*ఎడబాటు*
చిత్రకథ
రచన : లక్ష్మి మదన్
🌹🌹🌹🌹🌹🌹🌹
పొద్దుటినుండి పనులతో సతమతమవుతోంది సుగుణ...
ఎన్ని పనులు చేస్తున్నా మనసు భర్త దివాకరం మీదనే ఉంది.
పిల్లలు బాగా చదువుకోవాలి.. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడాలని సగటు తల్లి దండ్రులలాగా ఆలోచించి ఎంత పొరపాటు చేశారో ఇప్పుడు అర్థం అవుతుంది..
పిల్లల పురుళ్ళ కోసం.. ఆ తర్వాత పిల్లలు ఉద్యోగాలకు వెళితే వారి పిల్లలను పట్టుకోవడం కోసం తల్లి తప్పక రావాల్సిందే, తండ్రి వస్తే అది బోనస్...
కానీ! అన్ని రోజులు అమెరికాలో ఇంట్లో బందీలుగా ఉండడం ఇక్కడ స్వేచ్చా జీవులైన మగవాళ్ళకి ఇష్టం ఉండదు కదా!
కానీ ఆడవాళ్లకు తప్పదు...
"అమ్మా! టికెట్ బుక్ చేస్తున్నాను.. నువ్వు వచ్చేటప్పుడు కొంత స్టీలు సామాను, అప్పడాలు వడియాలు, పచ్చళ్ళు ఇంకా కొన్ని వస్తువుల లిస్ట్ ఇస్తాను అన్నీ తీసుకుని రా! చెప్పడం మరిచాను నాన్నగారికి ఇంట్లో అన్నీ చేసి పెట్టి వచ్చేయ్ !నువ్వు ఇక్కడ ఒక ఆరు నెలలు ఉండాల్సి వస్తుంది" అని ఫోన్ చేసింది కూతురు..
భర్తకు చెప్తే ఒక నవ్వు నవ్వి..." కోడలు దగ్గరనుండి వచ్చావు. అక్కడ పిల్లోడి బారసాల అయ్యి ఆరు నెలలు నిండిన తర్వాత ఇండియా చేరుకున్నావు. ఇప్పుడు మళ్లీ కూతురు కోసం ప్రయాణం.. మరి నేను బ్యాంకులో ఎంత డబ్బు ఉందో చూసుకోవాలి కదా, నేనైతే అన్ని రోజులు ఉండలేను సుగుణా!" అన్నాడు దివాకరం
"అలా అంటారేంటండి ? పిల్లల అవసరాలు మనం కాకుంటే ఎవరు తీరుస్తారు.. వెళ్లి డబ్బు తీసుకొని రండి. షాపింగ్ చేయాల్సిన లిస్టు రాసుకుందాం. అన్నీ తెచ్చాక ప్యాకింగ్ చేసుకొని నేను బయలుదేరాలి ..మీకు కూడా అన్ని చేసి పెట్టి వెళ్తాను" అన్నది సుగుణ. ఆమెకు కూడా మనసులో వెళ్లాలని ఏమాత్రం లేదు.. ఇక్కడున్న స్వేచ్ఛ అక్కడ ఉండదు కదా ! కానీ పిల్లల కోసం తప్పదు.
అలా వచ్చిన సుగుణ ఇక్కడ పనుల ఒత్తిడిలో కూరుకొని పోయింది... కనీసం మన దేశంలో డబ్బులు పెడితే పని చేసే వాళ్ళు దొరుకుతారు. ఇక్కడ అన్నీ చేసుకోవాలి వయసు పై పడిపోతుంది ఒంట్లో శక్తి లేదు కానీ, ఆరోగ్యం ఎలా ఉన్నా చేయవలసిందే!
కూతురు అల్లుడు ఆఫీసుకి వెళ్ళాక పిల్లలని స్కూలుకు పంపించి అప్పుడప్పుడు భర్త కోసం పెద్ద ఉత్తరాలే రాస్తుంది సుగుణ. అర్థం చేసుకున్న దివాకరం ఏమీ చేయలేక తను కూడా బాధపడుతున్నాడు. మరొక సంవత్సరం అయితే రిటైర్ కాబోతున్నాడు ..వంట చేసుకుని వెళ్లడం కొంచెం కష్టంగానే ఉంది.. ఇంట్లో ఒంటరితనం భరించరానిదిగా అనిపిస్తుంది.
ఆరోజు ఎందుకో సుగుణ మనసు బాగాలేదు. ఉదయం నుండి భర్త గుర్తు వస్తూనే ఉన్నాడు, మరొక పక్క వయసయిపోయిన తల్లిదండ్రులు గుర్తుకు వస్తున్నారు... అందరూ వెళ్లాక వెక్కివెక్కి ఏడ్చింది సుగుణ.
ఏమీ తినాలనిపించలేదు.. తల్లిదండ్రులకు ఫోన్ చేసి కాసేపు మాట్లాడింది. భర్తకు ఫోన్ చేస్తే ముందు రోజునుండి ఎందుకో ఫోన్ కలవడం లేదు.. ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండని భర్త ఇలా ఎందుకు చేసాడో అర్థం కావడం లేదు. మనసు పరిపరి విధాల ఆలోచిస్తుంది...
వెళ్లి అమ్మవారికి దండం పెట్టుకుంది... ఇంతలో కాలింగ్ బెల్ మోగింది.. ఈ సమయంలో ఎవరు వచ్చారు.. అమెరికాలో అపాయింట్మెంట్ లేనిదే రారు కదా!
అలా అనుకుంటూ వెళ్లి తలుపుతీసింది సుగుణ.. ఎదురుగా భర్త దివాకరం నిలబడి ఉన్నాడు..
ఒక్కసారిగా ఆమె కళ్ళను నమ్మలేకపోయింది.. భర్తను పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది...
భార్య బాధను చూడలేని దివాకరం ఆఫీస్ కి సెలవు పెట్టి టికెట్ బుక్ చేయించుకుని సుగుణకి చెప్పకుండా అమెరికాకు వచ్చాడు.
ఇద్దరు ఎంతో సంతోషంగా ముచ్చటించుకున్నారు...
No comments:
Post a Comment