ్
మధురంగా, శాంతికరంగా మాట్లాడుగాక (అథర్వవేదం)
మాట ఎలా ఉండాలి? అనేదానిపై మన వేదపురాణేతిహాసాలు విశ్లేషించిన విషయాలు విస్తారం.
భగవంతుడిచ్చిన మాట్లాడేశక్తిని చక్కగా వినియోగించుకోవాలని హెచ్చరించారు.పలుకు ఒక వరం. ఒక మాటని పంచభూతాలూ, వాటి అధిపతియైన పరమేశ్వరుడు
వింటుంటారు. ఈ అవగాహనతో మనం జాగ్రత్తగా మాట్లాడాలని వేదమాత బోధిస్తోంది.
( అయాచితంగా వాక్శక్తి లభించిందనుకొని ఏదిపడితే అది మాట్లాడుతారు.అలాకాక ఆ మాట్లాడే అపురూప శక్తి ఎన్ని జన్మాల పుణ్యంగానో లభించిందని తెలుసుకుంటే, ఆ అరుదైన వరాన్ని ఒక తపస్సుగా, శ్రద్ధగా వినియోగించుకొని జన్మను తరింపజేసుకోగలరు.)
మన సంస్కారాన్నీ, బుద్ధినీ మాట ప్రతిఫలింపజేస్తుంది. సాధారణంగా చాలామంది విసుగ్గా, చిరాగ్గా మాట్లాడుతుంటారు. మాటిమాటికీ అమంగళాలు పలుకుతుంటారు.
తత్కాల కోపావేశం లాంటివి ఎలాంటి మాటనైనా విసిరేస్తాయి. వాటి ప్రభావంవాయుతరంగాల్ని(వాతావరణాన్ని) కల్లోలపరచి అశాంతిని సృష్టిస్తుంది.
అందుకే హితకరంగా, ప్రియంగా, శాంతిగా మాట్లాడితే చాలు.
కొందరు ఊరకనే కసరుకుంటుంటారు. ధుమధుమలాడుతుంటారు. ప్రతి మాటకీ ఊతగా ఒక అమంగళ వాక్యమో(వాడి దుంపతెగ!
చచ్చాం పో! ఒళ్ళుమండిపోతుంది! వంటివి) (అమంగళము శమించుగాక!) నిందాపదమో, అశ్లీలమో లేకుండా మాట్లాడలేరు. ఇలాంటి మాటలు వారి మనోభూమికల్ని కల్మషం చేస్తాయి.
లౌకిక కార్యానికీ, ఆధ్యాత్మిక సాధనకీ కూడా దేవతల సహాయం అందకుండా
చేస్తాయి.
దేవతలు శుచిగా, మృదువుగా మాట్లాడితేనే ప్రీతి చెందుతారట. ప్రకృతి సంతోషిస్తుందట. దీనిని మనం గమనించవచ్చు. ఒక ఇంట్లో తల్లీతండ్రి కఠినంగా కసురుకుంటుంటే భాషరాని పసిపాప వెంటనే అసహనంగా ఏడుస్తాడు! కల్లాకపటం లేని పసిమనసు ఆ మాటలో కరుకుదనం, తనని ఉద్దేశించినది కాకపోయినా
పరిసరాలలో అలజడిని కలిగించడం చేత కల్లోలపడుతుంది. అలాగే దేవతలు,ప్రకృతి కూడా ఇబ్బంది పడతాయి. వారి మనసుని నొప్పించిన వారికి క్షేమం
కలగడం కష్టం.
ప్రియంగా మాట్లాడినంత మాత్రాన ప్రతి జీవి సంతోషిస్తుంది. అందుకే
ప్రియకరంగా, మధురంగా మాట్లాడు. మాటలకి దరిద్రమా చెప్పు!
ప్రియవాక్య ప్రదానేన సర్వేతుష్యంతి జన్తవః
తస్మాత్ తదేవ వక్తవ్యం వచనే కా దరిద్రతా |
ఇందులో 'సర్వే జన్తవః” ('అన్ని ప్రాణులు) అనే పదం ఉంది. మనమాడే మాట ప్రతిప్రాణిపై ప్రభావం చూపిస్తుందని దీని అర్థం.
అయాచితంగా వాక్శక్తి లభించిందనుకొని ఏదిపడితే అది మాట్లాడుతారు. అలాకాక
ఆ మాట్లాడే అపురూప శక్తి ఎన్ని జన్మాల పుణ్యంగానో లభించిందని తెలుసుకుంటే,ఆ అరుదైన వరాన్ని ఒక తపస్సుగా, శ్రద్ధగా వినియోగించుకొని జన్మను
తరింపజేసుకోగలరు.
No comments:
Post a Comment