Sunday, December 22, 2024

 Vedantha panchadasi:
 ద్విత్ర్యాన్తరత్వకక్షాణాం దర్శనేఽ ప్యయమాన్తరః ౹
న వీక్ష్యతే తతో యుక్తి శ్రుతిభామేవ నిర్ణయః ౹౹167౹౹

167. సూక్ష్మాతిసూక్ష్మ మగుటచేెత ఈ ఆంతరతత్త్వము గోచరము కాదు.అనుమానము చేతను శ్రుతివాక్యముల చేతను మాత్రమే దానిని గూర్చి నియమింప దగును.

పటారూపేణ సంస్థానాత్పటస్తన్తోర్వపుర్యథా ౹
సర్వరూపేణ సంస్థానాత్సర్వమస్య వపుస్తథా ౹౹168౹౹

168.  వస్త్రముగా ఏర్పడిన నూలుపోగులకు ఆ వస్త్రమే శరీరముగా చెప్పబడినట్లు సర్వముగా ఏర్పడిన ఈశ్వరునకు సర్వమే శరీరమగుచున్నది.

తన్తోః సంకోచవిస్తారచలనాదౌ పట స్తథా ౹
అవశ్యమేవ భవతి న స్వాతంన్త్ర్యం పటే మనాక్ ౹౹169౹౹

169.  నూలుపోగులు సంకోచించి వ్యాకోచము చెంది ఇతర విధముగ చలించినపుడు ఆ వికారములే వస్త్రమునకును సంక్రమించును. దానికి స్వాతంత్ర్యమే లేదు.

తథాఽ న్తర్యామ్యయం యత్రయయా వాసనాయా యథా ౹
విక్రియేత తథాఽ వశ్యం భవత్యేవ న సంశయః ౹౹170౹౹

170. అట్లే ఆ అంతర్యామి ఎచ్చట, ఏ వాసనచే ఎట్లు వికారము నొందించునో ఆయా విషయములు అట్లే ఆవశ్యముగ వికారము నొందును.ఇందు సంశయము లేదు.    వ్యాఖ్య:- నారగుడ్డ మీద చిత్రింపబడిన యుద్ధదృశ్యము యుద్ధము చేయు సైన్యముల గర్జనను కల్పింపగలదా?
శవము లేచి పరుగిడగలదా?రాతిమీద చెక్కబడిన సూర్యరూపము చీకటిని పోగొట్టునా?

అదే విధముగా జడమనస్సు ఏమి చేయగలదు?
అంతశ్చైతన్యజ్యోతివలన మాత్రమే తెలివి కలదిగాను, క్రియాశీలముగాను ఉన్నట్లు అగుపించును.

ఒక వస్త్రమును నీటియందు వుంచినప్పుడు అది సంకోచము లేక వ్యాకోచము కలుగుతుంది.
ఈ క్రియ వస్త్రమునకు దానియందు వున్న నూలుపోగులు చలనము వలన మాత్రమే జరుగును. వస్త్రమునకు ప్రత్యేక ఏమివున్నది?

అలాగే శరీరమునకు కూడా ప్రత్యేక ఉనికి అంటూ వున్నదన్నా లేక ఏ వాసనలతో వికారములు కలిగినదన్నా, అందున్న  ఆ అంతర్యామి ఎచ్చట, ఏ వాసనలచే వికారము నొందించునో ఆయా విషయములు అట్లే అవస్యముగ వికారము నొందును.

సూక్ష్మాతిసూక్ష్మ మగుటచేత ఈ ఆంతరతత్త్వము గోచరము కాదు.
సూక్ష్మమగు ఆత్మ సమస్తమును వ్యాపించియుండునని శ్రుతి,గురు  వాక్యముల చేత తెలిసికొన్నవాడు తత్త్వమును తెలిసికొనును.

వ్యాధికి,భయమునకు,
ఆందోళనకు,వార్ధక్యమునకు,
మరణమునకు వశమగు దేహము తానను భావనతో భ్రాంతి జెందని వాడు తత్త్వమును తెలిసికొనును.

సర్వజీవులలోనుండు అద్వితీయ చైతన్యము సర్వశక్తిమంతమనియు, సర్వవ్యాపి అనియు అవగతము చేసికొన్నవ్యక్తి తత్త్వమును తెలిసికొనును.
ఈశ్వర సర్వభూతానాం 
హృద్దేశేఽ ర్జున తిష్ఠతి ౹
భ్రామయన్సర్వభూతాని యన్త్రారూఢాని మాయయా ౹౹171౹౹

171. భగవద్గీతయందు శ్రీకృష్టుడిట్లు చెప్పెను: అర్జునా సర్వ భూతముల హృదయములందు ఈశ్వరుడు గలడు.మాయచే సకల జీవులను ఈశ్వరుడు యంత్రము నెక్కించిన బొమ్మలవలె త్రిప్పుచుండును.

సర్వభూతాని విజ్ఞానమయాస్తే హృదయేస్థితాః ౹
తదుపాదాన భూతేశస్తత్ర విక్రియతే ఖలు ౹౹172౹౹

172. "సర్వభూతాని"అనగా సకల ప్రాణుల యందలి జీవులు, ఆనందమయకోశములు.వానికి ఉపాదాన కారణమగుటచే ఈశ్వరుడు కూడా వికారమునొందును.అనగా ఉపాధివశమున వికారము నొందినట్లు కన్పించును.

దేహోది పంఞ్జరం యన్తం తదారోహోఽ భిమానితా ౹
విహితప్రతిషిద్ధేఘ ప్రవృత్తిర్ర్భమణం భవేత్ ౹౹173౹౹

173. యంత్రమనగా శరీర పంజరము.ఆరోహమనగా దాని యందు "నేను"అనే అభిమానముంచుట.
భ్రమణమనగా విహిత,నిషిద్ధ కర్మలను ఆచరించుట.

విజ్ఞానమయరూపేణ తత్ర్పవృత్తి స్వరూపతః ౹
స్వశక్త్యోశో విక్రియతే మాయయా భ్రామణం హి తత్ ౹౹174౹౹

174. ఈశ్వరుడు తన మాయచే జీవులను త్రిప్పుననగా ఈశ్వరుడు తన మాయాశక్తిచే ఆనందమయకోశముల రూపమునొంది వాని వికారములచే తాను వికారము నొందుచున్నట్లు కన్పించుట.

అన్తర్యమయతీత్యుక్త్యాఽ యమేవార్థః శ్రుతౌ శ్రుతః ౹
పృథివ్యాదిషు సర్వత్ర న్యయోఽ యం యోజ్యతాం ధియా ౹౹175౹౹

175.  ఈశ్వరుడులో నుండి నియమించుననుచు శ్రుతి ఈ అర్థమునే చెప్పుచున్నది.ఈ న్యాయమునే పృథివి మొదలగు మహా భూతములకు,తదితర విషయములకు కూడా అన్వయింపవలెను.
వ్యాఖ్య:- స్త్రీ గర్భము నందు ఒక జీవి రక్త,మాంసాదులు,వాయువు,
ఉష్ణము,నీరు సమస్తము పంచుకుని రూపుదాల్చుట మెంత సత్యమో,
అలాగే సర్వభూతముల హృదరములందు ఈశ్వరుడు గలడు అనేది అంతే సత్యము.

ఆ ఈశ్వర మాయవలన మాత్రమే నేను అనే అభిమానం శరీరమనే యంత్రమునందు వుంచి బుద్ధిని ఆవరించి ఉన్న అజ్ఞాన మనస్సు కారణంగా మనశ్శరీరాలలోనూ పదార్థ నిర్మిత ప్రపంచాన్ని సత్యమని భావిస్తున్నాము.

నేను అనే అహంకారము ఉదయింపగనే వ్యక్తిత్వము అత్యంతబలహీన మగును.
"ఇది నాది","ఇది నా దేహము" అను భావన కలుగగనే  చేయిపనిలో అసమర్థతగను, దౌర్బల్యము అనివార్యమగును. స్వాతంత్ర్యము హరించును.

జ్ఞానులసాంగత్యమున ఆత్మజ్ఞానముదయించును.తత్కాలమందే దృశ్యవిషయములుగా సత్యమనే భావన క్షీణించి చివరకు అదృశ్యమగును.అట్లు ప్రపంచ దృశ్య విషయముగా నశించినప్పుడు పరతత్త్వము మాత్రమే ఉండును.

ఆ చైతన్యము యొక్క అద్భుతమగు అభివ్యక్తియే అకారమే ప్రపంచముగా భావింపబడుచున్నది తప్ప వేరేదియుగాదు.

ఉపాధులన్నిటి ద్వారా చైతన్యమే వ్యక్తమవుతూ కర్మలను చేయిస్తొంది.బల్బులో విద్యుచ్ఛక్తి ఉంటూ కాంతిగా వ్యక్తమవుతున్నట్లే,ఆత్మ చైతన్యం శరీర కర్మలుగా వ్యక్తమవుతొంది.
బల్బులోపల విద్యుచ్ఛక్తి లేకపోతే బల్బు ద్వారా కాంతి వ్యక్తమే కాదు.
చైతన్యమే అన్ని ఉపాధులకు అధారంగా ఉంటూ నియమిస్తొంది.

మన దేహమునందు వున్న పంచభూతాల సమ్మేళనంతో సూక్ష్మముగా వుంటూ నానాత్వాన్ని అనుభవిస్తూనే అదంతా బ్రహ్మమేననీ రెండవదేదీ లేదనీ దృడంగా తెలుసుకుంటూ మాయాకల్పిత జగన్నాటకాన్ని ప్రసన్నంగా వీక్షించగలగాలి.

శరీరమే "నేను"గా పొరబడడానికి మించిన అజ్ఞానం మరేదీ ఉండబోదు. 

No comments:

Post a Comment