*జ్ఞాన, కర్మ, సన్న్యాస యోగము*
*🌹అధ్యాయం 4, శ్లోకం 7🌹*
*యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత ।*
*అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ ।। 7 ।।*
*యదా-యదా — ఎప్పుడెప్పుడైతే;*
*హి — నిజముగా;*
*ధర్మస్య — ధర్మము యొక్క;*
*గ్లానిః — క్షీణత;*
*భవతి — సంభవించునో;*
*భారత — అర్జునా, భరత వంశీయుడా;*
*అభ్యుత్థానమ్ — పెరుగుట;*
*అధర్మస్య — అధర్మము యొక్క;*
*తదా — అప్పుడు; ఆత్మానం — నన్ను;*
*సృజామి — సృజింతును (ప్రకటించుకుందును)*
*అహం — నేను.*
*💥అనువాదం:*
*BG 4.7: ఎప్పుడెప్పుడైతే ధర్మము క్షీణించునో, అధర్మము ప్రబలునో, ఓ అర్జునా, ఆ సమయంలో నన్ను నేను భూలోకంలో సృజించుకుంటాను.*
*💥వ్యాఖ్యానం:*
*ధర్మము అంటే నిజానికి, మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి, పురోగతికి సహకరించే, విహిత కర్మలే; దీనికి విరుద్ధమే అధర్మం. అధర్మం ప్రబలినప్పుడు, ఈ లోక సృష్టికర్త, నిర్వహణాధికారి అయిన భగవంతుడు, స్వయంగా జోక్యం చేసుకొని, దిగివచ్చి, మరల ధర్మ మార్గాన్ని స్థిరపరుస్తాడు. ఇలా దిగి రావటాన్నే అవతారము అంటారు. ఈ అవతారం అన్న పదం సంస్కృతం నుండి ఆంగ్లంలోనికి (‘Avatar’) తీసుకోబడింది, ఇప్పటికాలంలో దీనిని సాధారణంగా కంప్యూటర్లో జనుల చిత్రపటాలను సూచించే అర్థంలో వాడుతున్నారు. కానీ, ఈ భాష్యంలో ఈ పదాన్ని, దాని యొక్క నిజమైన అర్థంలో, అంటే భగవంతుని అవతారమును సూచించటానికే వాడుదాము. శ్రీమద్భాగవతంలో ఇటువంటి ఇరవై నాలుగు అవతారముల గురించి చెప్పబడింది. కానీ, భగవంతునికి అనంతమైన అవతారములు ఉన్నాయని వేద శాస్త్రములు పేర్కొంటున్నాయి.*
*జన్మకర్మాభిధానాని సంతి మేఽoగ సహస్రశః*
*న శక్యంతే ఽనుసంఖ్యాతుం అనంతత్వాన్ మయాపి హి*
*(భాగవతం 10.51.37)*
*'అనాది కాలం నుండి ఉన్న అనంతమైన భగవత్ అవతారములను ఎవరూ గణించలేరు.’ క్రింద చెప్పబడినట్టు, ఈ అవతారములు నాలుగు రకాలుగా వర్గీకరించబడ్డాయి:*
*1. ఆవేశావతారములు: ఒక జీవాత్మ యందు భగవంతుడు తన ప్రత్యేక శక్తిని ప్రవేశపెట్టి మరియు ఆ జీవాత్మ ద్వారా కార్యకలాపాలు చేయటం. నారద ముని ఈ ఆవేశావతారానికి ఒక ఉదాహరణ. బుద్ధుడు కూడా ఒక ఆవేశావతార ఉదాహరణ.*
*2. ప్రాభవావతారములు: భగవంతుడు ఒక సాకార రూపంలో వచ్చి, తన దివ్య శక్తులలో కొన్నింటిని ప్రదర్శించిన అవతారములు ఇవి. ప్రాభవావతారములు కూడా రెండు రకాలు.*
*భగవంతుడు కొద్ది సేపు మాత్రమే ప్రకటితమై, తన కార్యాన్ని పూర్తిచేసి, వెళ్లిపోయేవి. హంసావతారము దీనికి ఒక ఉదాహరణ, దీనిలో కుమార ఋషులకు కనిపించి, వారి ప్రశ్నలకు సమాధానమిచ్చి వెళ్ళిపోయాడు.*
*భూలోకంలో చాలా ఏళ్లు కొనసాగే అవతారములు. పద్దెనిమిది పురాణాలను మరియు మహాభారతాన్ని వ్రాసి, వేదాలను నాలుగు విభాగాలుగా విభజించిన వేద వ్యాసుడు, ఇటువంటి అవతారమే.*
*3. వైభవావతారములు: తన దివ్య రూపంలో దిగివచ్చి తన మరిన్ని దివ్య శక్తులను ప్రకటించినవి. మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారములు వైభావావతారముల ఉదాహరణలు.*
*4. పరావస్థావతారములు: భగవంతుడు తన సమస్త దివ్య శక్తులను తన దివ్య స్వరూపంలో వ్యక్తపరిచినవి. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, నృసింహావతారము - పరావస్థావతారముల ఉదాహరణలు.*
*ఈ వర్గీకరణ వల్ల, ఏదో ఒక అవతారం మరో అవతారం కంటే ఎక్కువ అని చెప్పినట్లు కాదు. తనే ఒక అవతారమైన వేద వ్యాసుడు పద్మ పురాణంలో ఈ విధంగా చెప్పాడు: సర్వే పూర్ణాః శాశ్వతాశ్చ దేహాస్తస్య పరమాత్మనః ‘భగవంతుని యొక్క అన్ని అవతారములు ఆయన యొక్క అన్ని దివ్య శక్తులతో నిండి ఉంటాయి; అవన్నీ సంపూర్ణమైనవి, దోషరహితమైనవి.’ కాబట్టి, మనము ఒక అవతారము ఎక్కువది ఇంకో అవతారము తక్కువది అని తేడా చూపకూడదు. ప్రతి అవతారంలో, దేవుడు ఆ అవతారంలో తను చేయదలుచుకున్న పనికి అనుగుణంగా తన శక్తులను ప్రకటిస్తాడు. మిగతా శక్తులు ఆ అవతారంలోనే గుప్తంగా ఉంటాయి. అందుకే, ఈ వ్యత్యాసములను వివరించటానికే పై వర్గీకరణ చేయబడింది.*
💥✨💥 ✨💥✨ 💥✨💥
No comments:
Post a Comment