☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
57. నమః పృథివ్యై నమ ఓషధీభ్యః
భూమికి నమస్కారము, ఓషధులకు నమస్కారము(శ్రుతివాక్యం)
పంచభూతాలను జడప్రకృతిగా కాక, ఈశ్వరుని కరుణకు సాకారాలుగా, ఈశ్వర చైతన్య స్వరూపాలుగా ఆరాధించమని వేదమాత ప్రబోధం. ఈ భావన వేదంతో మొదలై భారతీయ పురాణేతిహాసాలలో, స్మృతులలో, కావ్యాలలో విస్తృతమై
గోచరిస్తోంది. 'ఈశావాస్య మిదం సర్వం' అనే ఉపనిషత్ తాత్పర్యం ఇదే.
'జననీ పృథివీ కామదుఘాస్తే' - తల్లి భూమి అన్ని కోరికలను తీర్చే కామధేనువై ఉన్నది' అని కంచిమహాస్వామి శ్రీశ్రీశ్రీ చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ స్వామి వారు పలికారు.
భూమిని ధేనువుగా ఆరాధించి సస్యారణ్య నదీనదాది సంపత్ప్రదాయినిగా కీర్తించి
జగన్మాతగా శ్లాఘించారు మహర్షులు. లక్ష్మీనామాలు, లలితానామాలు కూడా భూమాతగా జగదంబను దర్శింపజేస్తున్నాయి.
మాతృస్తన్యంతో శిశువు పాలింపబడినట్లుగా, భూమాత సంపదలు మనకు పోషక,రక్షకాలు. ఈ పృథివి ఇచ్చే సంపదలలో ఓషధులు అత్యంత ప్రధానం. అందుకే
ఓషధుల్ని దేవతలుగా దర్శించారు. ఇది 'దర్శనం'. అంతేగానీ 'భావన' కాదు.దేవతాశక్తులు ఓషధులుగా వ్యక్తమవుతాయి. ఆ సూక్ష్మతేజో విశేషాలను దర్శించారు ఋషులు.
ఆ ఓషధుల అద్భుత శక్తులను ఎలా గ్రహించాలో, ఎలా ఔషధాలుగా మలచాలో,ఎలా వినియోగించాలో వేదర్షులు అనేక శాస్త్రాలుగా ఆవిష్కరించారు.
ఓషధులు ప్రాణవంతాలు. తాము సంకల్పించుకుంటేనే సాక్షాత్కరించే దివ్యౌషధులు కూడా చాలా ఉన్నాయి. రామాయణంలో ఆంజనేయుడు సంజీవని తెచ్చేటప్పుడు,
ఆ పర్వతశిఖరమంతా స్వామి హస్తాలకు రావాలని - ఓషధులు అదృశ్యరూపంగా మారాయని వాల్మీకి అభివర్ణించారు.
మానవులలో ధార్మికశక్తి క్షీణిస్తే కొన్ని ఓషధులు లభించవని పురాణాలు వర్ణించాయి.
మన ప్రాచీన వైద్యగ్రంథాలు వర్ణించిన అనేక ఓషధులలో ఇప్పుడు కొన్ని అలభ్యాలు.అరణ్యాలను విచక్షణ రహితంగా నరికి వేయడం, మన శాస్త్రాలను మనం నిర్లక్ష్యం చేయడం వంటివి ఇందుకు కారణాలు.
ఆయుర్వేద విద్యపై తగినంత ప్రోత్సాహకర అధ్యయన కేంద్రాలు మన దేశంలోనే లేవు. మరోవైపు భయంకరమైన కాలుష్యాలు, కృత్రిమ ఔషధాలపైననే ఆధారపడి,
సహజత్వానికి దూరమై పోతున్నాం.
తులసి, పసుపు, మారేడు లాంటి ఓషధీ విలువలున్న వృక్షాలను జీవన విధానంలో కలిపిన మన సంస్కృతినే కోల్పోతున్నాం.
లక్షలాది ధనాన్ని ఖర్చుపెట్టినా తొలగని రోగాలను, అతితక్కువ ఖర్చుతో చిన్నపాటి ఓషధీ మూలికతోనో, పత్రంతోనో తొలగించగలిగే అద్భుత విద్యపట్ల మనమే అనాదర భావాన్ని అభివృద్ధి చేసుకొని వ్యాధిగ్రస్త జీవితాలను నెట్టుకొస్తున్నాం.
ఇప్పటికైనా మేలుకొని ప్రాచీన భారతీయ గ్రంథాలను పరిశీలించి ఆ ఓషధీ విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవలసిన ఆవశ్యకతని గుర్తించాలి. ఓషధుల గురించి
కేవలం ఆయుర్వేద గ్రంథాలలోనేకాక, పురాణాలలో, స్మృతుల ఆచారాలలో,
జానపదుల జీవితాలలో బోలెడంత సమాచారముంది.
గిరిజనులు, పల్లీయులు, ఆటవికులు ఎంతో అనుభవంతో స్వాభావికమైన సత్యాన్ని కలిగి, ఎంతో ఓషధీ విజ్ఞానాన్ని గడించారు. కానీ ఆధునిక విజ్ఞానం లేకపోవడం మూఢత్వం క్రింద గణించి, వారి స్వాభావిక విద్యని సైతం వారి నుండి దూరం చేస్తున్నారు. దానితో వారిలో ఉన్న ప్రాచీన విద్య కూడా హరించుకుపోతోం(యిం)ది!
తగిన పరిశోధన లేకుండా పాశ్చాత్య వైద్యశాస్త్రం ఆర్షమైన ఓషధీ విజ్ఞానాన్ని మొదటి నుండి నిరసిస్తూనే ఉంది.
ఈ నిరసన వైఖరినీ, నిర్లక్ష్య ధోరణినీ ఇప్పటికైనా వదలుకోవాలి. ప్రభుత్వాన్ని కదిలించడం ఎలా ఉన్నా, స్వచ్ఛంద సంస్థలు, ఆశ్రమపీఠాలు స్వయంగా వివిధ ఓషధీ వృక్షాలను పెంచి పోషించి, ఆ విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం తక్షణ కర్తవ్యం.
ఆ విధంగా మన బుద్ధుల్ని ప్రేరేపించవలసిందిగా 'ఓషధీనాం పతయే నమః”అంటూ పరమేశ్వరుని ప్రార్థిద్దాం.
No comments:
Post a Comment