*ఇదేమి ఊరురా నాయనా* - సహరి పత్రికలో వచ్చిన జానపద చమత్కార కథ - డా.ఎం.హరికిషన్- కర్నూలు-9441032212
**************************
కందనవోలు అనే రాజ్యంలో దేవరాజు అనే వ్యాపారి ఉండేటోడు. ఆయన చానా కష్టజీవి. కడుపు నింపుకోడానికి తిండి వెతుక్కునే స్థాయి నుండి పదిమందికి అన్నం పెట్టే స్థాయి వరకు ఎదిగినాడు. ఆయన చేయని వ్యాపారమూ లేదు తిరగని ఊరూ లేదు. నెమ్మదిగా అతనికి వయసు మీద పడింది. చనిపోయే ముందు కొడుకు రంగరాజుని పిలిచి "రేయ్... అంతా నాకే కావాలా అని ఎప్పుడు అనుకోకు. పది రూపాయలు సంపాదిస్తే కనీసం ఒక రూపాయయినా దానం చెయ్యాల. అలాగే ఒక ముఖ్యమైన విషయం... నువ్వు ఏ ఊరికైనా పో... ఏ వ్యాపారమైన చేయి... కానీ తూర్పు దిక్కున ఉన్న కంత్రీకట్టకు మాత్రం పోవద్దు. ఎందుకంటే" అంటూ విషయం చెప్పే లోపల ఆయన ప్రాణం విడిచినాడు.
రంగరాజు తండ్రి చెప్పినట్టే రకరకాల ఊర్లు తిరుగుతా ఎవరినీ మోసం చేయకుండా పదిమందిని ఆదుకుంటా చానా డబ్బు సంపాదించినాడు. ఒకసారి అడవిలో గుర్రం మీద పోతావుంటే దారిలో ఒక దొంగల గుంపు దాడి చేసింది. వాళ్లకు దొరుకుతే నిలువుదోపిడీ చేయడమే గాక చంపినా చంపుతారు. అందుకని వాళ్ళనుంచి తప్పించుకోడానికి గుర్రాన్ని వేగంగా అడవిలోనికి ఉరికించినాడు. అది అలా ఉరుకుతా ఉరుకుతా అడవిలో దారి తప్పిపోయింది. ఎటుపోవాల్నో తోచలేదు. ఎటు చూసినా చెట్లు, గుట్టలు, వాగులు, వంకలు. దాంతో దొరికింది తింటా చెరువుల్లో కాలువల్లో నీళ్లు తాగుతా ఒక నాలుగు రోజులు అడవిలో తిరిగినాక ఆఖరికి ఒక ఊరు కనబడింది. సంబరంగా ఆ ఊరి లోపలికి పోయినాడు. దారిలో ఒక పిల్లోడు కనబడితే "ఏ ఊరు బాబూ ఇది" అని అడిగినాడు. దానికి వాడు "కంత్రీ కట్ట" అని చెప్పినాడు. ఆ పేరు వినగానే రంగరాజు అదిరిపడినాడు. వాళ్ల నాయన చెప్పిన మాటలు కళ్ళముందు మెదిలినాయి. కానీ నాలుగు రోజుల నుంచి అడవిలో తిరిగి తిరిగి బాగా అలసిపోయినాడు గదా. దాంతోబాటు ఆకలితో కడుపు నకనకలాడి పోతావుంది. అందుకని ఈ ఒక్కరోజు ఇక్కడ పండుకొని తర్వాత రోజు పొద్దున్నే దారి కనుక్కొని వెళ్ళిపోవాలి అనుకున్నాడు.
ఊరిలో పోతావుంటే ఒక ఇంటి ముందు ఒక ముసలాయన కనబడినాడు. రంగరాజు ఆయనతో "తాతా... అన్నం తినక నాలుగు రోజులైంది. అడవిలో దారి తప్పి ఇట్లా వచ్చినాను. నిద్ర లేదు. ఒక్కరోజు ఆశ్రయం ఇవ్వగలవా" అని అడిగినాడు. ముసలాయన వాన్ని ఎగాదిగా కిందికీ మీదికీ చూసినాడు. మెడలోని దండలు, వేసుకున్న బట్టలు చూడగానే బాగా ధనవంతుడని అర్థమైంది. దాంతో "ఎంతమాట నాయనా... ఆకలితో అన్నం పెట్టమని ఇంటి ముందుకు వచ్చినవాళ్లని ఉత్త చేతులతో పంపిస్తే చచ్చిన తర్వాత నరకంలో వేడి వేడి నూనెలో వేయిస్తారంట" అంటూ లోపలికి పిలిచి తాగడానికి నీళ్లు ఇచ్చి స్నానం చేసి రమ్మన్నాడు. అతని మాటలు తియ్యగా, ఆప్యాయంగా సొంత మనిషి కదా మాట్లాడుతున్నట్లు ఉన్నాయి. ఆ ముసలాయన రంగరాజును మాటల్లో పెట్టి "నీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చినావు, మీ అమ్మానాన్న ఎవరు, ఏం చేస్తారు" అంటూ అన్ని వివరాలు ఒక్కటి కూడా విడవకుండా కనుక్కున్నాడు.
రంగరాజు భోంచేశాక ఊరు చూద్దామని బయలుదేరినాడు. అతడు అట్లా కొంత దూరం పోయినాడో లేదో ఒక ఒంటి చేతి మనిషి ఎదురొచ్చినాడు. ఆయనకు కుడి చెయ్యి లేదు. అతను రంగరాజుతో "నువ్వు కందనవోలు దేవరాజు కొడుకువే కదా... అచ్చం మీ నాయన లెక్కనే వున్నావు" అని పలకరించినాడు. రంగరాజు అవునంటూ తలూపినాడు. వెంటనే అతను "మీ నాయన ఈ ఊరికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి వచ్చేటోడు. ఒకసారి నాకు ఐదు వందలు అవసరమైతే నా కుడిచేయి కుదవబెట్టుకొని డబ్బులు ఇచ్చినాడు. ఇదిగో ఈ ఐదు వందలు తీసుకొని వెంటనే నా చేతిని నాకివ్వు. లేదంటే నష్టపరిహారం కింద పదివేల బంగారు వరహాలు అయినా ఇవ్వు" అని గట్టిగా పట్టుకున్నాడు. రంగరాజుకు అతనికి ఏం చెప్పాలో తోచలేదు. "ఇప్పటికిప్పుడు తిరిగి ఇమ్మంటే ఎలా... రేపటి వరకు నాకు సమయం ఇవ్వు" అన్నాడు.
అతను "సరే రేపు వస్తా" అంటూ వదిలేసినాడు.
రంగరాజు ఇంకొంచెం దూరం పోయినాడో లేదో ఒకామె ఏడుస్తా పరిగెత్తుకొని వచ్చి రంగరాజును గట్టిగా పట్టుకుంది. "మీ నాయన రెండు సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. అప్పటినుంచి ఇంటి ఖర్చులకోసం నెల నెలా క్రమం తప్పకుండా వేయి వరహాలు పంపిస్తా ఉన్నాడు. కానీ మీ నాయన సచ్చిపోయినప్పటి నుండి ఆరు నెలలుగా ఒక్క పైసా కూడా నాకు అందలేదు. అందరి వద్ద అప్పులు చేసి బ్రతుకుతా ఉన్నాను. మీ నాయనకు ఆస్తికైనా అప్పుకైనా నీవే కదా వారసునివి. వెంటనే నా అప్పులన్నీ తీర్చి నెలనెలా నాకు వేయి వరహాలు పంపు" అనింది. ఆ మాటలు వినేసరికి రంగరాజు నోట మాట రాలేదు. ఏం చేయాలో అర్థం కాక "నీవు మా నాన్న పెళ్ళానివి అనే విషయం ఇప్పుడే కదా నాకు తెలిసింది. రేపటి వరకు సమయం ఇవ్వు. ఏం చేయాలో ఆలోచిస్తాను" అన్నాడు. ఆమె సరే అనింది.
రంగరాజు అలా పోతావుంటే ఒకతను ఎదురుపడి "ఏం రంగరాజు... మీ నాన్న వచ్చినప్పుడల్లా నాతో చదరంగం ఆడేటోడు. నువ్వు కూడా ఆడతావా. నువ్వు ఓడిపోతే నేను కోరింది ఇవ్వాలి. నేను ఓడిపోతే నువ్వు కోరింది ఇస్తా. ఏం పందానికి వస్తావా" అన్నాడు. రంగరాజుకు కూడా చదరంగం అంటే చచ్చేంత ఇష్టం. దాంతో సై అంటే సై అంటూ పందానికి దిగినాడు. ఇద్దరూ చానాసేపు పందెం కోళ్లలెక్క పోటీపడి ఆడినారు కానీ చివరికి రంగరాజు ఓడిపోయినాడు. దాంతో "చెప్పు... నీకు ఏం కావాలి" అన్నాడు. దానికి అతను "నువ్వు మా ఇంటి వెనుకున్న బాయిలో నీళ్లన్నీ తాగాలి లేదా నీ దగ్గర ఉన్న మొత్తం బంగారం అన్నా ఇవ్వాలి. ఏది ఎంచుకుంటావో నీ ఇష్టం" అన్నాడు. రంగరాజుకు ఏం చెప్పాలో అర్థం కాక "రేపటి వరకు సమయం ఇవ్వు" అన్నాడు.
రంగరాజు ఆలోచించుకుంటా తాను ఉండే ఇంటికి తిరిగి వచ్చినాడు. కడుపునిండా అన్నం తిని "చెప్పు తాతా... ఎవరి రుణం ఉంచుకోవడం నాకు ఇష్టం ఉండదు. రెండు రోజులు ఆశ్రయమిచ్చినావు అన్నం పెట్టినావు. నీకెంత ఇవ్వాలి" అన్నాడు. దానికాయన ఆయన " దబ్బులదేముందిలే నాయనా... నేను నిన్ను సంతోషపెట్టినట్లే నువ్వు కూడా నన్ను సంతోషపెట్టు చాలు" అన్నాడు. దానికి రంగరాజు సరేనని చిరునవ్వు నవ్వి మొత్తం తిన్న దానికి, ఉన్నదానికి మూడు వరహాలు అయితే అంతకు రెట్టింపు ఆరు వరహాలు అతని చేతిలో పెట్టినాడు. కానీ అతను ఏమాత్రం సంతోషపడలేదు. ఎంత డబ్బు ఇవ్వచూపినా అతను ఇవి నాకేం సంతోషాన్ని కలగజేయడం లేదు అంటున్నాడు. రంగరాజుకి ఏం చేయాలో తోచక "సరే నాకు ఒక్క రోజు సమయం ఇవ్వండి. మిమ్మల్ని సంతోష పరుస్తాను" అన్నాడు.
తర్వాత రోజు నలుగురూ పొద్దున్నే వచ్చి రంగరాజును పట్టుకున్నారు. కానీ రంగరాజుకు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక ఇంకోరోజు గడువు కోరినాడు. దాంతో ఆ నలుగురు కలిసి ఆ గ్రామపెద్ద దగ్గరికి న్యాయం కోసం పోయినారు. గ్రామపెద్ద రంగరాజును పిలిపించినాడు. రంగరాజు ఆలోచనలో పడినాడు. "ఈ ఊర్లో అందరూ కాలికేస్తే వేలికి, వేలికేస్తే కాలికి వేసేటట్లు ఉన్నారు. తనకు సాయం చేసేవారు గానీ న్యాయం చెప్పేవారు గానీ ఎవరూ లేరు. తన ఆపదల్లోంచి తానే సొంతంగా బయటపడాలి. వీళ్లకు మంచిగా మర్యాదగా సమాధానం చెబితే సరిపోదు. దెబ్బ కొడితే మళ్ళా లేయకూడదు" అనుకుంటా అట్లాంటి సమాధానాల కోసం ఆలోచించకుంటా గ్రామపెద్ద ఇంటికి పోయినాడు.
గ్రామాధికారి రంగరాజును కోపంగా చూస్తా "ఏమయ్యా చూడడానికి బాగా చదువుకున్నోని మాదిరి కనపడుతున్నావు. ఇదేనా పద్ధతి. ఆ ఒంటిచేతి మనిషి డబ్బులు వడ్డీతో సహా తిరిగి ఇస్తానంటూ ఉన్నాడు కదా... వెంటనే మీ నాయన కుదవ పెట్టుకున్న కుడిచేయిని తెచ్చి ఆయనకు ఇవ్వు. లేదా నష్టపరిహారం అయినా చెల్లించు" అన్నాడు. దానికి రంగరాజు ఒక నిమిషం ఆగి "అయ్యా... మా నాన్న దగ్గర ఈయన ఒక్కడే కాదు చానామంది వాళ్ళ చేతులు, కాళ్ళు కుదువ బెట్టినారు. కాబట్టి ఎవరిది ఏ చేయో ఎవరిది ఏకాలో కనుక్కోవడం కష్టం. ఇతను ఎడమ చేయి గనుక ఇస్తే అచ్చం దానికి సరిపోయే కుడిచేతిని వెతికి పట్టుకొని వస్తా" అన్నాడు. ఆ మాట వింటూనే ఒంటిచేతి మనిషి అదిరిపడినాడు. "ఓరి దేవుడోయ్... ఏదో పది రూపాయలు వస్తాయి కదా అని ఆశపడితే మిగిలిన ఈ ఒక్క చేయి కూడా పోయేటట్లుందే" అనుకుంటా వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయినాడు. గ్రామపెద్ద చేసేదేంలేక "సరే... వాని సంగతి వదిలేయ్. నెల నెలా మీ నాయన పంపే డబ్బులతో గౌరవంగా బతుకుతున్న ఈమె మీ నాయన చచ్చిపోయినాక తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడతా ఉంది. ఈమెను చూసుకోవాల్సిన బాధ్యత వారసునివైన నీపైనే ఉంది కదా" అన్నాడు. దానికి రంగరాజు "అయ్యా... మీరు చెప్పింది నిజమే. నేనుండేదేమో కందనవోలు. ఈమె ఉండేదేమో ఈ ఊరు. అక్కడికి ఇక్కడికి చానా దూరం. మా అమ్మ ఒక్కతే ఇంటి దగ్గర ఇంటి పనులన్నీ చేసుకుంటా కష్టపడతా ఉంది. కాబట్టి ఈమె కూడా తట్ట బుట్ట సర్దుకొని నా వెంబడి వచ్చేస్తే అక్కడ ఇద్దరమ్మలు కలసి హాయిగా పని చేసుకుంటా ఒకరికొకరు తోడుగా ఉంటారు. చచ్చేంత వరకు నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను. తల్లి ఉండాల్సింది కొడుకు దగ్గరే కదా" అన్నాడు. ఆ మాటలు వినగానే ఆమె అదిరిపడి "నీవు నెలనెలా పంపే నీ డబ్బూ వద్దు. నీ ఊరూ వద్దు. సచ్చినా ఇక్కడి నుండి ఒక్క ఇంచు కూడా కదలను" అంటూ అక్కడినుంచి వెళ్ళిపోయింది.
ఇద్దరూ అట్లా వెళ్ళిపోగానే గ్రామ పెద్ద తల గీరుకుంటా "మరి వీనితో కాసిన పందెం సంగతేమి. భావినీళ్లు మొత్తం తాగేస్తావా లేక నీ దగ్గర ఉన్న సొమ్మంతా అనాపైసల్తో సహా అప్పజెప్తావా" అన్నాడు. దానికి రంగరాజు "అయ్యా పందెం ప్రకారం బావిలో నీళ్లు మొత్తం తాగుతా. వెంటనే పోయి ఆ బావిలోని నీళ్లు ఒక్కచుక్క కూడా మిగలకుండా తోడుకొని రమ్మ నండి. ఆ తరువాత మాట పడకూడదు" అన్నాడు. ఆ మాటలు వినగానే పందెం కాసిన మనిషి అదిరిపడినాడు. అది అట్లాంటి ఇట్లాంటి అల్లాటప్ప బావి కాదు. ఏడు బొంగుల లోతుంటాది. ఎన్ని నీళ్ల తోడినా ఎండాకాలం కూడా ఒక్క ఇంచు తగ్గవు. అట్లాంటిది ఆ బావి నీళ్ళన్నీ తోడేదెప్పుడు? వీడు తాగేది ఎప్పుడు? దాంతో అది తన చేతకాదు అంటూ మట్టసంగా అక్కడినుంచి వెళ్లిపోయినాడు.
ఇక చివరగా మిగిలింది అన్నం పెట్టిన తాత. అతన్ని సంతోష పరచాలి. ఎట్లాగబ్బా అని ఆలోచించి తాతతో "మీ గ్రామపెద్ద చానా మంచి మనిషి. ఈ చుట్టుపక్కల అరవయ్యారు ఊర్లలో ఇంత పద్ధతిగా తీర్పులు చెప్పేవాళ్ళు ఎవరూ ఉండరు. అందుకే వారిని గౌరవంగా ఒక పట్టు శాలువాతో సన్మానించాలి అనుకుంటున్నాను. నీకు సంతోషమేనా" అన్నాడు. ఆ మాట వినగానే తాత గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. నాకు ఇది సంతోషంగా లేదు అంటే గ్రామపెద్దకు కోపం వస్తుంది. కొరడాలతో కొట్టిచ్చి ఊరులోంచి వెలి వేయిస్తాడు. దాంతో ఏమీ చేయలేక "మా గ్రామపెద్దని సన్మానిస్తే నాకు సంతోషం తప్ప బాధ ఎందుకు ఉంటాది" అన్నాడు. దాంతో రంగరాజు చిరునవ్వు నవ్వి "నిన్ను సంతోషపరిచాను కాబట్టి ఇక నీకు డబ్బు ఒక్క పైసా కూడా ఇయ్యనక్కర్లేదు" అంటూ పట్టు శాలువా తెప్పించి గ్రామ పెద్దను ఘనంగా సత్కరించినాడు. అట్లా తన తెలివితేటలతో ఆపదలన్నింటినుంచి బయటపడటమే గాక మరొక ఆపద వచ్చి మీద పడకముందే ఒక్క క్షణం కూడా ఆ ఊరిలో ఉండకుండా అక్కడి నుంచి బయటపడినాడు.
**************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
**************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
No comments:
Post a Comment