*🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*
*మరణం*
*మరణ మర్మాన్ని ఛేదించండి*
*మరణం తప్పని వారందరూ చదవాల్సిన పుస్తకం!!*
*సద్గురు*
*పరిచయం*
*మరణంతో ముఖాముఖి*
మన అందరికీ చక్కగా పద్ధతిగా జీవించాలని ఉంటుంది. సమయం వచ్చినప్పుడు చక్కగా మరణించాలని కూడా ఉంటుంది. నిజం చెప్పాలంటే, మనుషుల ఆకాంక్షలు అన్నీ కలిపితే వాటి సారాంశం ఇంతే!
ఈ రెండింట్లో కూడా మనుషులు తమ కృషిలో చాలా భాగం - దాదాపు మొత్తం అని చెప్పొచ్చేమో - చక్కగా జీవించడం కోసం కేటాయిస్తుంటారు. ఆ కృషికి ఫలితం కూడా సాధారణంగా అందుకు తగ్గట్టుగానే ఉంటుంది.
చక్కగా జీవించే విషయంలో మనుషులు సాధించింది చాలానే ఉంది. గతంలోని ఏ తరాలతో పోల్చినా, మనం ఎక్కువ సుఖాలను,సౌలభ్యాలను సమకూర్చుకున్నాం.
కానీ; చక్కగా, పద్ధతిగా మరణించటం విషయానికి వస్తే మాత్రం, మనం మన పూర్వికుల కంటే మెరుగైన విధంగా జీవిస్తున్నామని చెప్పడానికి ఆస్కారం కనిపించట్లేదు.
(ముఖ్యంగా జీవితంతోనూ మరణంతోనూ వ్యవహరించే రీతిలో సమాజం చూపించే తేడా యింకా అలాగే ఉంది).
జీవించడం అంటే ఏదో పెద్ద సంబరపడి పోవలసిన ఒక గొప్ప ఘన విజయం అయినట్టు, అలాగే మరణం అంటే గొప్ప సంతాపంలో ముంచేసే పరాజయం అయినట్టు, అవాంఛనీయమైనట్టు భావించడం ప్రపంచమంతటా జరుగుతూ ఉండే విషయమే.
(చిత్రమేమిటంటే, 'నాలుగు అక్షరాల పదాలు' అవాంఛనీయమైన ప్రయోగాలుగా భావించే ఆంగ్లభాషలో జీవన్మరణాలలో ‘Life' (లైఫ్) అనేది నాలుగు అక్షరాల పదం. 'Death' (డెత్) లో ఐదు అక్షరాలు. కానీ, అందరూ దాన్నే 'Death'నే అవాంఛనీయంగా భావిస్తారు.
మరణం అన్న మాట ఎత్తితేనే, డైనింగ్ టేబుల్ చుట్టూ జోరుగా జరుగుతున్న సంభాషణ కాస్తా ఒక్కసారిగా గుసగుసలోకి మారిపోతుంది. చావు గురించి మనం మాట్లాడితే, ఆ చుట్టు పక్కల ఎక్కడో ఎప్పుడూ ఉంటూ ఉండే మృత్యుదేవత దాన్ని ఆహ్వానంగా భావించి నేరుగా మన ఇంటికి వస్తుందని మనకు భయం.
పిల్లలేమిటి.. పెద్దలు కూడా చావు అనే మాట వాడడానికి ఇష్టపడరు. మరణం అనే మాటలో ఉన్న కర్కశత్వాన్ని కప్పేసే పర్యాయ పదాల కోసం ఎప్పుడూ వెతుకులాడుతుంటారు.
మనుషులకు మరణం గురించి నిజానికి ఎక్కువ తెలియదు. దీనికి కారణం, జీవితంగురించి కూడా వాళ్లకు తెలిసింది చాలా స్వల్పమే గనక అంటారు. కొందరు!
మరణం అనేది, ఒక సుదీర్ఘమైన జీవితం చివరి భాగంలో జరిగే ఒక చిన్న సంఘటన. అంతటి సుదీర్ఘ కాలం పాటు సంపూర్ణంగా జీవించిన తర్వాత కూడా,
మనుషులకు జీవితానికి సంబంధించిన చిన్న చిన్న ప్రశ్నలకే - మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఎక్కడికి వెళ్తున్నాం? - ఇలాంటి ప్రశ్నలకే సమాధానాలు తెలియవు.
అలాంటప్పుడు, మరణం గురించి వాళ్ళు మరింత అయోమయంలో ఉండడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఒక్క విషయం ఒప్పుకోవాలి.
ఈ మధ్యకాలంలో మనుషులు 'జీవితం అంటే దేవుడిచ్చిన కానుక. మరణం అంటే ఆయన ఆగ్రహం వల్ల కలుగుతున్న శిక్ష'- అనే అమాయికపు నమ్మకాల నుంచి మాత్రం చాలా దూరం పురోగమించారు.
మరణం అనే చీకటి రహస్యం గుట్టు విప్పాలంటే, మనుషులు మామూలుగా మత బోధనల వైపు దృష్టి సారించడం పురాతన కాలం నుంచి వస్తున్న సంప్రదాయం.
మరణానికి సంబంధించిన విషయాలను విడమరచి నిశితంగా చెప్పడం అనేది మాంత్రికులు, తాంత్రికుల లాంటి వారికే సాధ్యం అని ప్రాచీన కాలంలో ప్రజలంతా భావించేవాళ్ళు.
ఇటీవలి కాలంలో - అంటే దాదాపు రెండు వందల సంవత్సరాల క్రితం నుంచి - వైద్యశాస్త్రం వెలికి తెచ్చిన ఎన్నో నూతన పరిశోధనల వలన ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య, ఆయుః ప్రమాణాలు బాగా మెరుగవుతూ వస్తున్నాయి.
అందుచేత, ఇప్పటి ప్రజలయితే మాత్రం మరణం, ప్రాణ ప్రయాణం లాంటి విషయాలలో ఎదురయ్యే ప్రశ్నల సమాధానాల కోసం కూడా వైద్యశాస్త్రాన్నే ఆశ్రయిస్తున్నారు.
ఆధునిక విజ్ఞాన శాస్త్రం మృత్యువు మీద సాధించిన విజయాలకు నిదర్శనాలు కావాలంటే, ఆయుః ప్రమాణాల వృద్ధి, శిశు మరణాల తగ్గుదల అనే రెండే రెండు అంశాలు పరిశీలిస్తే చాలు!
ఆధునిక వైద్య శాస్త్రం సాధించిన అఖండ విజయానికి, తామరతంపరగా పెరిగి 7.75 బిలియన్ల సంఖ్యను చేరుకున్న భూగోళం జనాభా కంటే గొప్ప తార్కాణం వేరే అక్కర్లేదు.
ఈ ఒక్క విజయంతో జీవన మరణాలకు సంబంధించిన ప్రవచనాలు చేసే ఇతర నిపుణులందరినీ ఆధునిక వైద్యశాస్త్రం పక్కకు నెట్టి వేసింది.
ఆధునిక విజ్ఞాన శాస్త్ర దృక్పథంలో నిష్పాక్షిక దృష్టి, విశ్వజనీనతా ముఖ్య లక్షణాలు. అందుచేత అది మరణాన్ని కూడా మునుపెన్నడూ మనం గమనించలేకపోయిన కొత్త కోణాలనుంచి పరిశీలించగలుగు తున్నది.
కానీ, ఈ ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఆవిష్కరించే కాంతి పథాలలో కూడా వాటిలో ఉండే మచ్చలూ, పొరపాట్లూ, ప్రమాదాలూ లేకపోలేదు.
ఆధునిక విజ్ఞాన శాస్త్రం మరణాన్ని వినూత్న దృష్టి కోణాల నుంచి చూడటం వల్ల ఒక ముఖ్య ఫలితం కనిపిస్తుంది. వీరికి మరణం అనేది ప్రధానంగా ఒక వైద్య సంబంధ (medical) విషయంగా కనిపిస్తుంది.
వారు ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో, ఇప్పుడు మరణాన్ని ఒక ప్రకృతి సహజమైన ఘటనగా కాకుండా, ఒక వ్యాధి తాలూకు తుది దశగా మాత్రమే చూడటం జరుగుతున్నది.
అందుకే జీవితంలో మామూలుగా ప్రకృతి సిద్ధంగా కలిగే మార్పులూ, పరిణామాలూ కూడా ఆరోగ్యపరమైన విపత్తులు గానూ, వ్యాధులుగానూ పరిగణించబడు తున్నాయి.
ఆ కారణంగానే ఇప్పుడు మరణశయ్య మీద ఉన్న వారికి వైద్య చికిత్స ఉపాయాలు, సాధనాలు మునుపటి కంటే విరివిగానూ, సాహసికం (aggressive) గానూ వాడుతున్నారు.
అసలు మనుషులకు, 'ఎప్పటికైనా చావు తప్పదు' అన్న సత్యం ఎప్పుడూ కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. మనిషి మృతి లేని 'అమృతత్వ స్థితి' (Immortality) కోసం చారిత్రికంగా సాగిస్తూ వస్తున్న అన్వేషణకు ఆధునిక విజ్ఞానం సాధిస్తున్న విజయ పరంపర కొత్త ఊపిరులు ఊదుతున్నది.
ఈ శాస్త్ర విజ్ఞానం అండ చూసుకునే, ఇప్పటి మనుషులు, మనిషికి ఎన్నటికీ మృతిలేని అమృతత్వ స్థితే అసలు సహజ స్థితి అని, మృత్యువు అనేది నివారణ సాధ్యమైన ఒక విపరీత ఘటన అని సిద్ధాంతం చేసేందుకు సిద్ధపడుతున్నారు.
మరణం అనేది ఇంతకుముందు మానవజాతి పోరాడి జయించిన ఎన్నో ఇతర వ్యాధుల లాంటి వ్యాధి మాత్రమే అన్న భావనకు వచ్చేస్తున్నారు.
అంతేకాదు, మన జీవిత కాలంలోనే మన తెల్ల దుస్తుల నిపుణులు, మృత్యువుని మాత్రం జయించలేక పోతారా అనే భరోసాకూ ఆస్కారం ఏర్పడింది.
శరీర సహజమైన జీవక్రియలకు అడ్డుపడేందుకు వైద్యసామర్థ్యం పెరుగుతుండటంతో, క్రమంగా అలా అడ్డుపడడం అనేది మరింత ఎక్కువైపోతున్నది.
ఒక్కొక్కప్పుడు విజ్ఞాన శాస్త్రజ్ఞులను చూస్తే, ఏనుగును పరీక్ష చేసే ఆరుగురు అంధులు గుర్తుకొస్తారు. ఎవరు తాకిన అవయవాన్ని వాళ్లు సరిగ్గానే వర్ణించినా, అన్నీ కలిపితే వచ్చే సమగ్ర అవగాహన మాత్రం వీళ్ళకి చిక్కదు.
వీళ్లలాగే నేటి శాస్త్రజ్ఞులది కూడా తాళం చెవి రంధ్రం (key-hole) లో నుంచి కనిపించిన దృశ్యమంత సంకుచితమైన అవగాహనే.
మరణం అనేదాన్ని - జీవితం లాగే- మూడు ముఖ్యాంశాల కలయికగా చూడవచ్చు. ఒకటి భౌతికమైన అంశం. రెండవది మానసిక సంబంధమైన అంశం. మూడవది మొదటి రెండింటికీ కారణభూతమైన 'ఆత్మసంబంధమైన, 'ఆధ్యాత్మిక' మైన, భౌతికాతీతమైన (metaphysical) అంశం.
ఇటీవలి కాలంలో మరణానికి సంబంధించిన భౌతిక విషయాల గురించి మనకున్న విజ్ఞానం బాగా పెరిగిపోయింది. సరిగ్గా ఎప్పుడు జీవనం ముగిసినట్టో, మరణం ఆరంభమైనట్టో, మనం ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ ఖచ్చితంగా నిర్ణయించగలం.
మనస్సంబంధమైన విషయాల విజ్ఞానం కూడా బాగా పెరిగిపోయింది. ఒక మనిషి నైజం ఎలా ఏర్పడుతుంది ? అతగాడి జన్మ సిద్ధమైన గుణాల వలనా? లేక పెంపకంలో వచ్చిన లక్షణాల వలనా?
ఈ రెండు విధాల గుణాలు ఎలాంటి పాత్ర పోషిస్తాయి ? ఇలాంటి విషయాలలో కూడా మనకున్న అవగాహన బాగా పెరిగిపోయింది.
కానీ, అంతకంటే ఎక్కువ ముఖ్యమైన ప్రశ్న, ‘అసలు జీవితమూ, మరణమూ అనేవి ఎందుకు సంభవిస్తాయి?' అని.
ఇది మాత్రం ఇప్పటికి కూడా చాలా వరకు మనిషి అవగాహన పరిధికి ఆవలే ఉండిపోయింది.
దురదృష్టవశాత్తూ, ఈరోజు వరకూ కూడా జీవితం అనేది విజ్ఞానశాస్త్రం పరిధిలోకి వచ్చేది, శరీరం ఏర్పడిన క్షణం నుంచి, శరీరం అంతమయ్యే క్షణం దాకా మాత్రమే.
అలా శరీరం ఏర్పడే ముందుగానీ, శరీరం పడి పోయిన తర్వాత గానీ కొంత కథ ఉండవచ్చు అనే ఊహను కూడా శాస్త్రవిజ్ఞానం తోసిపుచ్చి, తిరస్కరిస్తుంది.
కానీ; అసంఖ్యాకమైన అమరికలూ, ప్రస్తారణలకు (Permu-tations and Combinations) నెలవైన ఈ విశాల విశ్వంలో, జీవితం అనేది కూడా ఒక యాదృచ్ఛికమైన ఘటన మాత్రమే అనే సిద్ధాంతం లోపభూయిష్టంగా కనిపిస్తుంది.
ఏదో ఒక తెలియని శక్తి, అకస్మాత్తుగా ప్రాణులలో జీవశక్తి అనే ఒక మీట నొక్కేసి, కొంతకాలం తర్వాత మళ్లీ అంతే అకస్మాత్తుగా మళ్లీ మీట నొక్కి ఆ జీవశక్తిని అంతం చేస్తుందనే సిద్ధాంతాన్ని ఎంతో లోతుగా పరీక్షించాల్సిన అవసరం ఉందని ఆధునిక విజ్ఞాన శాస్త్ర ప్రమాణాల ప్రకారం కూడా అంగీకరించాల్సిందే.
భౌతిక శరీరం అంతమైన చోటే ఆధునిక విజ్ఞాన శాస్త్రం అన్వేషణ ఆగిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది అనే విషయం గురించి అనేక సిద్ధాంతాలు చేయటం ప్రపంచంలో ఉన్న వివిధ మతాల వంతుగా మిగులుతుంది.
ఆ సిద్ధాంతాలన్నింటి మధ్యలో ఎక్కడో అయోమయంలో ఇరుక్కొని ఉంటాడు సామాన్యుడు. అలాంటి సందర్భాల్లోనే సద్గురు వంటి యోగుల, ధార్మికుల ప్రవచనాలు అమూల్యమైన సహాయాన్ని అందిస్తాయి.
కారణం, సద్గురు చెప్పే విషయాలు సంప్రదాయం మీదనో, శాస్త్ర గ్రంథాల మీదనో, పుస్తక పాండిత్యం మీదనో కాకుండా, ఆయన అంతర్గతమైన అనుభూతులూ, అనుభవాల మీద ప్రధానంగా ఆధారపడి ఉండటం.
సద్గురు ఆధునిక ధార్మికులు. జీవితం గురించి, దాన్ని వికసింప చేసే ఆత్మోద్దరణ సాధనాల గురించి తనకు గల అసదృశమైన అవగాహనతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజలను స్పృశించి, సంస్కరించిన యోగి.
నాలుగు దశాబ్దాల క్రితం అప్పటికి సద్గురు ఇంకా కోడె వయసు గడసరి యువకులు - ఒకరోజు మధ్యాహ్నం వేళ కలిగిన అతి తీవ్రమైన ఆధ్యాత్మిక అనుభూతి, సద్గురు జీవితాన్నీ, ప్రపంచం పట్ల ఆయన దృక్పథాన్నీ పూర్తిగా మార్చి వేసింది.
'అకస్మాత్తుగా నా జీవితం అంతా 'నేను.' 'నేను...' అనుకుంటూ వస్తున్నది. ఏదో, అది నా చుట్టూ పడిపోయింది. నాకు ఇక 'నేనె'వరో, 'నేను కానిది' ఎవరో తెలియకుండా పోయింది !'
ఆ స్థితి ఆయనకు ఎంతో మహదానందాన్ని కూడా కలిగించింది. ఆ తర్వాత కొద్ది నెలల్లో ఆ అనుభూతి కొంత స్థిరపడి, నిత్య సత్యంగా నిలిచిపోయింది.
ఈ ఆత్మజ్ఞానానుభూతి, ఆయనలో తన గడిచిపోయిన జన్మల జ్ఞాపకాల వెల్లువను పరుగెత్తించింది. జీవనం- మరణం అనే ప్రక్రియల గురించి సమగ్రమైన అవగాహన కలిగించింది.
ఈ అనుభవం కలిగించిన ప్రేరణ వల్లనే. సద్గురు యావత్ ప్రపంచానికీ జీవితం ఎలా గడపాలో నేర్పాలనే ప్రణాళికను కార్యరూపంలో పెట్టారు.
గత నాలుగు దశాబ్దాలలో, ఈ ప్రణాళిక ఒక విశ్వవ్యాప్తమైన ఆత్మోద్ధరణ ఉద్యమంగా రూపు దాల్చింది.
అయితే, పరమానందభరితమైన జీవన విధానం(-Joyful living) విషయంలో అగ్రగణ్యుడుగా భావించబడే సద్గురు, మరణం విషయంలో కూడా అంతటి అగ్రగణ్యులుగా పరిగణించబడుతూ రావటం ఏ క్షణంలో ఆరంభమైంది అనేది ఎంత తరచి పరిశోధించినా స్పష్టంగా చెప్పలేం.
ఆయన తన గత జన్మ విశేషాలను స్పష్టంగా వివరించడం ఆరంభించినప్పుడా? లేక, 25 సంవత్సరాల క్రితం ఆయన, మొట్టమొదటిసారిగా,
'నా జీవిత ధ్యేయం మూడు జన్మల క్రితం నా గురుదేవుడు నాకు విధించిన "ధ్యాన లింగ" ప్రతిష్ఠ బృహత్కార్యం- మహా యోగులు అందరూ కలలు కనే కార్యం - పూర్తి చేయటం" అని స్పష్టంగా ప్రకటించినప్పుడా?
లేక, ఆయన చుట్టూ ఉన్న వారిలో చాలా మంది ఒక్కసారిగా, అకస్మాత్తుగా, తమతమ పూర్వజన్మలలో తమకు సద్గురుతో ఉన్న అనుబంధం గుర్తు తెచ్చుకోగలిగినప్పుడా?
సరిగ్గా ఎప్పుడు ప్రారంభమైందో తెలియడం లేదు గానీ, ఇవి జరిగిన కొద్ది కాలానికే చాలామంది జిజ్ఞాసువులు జీవన్మరణ ప్రక్రియల గురించిన వివరణల కోసం కూడా సద్గురునే ఆశ్రయించడం ఆరంభమైంది.
కానీ, సద్గురుకు మరణానికి సంబంధించిన విషయాలను గురించి మాట్లాడడం అంటే ఉత్సుకత ఎప్పుడూ ఉండేది కాదు.
అప్పుడప్పుడూ ఆయన ఈ విషయాన్ని దాటేస్తున్నారు అనిపించేది. 'మరణానంతరం ఏం జరుగుతుంది, సద్గురు?' అని ఆయనకు చిన్న, అమాయకపు ప్రశ్న వేసేసి,
లోతైన జీవన రహస్యాల గురించి సమాచారమంతా రాబట్టగలమని అనుకున్న వాళ్లు ఎందరో, పాపం నిరుత్సాహం పాలయ్యారు.
వాళ్లను ఆటపట్టించే సమాధానం ఏదో ఇచ్చి 'కొన్ని విషయాలు స్వానుభవంతోనే తెలిసి వస్తాయి!') సద్గురు వాళ్లను ఉడికించే వారు.
కొందరు, 'చనిపోయిన వారితో సంభాషించడం ఎలా?' అని అడిగితే, 'ముందు బ్రతికున్న వాళ్ళతో సంభాషించడం బాగా నేర్చుకోండి!' అనేవారు.
ఇక 'souls - ఆత్మలు- ఉంటాయా? 'అని ప్రశ్నిస్తే, ప్రతి వారికీ రెండు పాదాల క్రింద 2 soles- అరి కాళ్ళు ఉంటాయి కదా!' అని శ్లేషించే వారు.
అయితే, ఆయన తను బోధించే బోధనలు, సాధనలు అన్నింట్లోనూ మరణం గురించి ఛాయామాత్రంగానైనా స్పృశించకుండా ఉండేవారు కాదు.
సాధకులకు నివాస వసతులు కూడా ఏర్పరిచి జరిపే శిక్షణా కార్యక్రమాలు కొన్ని ఉండేవి. ఆ కార్యక్రమాలలో, వేకువజామునే వచ్చి, హాలు నిండా ఉన్న శ్రోతలు వింటుండగా; ముఖంలో ఏ భావమూ లేకుండా చావు గురించి ఉపన్యాసం ఇవ్వగలిగిన వ్యక్తి బహుశా సద్గురు ఒక్కరే!
ఉపన్యాసం తర్వాత, మరణాన్ని ఎవరికి వారు ఎలా అనుభవించవచ్చో చూపే ధ్యాన పద్ధతిని కూడా ఆయన తను చేసి చూపుతూ వాళ్లకు నేర్పేవారు!
'సునాయాసమైన జీవన విధానం' (The way of effortless living) గురించి బోధించేటప్పుడు, మరణంలాంటి అనుభవాన్ని పోలిన ధ్యాన సాధన నేర్పి, దానిని రోజూ రెండుసార్లు ఆచరించుకోవాలని నేర్పేది కూడా బహుశా ఆయన ఒక్కరే!
సద్గురు ప్రతి ఒక్కరికీ పరమానందంగా జీవించడం ఎలాగో నేర్పుతాననే పెద్ద లక్ష్యంతో మొదలు పెట్టగలరు. ఆ శిక్షణ తను అనుకున్నట్టుగా సాగటం లేదని అనిపించినట్టయితే,
ఆ వాస్తవాన్ని గ్రహించి, కనీసం ప్రశాంతంగా మరణించడం ఎలాగో అన్నా నేర్చుకోమని, అది నేర్పగలరు!
'మీరు నా నుంచి ఉపదేశం పొంది ఉంటే, కనీసం త్రికరణశుద్ధిగా పూర్తి ఏకాగ్రతతో ఒక క్షణం అయినా సరే నా ముందు కూర్చునే పొరపాటు చేసి ఉంటే, ఇక మీకు పునర్జన్మ ఉండదు!' అని శిష్యులకు భరోసా ఇవ్వగలరు. ఇలా చెప్తూ పోతే ఈ జాబితాకు అంతే ఉండదు.
ఒకసారి మేము సద్గురు మీద ఒక డి.వి.డి చిత్రీకరిస్తున్నాం. ఒకరెవరో అడిగారు, 'చాలా తూర్పు దేశాల సంప్రదాయాలలో, మరణించే ముహూర్తానికి గొప్ప పవిత్రతను ఆపాదిస్తూ ఉంటారు. దీనికి కారణం ఏమిటి?
మరణించిన మరణఘడియలకు అంత గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యం కట్టబెట్టాలా?' అని.
ఆ సమయంలో సద్గురు ఇలాంటి ప్రశ్నలు చిలిపితనంతో దాటవేసే ధోరణిలో లేరు.
'మరణించే క్షణాల గురించి జాగ్రత్త వహిస్తే, సరైన ముందస్తు ఏర్పాట్లు చేసుకుని, సరైన మార్గదర్శనం లభించి, ఎంతో కొంత లోకాతీతమైన సహాయం కూడా పొందగలిగితే,
ఆధ్యాత్మికపరంగా జీవిత కాలంలో జరగని అనుభవాలు కూడా మరణ సమయంలో జరగవచ్చు' అని అన్నారు. ఆయన చెప్పిన సమాధానం నాకొక కొత్త పాఠంగా అనిపించింది.
'మరణం కూడా ఒక ఆధ్యాత్మిక సాధన ఉపాయం కావచ్చు' అన్న విషయం, అంతకుముందు నేనెక్కడా విన్నది కాదు.
ఆ తర్వాత దీని మీద కొంత చర్చ జరిగింది. అయితే అప్పుడు మేము చిత్రీకరిస్తున్న వీడియో చిత్రం విషయానికీ, దీనికీ సంబంధం లేకపోవడం వల్ల సద్గురు మరిన్ని వివరాల్లోకి పోలేదు.
కానీ సద్గురు మాటలు నాకు ఎంతో ఆసక్తికరంగా అనిపించాయి. అందరూ ఎంతగానో భయపడి, ఎంతో దూరంగా ఉంచాలి అనుకునే, మరణం అనే జీవిత ఘట్టంలో నిజంగా ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధన ఉపాయం దాగి ఉందా?
మనకు తెలియకుండానే మరణ సమయంలో, మనం కోరుకుంటే, ఒక గొప్ప ప్రస్థానానికి ఉచితంగా అవకాశం లభిస్తుందా? ఇది, ఇంతకు ముందెప్పుడూ మనం విని ఉండక పోవటానికి కారణం ఏమిటి?
దీని గురించి మరిన్ని చర్చలు జరగకపోవడానికి కారణం ఏమిటి ? ప్రజలకు దీని గురించి సరైన సమయంలో మనం ఎందుకు తెలియజెప్పటం లేదు?
ఈ విషయంలో మనం సన్నద్ధులం అయ్యేందుకు కావలసిన మార్గదర్శకత్వాన్ని సద్గురు అందించగలరా?
నిస్సందేహంగా ఆయన అందించగలరు', కానీ అందిస్తారా? లోకకళ్యాణ విషయాలలో మరో అంశం గురించి కూడా మీరే మరింతగా కలుగ చేసుకోవాలని బతిమాలితే ఆయన ఒప్పుకుంటారా?
ఒప్పుకోవడానికి సద్గురు సిద్ధంగానే ఉన్నారు. కానీ, ఈ పుస్తకాన్ని సంకలనం చేయడం నేను అనుకున్నంత సులభంగా మాత్రం పూర్తి కాలేదు.
'ఓ విషయం చక్కగా తెలిసిన వారికి, దాన్ని తన మాటలలో ఇతరులకు తెలపడంలో కష్టమేం ఉంటుంది? ఇది తేలిక పనే!' అని అనుకున్నాను. అలా అనుకోవడం నా అమాయకత్వం అని నిలకడ మీద తేలింది.
ఎందుకంటే, సాధారణంగా బోధన అనేది తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి తీసుకెళ్ళ గలదు. కానీ ప్రస్తుత సందర్భంలో తెలిసిన విషయానికీ, తెలియని విషయానికీ మధ్య ఉన్న అంతరం చాలా పెద్దది!
జీవితం అనే మహాద్భుతమైన విషయాన్ని, ఆధునిక విజ్ఞాన శాస్త్రజ్ఞులు చూస్తున్నట్టు, కేవలం జననానికీ, మరణానికీ మధ్య గడచి పోయిన కొంత సమయంగా మాత్రమే చూడకూడదు.
జీవితం మూలం సృష్ట్యాది దాకా పాతుకుని ఉంటుంది. సృష్టి ఏ గమ్యానికి చేరబోతున్నదో అక్కడి దాకా వ్యాపించి కూడా ఉంటుంది. కనుక, ఈ సత్యాన్ని గమనించకుండా మరణం గురించి ఎలాంటి అవగాహన ఏర్పరుచుకున్నా అది అసంపూర్ణమూ, అసమంజనమూ అయి తీరుతుంది.
ఈ పుస్తకం మొదటి భాగం - 'ఒకే శ్వాసలో జీవన మరణాలు'లో, సద్గురు జీవన మరణ ప్రక్రియలు రెంటినీ వివిధ కోణాల నుంచి విశ్లేషించి చూపుతారు.
ముందు యోగ శాస్త్ర పరమైన అవగాహనను వర్ణిస్తారు. తరువాత, మరింత సరళంగా మనకు చిరపరిచితమైన బుద్బుద (నీటి బుడగ) ప్రాయం అన్న పోలికతో చర్చిస్తారు.
చర్చను కొనసాగిస్తూ, ఇలాంటి చర్చల సాధారణ పరిమితులను దాటి వెళ్లి పోతారు. జీవితపు మూలాలను సృష్టి ఆరంభం వరకు తీసుకెళ్లి, తర్వాత మనందరం అనుభవించే జనన మరణ చక్రంతో అనుసంధిస్తారు.
మరణాలలో భేదాలు వివరిస్తారు. మరణం విషయంలో మన ముందున్న వికల్పాలను (options) చర్చిస్తారు. మొదటి భాగాన్ని, మరణాలలో అత్యున్నతస్థాయిగా పరిగణించబడే మహాసమాధిని గురించిన వర్ణనతో ముగిస్తారు. ఆధ్యాత్మిక సాధకులు అందరూ కోరుకునే గమ్యం మహాసమాధి.
జనన మరణాల వెనక ఉండే ప్రక్రియలను విశదపరచడమే కాదు, ఈ పుస్తకం ముఖ్యోద్దేశాలలో ఒకటి 'సవ్యమైన' మరణాన్ని పొందటానికి సాయం అందించడం.
'అవసానం కూడా అందమైనదే' అన్న శీర్షిక ఉన్న ఈ పుస్తకం రెండో భాగంలో సద్గురు ‘సవ్యమైన, చక్కని' మరణం అంటే ఏమిటో దానికి ఎలాంటి ముందస్తు సన్నాహాలు మనం చేసుకోవచ్చో విపులీకరిస్తారు.
ప్రాణ ప్రయాణ సమయంలో మనిషి తన పనులు తాను చేసుకోలేని అత్యంత నిస్సహాయస్థితిలో ఉంటాడు కదా!
అటువంటి స్థితిలో ఉన్న వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించవచ్చునో, అలాంటి సహాయం మరణ యాతనలో ఉన్న వారికి ఎంత విలువైనదో కూడా సద్గురు వివరిస్తారు.
కొన్ని చిన్నచిన్న పనులతో మనం ఒక జీవుడి మరణానంతర ప్రస్థానంలో ఎలా సహాయపడవచ్చో సూచిస్తారు.
అంతేకాక, శోకం గురించి కూడా కొన్ని అమూల్యమైన సూక్ష్మాలను విడమరిచి, మనం శోకాన్ని ఎలా నియంత్రించుకోవచ్చో చర్చిస్తారు.
మరణానంతర జీవితం అనేది నిజానికి మరణానికీ, ప్రాణ ప్రయాణానికి సంబంధించిన విషయం అనలేం. కానీ అది మరణం నుంచి పుట్టుకొచ్చే పరిణామం.
ఈ పుస్తకం మూడో భాగం 'మరణానంతర జీవితం'. ఇందులో సద్గురు, ఎన్నో అపార్థాలకూ, అపోహలకూ, అన్యాయపు విమర్శలకూ విషయమైన మరణానంతర జీవితపు మర్మాలను విశ్లేషిస్తారు.
ఇందులోనే సద్గురు దెయ్యాలు, భూత ప్రేతాల గురించి కూడా చెప్తారు. అవెలా పుట్టుకొస్తాయో, ఎలా జీవిస్తాయో, అవి మనల్ని ఏమి చేయగలవో, ఏమి చేయలేవో, వాటి నుంచి ఎలా సురక్షితంగా ఉండవచ్చో వివరిస్తారు.
పునర్జన్మల గురించి కూడా ఆయన ఈ భాగంలో చర్చిస్తారు. మన పూర్వ జన్మలకు, మన ప్రస్తుత జన్మల మీద ఏ కొంచెం అయినా ప్రభావం ఉంటుందో లేదో విశ్లేషిస్తారు.
ఆ విశ్లేషణలో భాగంగా సద్గురు తన పూర్వ జన్మల గురించి చెప్పుకొస్తారు. 'మీరు మళ్ళీ అవతరిస్తారా?' అని శిష్యులు ఆయనను తరచుగా అడిగే ప్రశ్నకు కూడా సమాధానం ఇస్తారు.
ఈ పుస్తకం మరణం గురించీ, ప్రాణ ప్రయాణం గురించీ మనం తెలుసుకోగోరే సమస్త విషయాలను సమగ్రంగా, ఆమూలాగ్రంగా విశద పరుస్తుందని చెప్పలేం.
అలాగే, ఇది సద్గురు బోధనల సర్వస్వాన్ని అందజేస్తుందనీ చెప్పలేం. కానీ ఇది మరణాన్ని గురించి ఈ లోకంలో ప్రచారంలో ఉన్న అపోహల పరంపరను, తుడిచి పెట్టేందుకు ఒక శక్తిమంతమైన సాధనం మాత్రం అవుతుంది.
సద్గురు అందిస్తున్న పరికరాలనూ, సద్గురు మనతోపాటు మన మధ్య ఉండటం అనే మహదవకాశాన్నీ మనం వినియోగించుకొని మన మరణాలనే మరింత రమణీయంగానూ, ఆధ్యాత్మిక దృష్ట్యా అర్థవంతంగానూ ఎలా చేసుకోవచ్చో నేర్పటం
ఈ పుస్తకం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనం.
ముందు రాబోతున్న మరణం విషయమైన చర్చల పరంపరలో,
ఈ పుస్తకం ముఖ్యప్రయోజనాన్ని మాత్రం మరిచిపోకూడదు!
*స్వామి నిసర్గ*
*సేకరణ : సకల దేవత సమాచారం గ్రూపు.*
*🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*
No comments:
Post a Comment