Vedantha panchadasi:
ఇతివార్తికకారేణ జడచేతన హేతుతా ౹
పరమాత్మన ఏవోక్తా నేశ్వరస్యేతి చేచ్ఛృణు ౹౹189౹౹
189. ఇట్లు వార్తికకారుడైన సురేశ్వరాచార్యునిచే
జడ చేతనములకు కారణము పరమాత్మయే ఈశ్వరుడు కాడు అని చెప్పబడినదనినచో వినుము.
అన్యోన్యాధ్యాస మత్రాపి జీవకూటస్థయోరివ ౹
ఈశ్వరబ్రహ్మణోః సిద్ధం కృత్వా బ్రూతే సురేశ్వరః ౹౹190౹౹
190. జీవుడు కూటస్థచైతన్యముల అన్యోన్యాధ్యాస సిద్ధమైనట్లే ఈశ్వరుడు బ్రహ్మముల అన్యోన్యాధ్యాస సిద్ధమని భావించియే సురేశ్వరులట్లు చెప్పిరి.త్వం పదమున వలె తత్ పదమునను అధిష్ఠాన ఆరోపములకు అన్యోన్యాధ్యాసను సురేశ్వరులు స్వీకరించిరని భావము.
సత్యంజ్ఞానమనంతం యద్ర్బహ్మ తస్మాత్సముత్థితాః ౹
ఖంవాయ్వగ్నిజలోర్వ్యోషద్ధన్న దేహా ఇతి శ్రుతిః ౹౹
191. సత్యము జ్ఞానము అనంతమగు బ్రహ్మము నుండి ఆకాశము వాయువు జలము భూమి ఓషధులు అన్నము శరీరములు జనించినవని శ్రుతి.
వ్యాఖ్య:-
తైత్తిరీయ ఉప.2.1 1-2
సురేశ్వరులట్లు స్వీకరించిరనుటకు ఉపపత్తి చెప్పబడుచున్నది.
పరబ్రహ్మ స్వరూపమును తెలిసికొనిన జ్ఞాని పరబ్రహ్మమును పొందుచున్నాడు.ఈ అర్థమునే ఋక్కు చెప్పుచున్నది.
బ్రహ్మము సత్యమును,జ్ఞానమును అనంతమునై యున్నది.ఇట్టి పరబ్రహ్మము శ్రేష్టమగు అవ్యాకృతమను పేరుగల హృదయాకాశము నందలి బుద్ధి గుహయందున్నది.
సత్యజ్ఞానంత స్వరూపమునగు ఆ పరబ్రహ్మమునందు,
శబ్దమే గుణముగా కలిగి సమస్త భూతములకును అవకాశమును ఇచ్చుచున్న ఆకాశము వాయువు జలము భూమి ఓషదులు అన్నము శరీరములు జనించినవని శృతి.
నిర్గుణ బ్రహ్మతత్త్వం క్లిష్టమైనది, సూక్ష్మమైనది.
"సత్యం జ్ఞాన మనంతం"అనే బ్రహ్మలక్షణాలను ఆకళించుకొని, "తత్" పదార్థాన్ని "త్వం"పదార్థంతో సమన్వయించుకొని"తత్త్వమసి",
"ఏకమేవాద్వితీయం"అనే
గురు బోధనను స్థిరంగా బుద్ధిలో నిలబెట్టుకొనే శక్తి-సమర్థ్యాలున్న జ్ఞాన సాధకునికి ఫలసిద్ధి శీఘ్రంగా రావచ్చు.
మేధావులకు సంశయాలు ఉండవు.వారికి గ్రహణశక్తి కూడా ఉంటుంది.కాబట్టి ప్రతిబంధకాలు నామ మాత్రంగానే ఉంటాయి.అటువంటి ధీమంతులకు ఆవృత్తి పునఃపునః అవసరం ఉండదు.
ఆవృత్తి అంటే
తత్త్వమసి-తత్త్వమసి-తత్త్వమసి అనే వాక్యాలను పదేపదే ఉచ్చరించటం కాదు.ఆ వాక్యాలకు అతీతంగా ఉండే పరమాత్మ ధర్మాలను తన యొక్క ఆత్మధర్మాలతో సమన్వయించుకోటానికి ఉద్దేశింపబడినది.
అదే జ్ఞాన సముపార్జన. ఈ విషయము తెలుసుకొని బ్రహ్మపదార్థంపై చిత్తాన్ని లగ్నం చేసుకొని తత్ సాధనతో ఆత్మ దర్శనము చేసుకోవాలని ఏకైక లక్ష్యాన్ని పెట్టుకోవాలి.
"ఆత్మ జ్ఞానమే బ్రహ్మజ్ఞానము"
"అట్టి జ్ఞానసిద్ధియే కైవల్యము"
ఆపాతదృష్టితస్తత్ర బ్రహ్మణో భాతి హేతుతా ౹
హేతోశ్చ సత్యతా తస్మాదన్యోన్యాధ్యాస ఇష్యతే ౹౹192౹౹
192. పై చూపులకు బ్రహ్మమే జగత్కారణమనీ జగత్కర్తృత్వము సత్యమనీ తోచును.ఈ విరోధము బ్రహ్మము ఈశ్వరుల అన్యోన్యాధ్యాస వినా తీరదు. బ్రహ్మము యొక్క సత్యత్వము ఈశ్వరునిపైనను ఈశ్వరుని జగత్కర్తృత్వము బ్రహ్మముపైనను అధ్యసింపబడినవి ఆరోపింపబడినవి అని స్వీకరించుట చేతనే శ్రుతి వాక్యము సంబద్ధమగును.
అన్యోన్యాధ్యాసరూపోఽ సావన్నలిప్తపటో యథా ౹
ఘట్టితేనైకతామేతి తద్వత్ భ్రాంత్యైకతాం గతః ౹౹193౹౹
193. గంజిపెట్టిన వస్త్రమునందు బిగువు ఎండిన గంజి యొక్క లక్షణము.కాని అదీ,వస్త్రమూ ఒకటే అని భావించి వస్త్రము బిగువుగ ఉన్నది అందురు.ఇదే అన్యోన్యాధ్యాస రూపము.అట్లే ఈశ్వరుడు బ్రహ్మము ఒకటే అని అన్యోన్యాధ్యాస వలన జనులు భావింతురు.
వ్యాఖ్య:- బ్రహ్మము నిర్గుణసత్తయైన చైతన్యము. ఈశ్వరుడు మాయయందు ప్రతిఫలించిన చైతన్యము.
ఈ అజ్ఞానము లేక మాయ సత్యమును కప్పివేసి నానాత్వమును కల్పించును.ఈ మాయ నిజముగా లేదు.దాని స్వభావమును విచారించనంత కాలము అది శాసించును.విచారణ జరిగిన అది నశించును.
ఆజ్ఞానము ఎట్లు వచ్చినది?అని విచారింపకుము.ఈ అజ్ఞానమును నేనెట్లు నశింపజేయవలెను అని మాత్రమే విచారింపవలెను.
ఈ అజ్ఞానము ఆత్మజ్ఞానము లేకుండ నశింపదు.
ఈ అజ్ఞానము యొక్క మూలము ఏదయినను అది కూడ నిశ్చితముగా ఆత్మలో ఉన్నది.
గంజిపెట్టిన వస్త్రమునందు బిగువు ఎండిన గంజి యొక్క లక్షణము. కాని అదీ,వస్త్రమూ ఒకటే అని భావించి వస్త్రము బిగువుగ ఉన్నది అందురు.ఇదే అన్యోన్యాధ్యాస రూపము.
ఏకకమగు చైతన్యమే జీవుడుగాను సర్వవిషయములుగాను అగుపించును.సర్వశక్తులను ప్రదర్శించు చైతన్యము
అనివార్యమయిన
దేశ కాలములతో,
కార్య-కారణములతో సంబంధము
పెట్టుకొనును.
అప్పటినుండి అనంతమగు నామరూపములు ఆవిర్భవించును.కానీ బాహ్యమయిన ఈ అభివ్యక్తులన్నియు నిజముగా చైతన్యము కంటె అభిన్నములే.
నామ-రూపముల ఆవిర్భావముతోను,
దేశ-కాలములతోను,
కార్య-కారణములతోను సంబంధముగల చైతన్యము యొక్క ఆ దశను
"క్షేత్రజ్ఞుడనియు",లేక సాక్షిచైతన్యమనియు అందురు.
దేహము క్షేత్రము.ఈ క్షేత్రమును లోపల వెలుపల దాని సమస్తదశలను తెలిసికొనునది క్షేత్రజ్ఞుడు లేక సాక్షిచైతన్యము.
No comments:
Post a Comment