Thursday, December 26, 2024

 *జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము*

*🌹అధ్యాయం 4, శ్లోకం 6🌹*

*అజోఽపి సన్నవ్యయాత్మా భూతానామీశ్వరోఽపి సన్ ।*
*ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయయా ।। 6 ।।*

*అజః — పుట్టుక లేని;*
*అపి — అయినా సరే;*
*సన్ — ఉండి;*
*అవ్యయ ఆత్మా — నాశములేని;*
*భూతానామ్ — సమస్త ప్రాణులకు;*
*ఈశ్వరః — స్వామి;*
*అపి — అయి కూడా;*
*సన్ — ఉండి;*
*ప్రకృతిం — ప్రకృతి;*
*స్వామ్ — నా యొక్క (స్వీయ);*
*అధిష్ఠాయ — స్థితుడనై ఉండి;*
*సంభవామి — నేను వ్యక్తమవుతాను;*
*ఆత్మ-మాయయా — నాయొక్క యోగమాయా శక్తి చేత.*

*🔆అనువాదం:*

*BG 4.6: నేను పుట్టుకలేని వాడిని అయిఉండి కూడా, సమస్త ప్రాణులకు ప్రభువునై ఉండి కూడా, నాశములేని వాడినై ఉండి కూడా, నేను ఈ లోకంలో నా యోగమాయా దివ్య శక్తిచే అవతరిస్తుంటాను.*

*🔆వ్యాఖ్యానం:*

*భగవంతుడు ఒక రూపం కలిగి ఉంటాడు అన్న అభిప్రాయాన్ని చాలా మంది జనులు అస్సలు ఒప్పుకోరు. వారు నిరాకార, సర్వ-వ్యాప్త, అశరీర, సూక్ష్మ భగవంతుని యందే ఎక్కువ సానుకూలతతో ఉంటారు. భగవంతుడు ఖచ్చితంగా ఆశరీరుడు, నిరాకారుడే కానీ అంతమాత్రాన, ఆయన అదేసమయంలో ఒక రూపము తీసుకోలేడు అని కాదు. భగవంతుడు సర్వ శక్తివంతుడు కాబట్టి ఆయనకి తన సంకల్పంచే ఒక స్వరూపంలో వ్యక్తమయ్యే శక్తి కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా భగవంతునికి రూపం ఉండదు అంటే ఆ వ్యక్తి భగవంతుడిని సర్వశక్తిమంతునిగా ఒప్పుకోవట్లేదు అని అర్థం. కాబట్టి ‘భగవంతుడు నిరాకారుడు’ అంటే అదొక అసంపూర్ణ ప్రతిపాదన అవుతుంది. అదే విధంగా, ‘భగవంతుడు ఒక సాకార రూపం లోనే అవతరిస్తాడు’ అంటే, అది కూడా పాక్షిక వాస్తవమే అవుతుంది. సర్వ శక్తివంతుడైన పరమాత్మ యొక్క దివ్యమైన వ్యక్తిత్వానికి రెండు అస్తిత్వాలు ఉన్నాయి - వ్యక్తిగత స్వరూపం మరియు నిరాకార అస్తిత్వం. కాబట్టి బృహదారణ్యక ఉపనిషత్తు ఇలా చెపుతున్నది:*

*ద్వే వావ బ్రహ్మణో రూపే మూర్తం చైవ అమూర్తం చ (2.3.1)*

*'దేవుడు రెండు రకాలుగా ఉంటాడు - నిరాకర బ్రహ్మంగా మరియు సాకార భగవంతునిగా కూడా’. ఆ రెండు అస్తిత్వాలూ ఆయన వ్యక్తిత్వానివే.*

*నిజానికి, జీవాత్మకి కూడా తన అస్తిత్వానికి రెండు కోణాలుంటాయి. అది నిరాకారం కాబట్టి శరీరాన్ని మరణ సమయంలో విడిచిపెట్టినప్పుడు, అది కనిపించదు. కానీ, అది ఒక శరీరాన్ని కూడా స్వీకరిస్తుంది - ఒక సారి కాదు, అసంఖ్యాకమైన సార్లు - ఒక జన్మ నుండి ఇంకో జన్మకు దేహాంతరమౌతూ. అతిచిన్న ఆత్మకే ఒక శరీరం స్వీకరించగలిగే శక్తి ఉన్నప్పుడు, సర్వ శక్తిమంతుడైన భగవంతునికి ఆ శక్తి ఉండదా? లేదా దేవుడు ఇలా ఏమైనా అన్నాడా? ‘నాకు ఒక రూపంలో వ్యక్తమయ్యే శక్తి లేదు కాబట్టి నేను నిరాకార కాంతిని మాత్రమే’ అని. ఆయన దోషరహితుడు, పరిపూర్ణమైనవాడు అవ్వాలంటే ఆయన సాకారుడు, నిరాకారుడు కూడా అయ్యిఉండాలి.*

*తేడా ఏమిటంటే, మన స్వరూపం (శరీరం) భౌతిక శక్తి, 'మాయ', తో తయారు చేయ బడితే, భగవంతుని రూపం ఆయన దివ్య 'యోగమాయా' శక్తిచే సృష్టించబడుతుంది. కాబట్టి అది దివ్యమైనది, భౌతిక దోషాలకి అతీతమైనది. పద్మ పురాణం లో ఈ విషయం చక్కగా వర్ణించబడినది.*

*యస్తు నిర్గుణ ఇత్యుక్తః శాస్త్రేషు జగదీశ్వరః*
*ప్రాకృతైః హేయ సంయుక్తైః గుణైర్హీనత్వముచ్యతే*

*'ఎక్కడెక్కడైతే వేద శాస్త్రాలు దేవునికి ఒక రూపం లేదు అని పేర్కొంటాయో, అవి సూచించేదేమిటంటే, ఆయన స్వరూపము, భౌతిక శక్తి యొక్క కళంకములకు అతీతమైనది అని; పైగా అది దివ్య మంగళ స్వరూపము, అని అర్థం’*

🔆🛸🔆 🛸🔆🛸 🔆🛸🔆

No comments:

Post a Comment