*వినాయకుని విశిష్టత.....*
*మనం నివసించే నేలను 'కర్మభూమి' అంటారు. మన జన్మలన్నీ కర్మలతో ముడిపడి ఉన్నాయి. 'కర్మ' అంటే క్రియ, లేక పని అని అర్ధం. మానవాళికి కర్మలు జన్మహేతువులే కాక జీవనోపాయాలుగా కూడా ఉంటున్నాయి.*
*కర్మలు సత్కర్మలనీ, దుష్కర్మలనీ రెండు రకాలు. 'యాన్యనవద్యాని కర్మాణి, తాని సేవితవ్యాని' అన్న వేదవచనాన్ని అనుసరించి సత్కర్మలే చేయాలి.*
*'అత్రాహారార్థం కర్మ కుర్యాదనింద్యం' ఆహారం కోసం నింద్యం కాని కర్మ చేయాలని 'యోగవాసిష్టం' బోధిస్తుంది.*
*కర్మలు చేసేటప్పుడు ఎన్నో అంతరాయాలు ఏర్పడుతుంటాయి. 'విఘ్నాలకు భయపడి కొందరు కర్మలకు పూనుకోరనీ, మరికొందరు ప్రారంభించిన కర్మలకు విఘ్నాలు వస్తే విరమించుకొంటారనీ, ఉత్తములు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ప్రారంభించిన పనిని పూర్తిచేసే వరకూ వదలర'నీ భర్తృహరి చెప్పాడు.*
*ఎంత పట్టుదలతో కార్యనిర్వహణకు పూనుకొన్నప్పటికీ తీవ్రాతితీవ్రమైన* *విఘ్నాలు ఏర్పడితే ఏం చేయాలి? ప్రయత్నం నుండి విరమించకతప్పని పరిస్థితి తప్పదు కదా! ఆస్తికులైన భారతీయులు తాము చేపట్టిన పనులకు విఘ్నాలు. కలగకుండా ఉండాలని విఘ్నాలకు ప్రభువైన ఒక దేవుణ్ణి పూజిస్తారు. ఆ దేవుడే వినాయకుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, గణనాయకుడు, గజాననుడు. ఇత్యాదిగా పలు పేర్లతో వ్యవహరింపబడుతున్నాడు.*
*ఒక్క మానవులే కాదు, బ్రహ్మ మున్నగు దేవతలు కూడా తమ తమ కార్యాలు ప్రారంభించే వేళ గజవదనుణ్ణి భజించి కృతకృత్యులవుతారని ఈ క్రింది శ్లోకం చెబుతోంది.*
*వాగీశాద్యా స్సుమనసః సర్వార్ధాన ముపక్రమే |*
*యః నత్వా కృతకృత్యాః స్యుస్తం నమామి గజాననమ్ ||*
*తలపెట్టిన పనులకు కలిగే విఘ్నాలను నివారించే దేవుడన్న విశ్వాసంతోనే జనులు పెళ్ళిళ్ళు, గృహ నిర్మాణాలు, విద్యాభ్యాసాలు, సంస్థల ప్రారంభాలు ఇత్యాది కార్యక్రమాలలో 'అవిఘ్నమస్తు' అంటూ తొలుత విఘ్నేశ్వరుణ్ణి పూజించడమనే సంప్రదాయం వేద కాలం నుండీ ఏర్పడింది. ఈ సందర్భాలు ఏర్పడితే సంవత్సరంలో ఎప్పుడైనా కార్యారంభంలో వినాయక పూజలు నిర్వర్తిస్తారు.*
*కానీ 'వినాయక చవితి' కాలంలో ఈ దేవునికి గణేశోత్సవాలు అన్న పేరుతో విశేష పూజలు జరుగుతాయి. తొమ్మిది దినాలకు విస్తరించిన ఈ ఉత్సవాలు మొదట మహారాష్ట్రలో ప్రారంభమై, క్రమక్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రాకాయి. గణపతిని ఉద్దేశించి చేసే నవరాత్రి ఉత్సవాలను ప్రజలు సమధిక ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. భిన్న భిన్న వర్గాలకు చెందిన ప్రజలు ఒక్కటిగా చేరి వినాయకుణ్ణి ఆరాధించడం ద్వారా జాతీయ సమైక్యత కూడా వృద్ధి చెందుతుంది.*
*భాద్రపదమాసంలోని శుక్లపక్షంలో చతుర్ది (చవితి)ని 'వినాయక చవితి' పర్వదినంగా మనం జరుపుకొంటున్నాం. ఈ చవితి నాడే గణపతి ఆవిర్భవించాడు. ఈనాడు చేసే పూజలు, ఉపాసనలు అధికఫలాలను ప్రసాదిస్తాయని పురాణాలు. ఘోషిస్తున్నాయి. భాద్రపద శుద్ధ చతుర్థినాడే శివుడు వినాయకునికి విఘ్నాలపై ఆధిపత్యమిచ్చాడు.*
*వినాయకుని జననం గురించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒక ప్రసిద్ధ కథను ఇక్కడ సంగ్రహంగా ప్రస్తావించుకొందాం:*
*పార్వతీదేవి సల్గుపిండితో ఒక బాలుని బొమ్మను చేసి దానికి ప్రాణం పోసింది. ఆ బాలుణ్ణి కైలాసగిరికి కాపలాగా పెట్టింది. ఆ బాలుడు శివుణ్ణి లోనికి రానీకుండా అడ్డుకున్నాడు. ఆగ్రహించిన శివుడు అతని శిరస్సు ఖండించాడు. తదుపరి పార్వతి ప్రార్ధన మేరకు మళ్ళీ ఏనుగు శిరస్సును అతికించి ఆ బాలుణ్ణి పునర్జీవితుణ్ణి కావించాడు.*
*విఘ్నేశ్వరుడు చవితినాడు భక్తులు సమర్పించిన భక్ష్యాలను మితిమీరి భుజించాడు. భుక్తాయాసంతో తల్లితండ్రులకు సాష్టాంగ నమస్కారం చేయజాలక శ్రమ పడ్డాడు. అది చూసి శివుని శిరోభూషణమైన చంద్రుడు పరిహసించాడు. పార్వతికి కోపం వచ్చింది. చంద్రుణ్ణి చూసిన వారికి నీలాపనిందలు కలుగుతాయని శపించింది. పిదప దేవతల ప్రార్ధనలు విని శాంతించి, శాపాన్ని భాద్రపద శుద్ధ చతుర్థీ కాలానికే పరిమితం చేసింది. గజాననుణ్ణి భక్తితో ప్రార్థిస్తే ఆ దినం కూడా శాపప్రభావం ఉండదని పార్వతీదేవి అనుగ్రహించిందని పురాణగాథ.*
*'గణపతి' పేరుతో ఏర్పడిన ఒక మతానికి 'గాణాపత్యం' అని పేరు. షణ్మతాలలో ఇదొకటి. గాణాపత్య సంప్రదాయంలో 'మహా గణపతి, హరిద్రా గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, నవనీత గణపతి, స్వర్ణ గణపతి, సంతాన గణపతి' అని షడ్విధ గణపతులు ప్రశస్తి పొందారు.*
*"బాల గణపతి, తరుణ గణపతి, భక్త గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, ద్విజ గణపతి, సిద్ధి గణపతి, ఉచ్ఛిష్ట గణపతి, విఘ్న గణపతి, క్షిప్ర గణపతి, హేరంబ గణపతి, లక్ష్మీ గణపతి, మహా గణపతి, విజయ గణపతి, నృత్త గణపతి, ఊర్ద్వ గణపతి, ఏకాక్షర గణపతి, వర గణపతి, త్య్రక్షర గణపతి, క్షిప్రప్రసాద గణపతి, హరిద్రా గణపతి, ఏకదంత గణపతి, సృష్టి గణపతి, ఉద్దండ గణపతి, ఋణవిమోచక గణపతి, ఢుంఢి గణపతి, ద్విముఖ గణపతి, త్రిముఖ గణపతి, సింహ గణపతి, యోగ గణపతి, దుర్గా గణపతి, సంకటహర గణపతి, వల్లభ గణపతి, సిద్ధిబుద్ధి గణపతి" అని ముప్ఫై నాలుగు విధాల గణపతులు భిన్న భిన్న రూపాలు గలవారై, భక్తుల సేవలను అందుకుంటున్నారు."*
*గణేశునికి 21 అనే సంఖ్య ప్రీతికరమైనదట! వినాయకచవితి నాడు విశేషించి ఏక వింశతి (21) పత్రాలతో వినాయకుణ్ణి అర్చిస్తారు. ఆ పత్రాలు ఓషధి జాతులకు చెందినవి కావడం గమనార్హం.*
*ఉత్తరేణి, జిల్లేడు, మద్ది, రావి, గన్నేరు, అడవిమొల్ల, మామిడి, జాజిమల్లె, తులసి, ఉమ్మెత్త, దానిమ్మ, గరిక, దేవదారు, రేగు, మారేడు, వాకుడు, మరువం, మాచీపత్రి, విష్ణుక్రాంతి, జమ్మి, వావిలి. ఈ 21 పత్రాల ప్రభావం గణేశతత్త్వాన్ని వివరించే గ్రంథాలలో విస్తృతంగా వర్ణితమైంది.*
*వినాయకుని లీలావిలాసాలు బ్రహ్మ- బ్రహ్మాండ-స్కంద-మౌద్గల పురాణాలలో కీర్తితమయ్యాయి. ఈ దేవుణ్ణి స్తుతించే స్తోత్రాలు కూడా అత్యధికంగా ఉన్నాయి. గణేశగీత, గణేశ సహస్రనామ స్తోత్రం ఇత్యాది గ్రంథాలు వినాయకుని ప్రశస్తిని వివిధ రీతులలో ప్రతిపాదిస్తున్నాయి.*
*గణేశ్వరుని శరీరంలోని అవయవాలు చూసేవారికి వింతగా కనిపిస్తాయి. ఉదాహరణకు ఆయన చెవులు చేటల వంటివి. చేట అనవసర పదార్థాన్ని, అవసరమైన పదార్థం నుంచి తొలగించడంలో సాయపడుతుంది. అలాగే, వినాయక దేవుడు భక్తుల మనోమాలిన్యం దూరం చేసి, వారిని నిర్మలచిత్తులను చేస్తాడు. ఈ రీతిగా తత్త్వజ్ఞులు వినాయకుని రూపాన్ని ఆధ్యాత్మికంగా సమన్వయం చేసి చెబుతారు వేదవ్యాసుడు లక్షశ్లోకాలు గల మహాభారతాన్ని రచించే సమయంలో వినాయకుణ్ణి వ్రాయసకాడుగా వినియోగించు కొన్నాడు. అప్పుడు భారతాన్ని వ్రాయడానికి లేఖినిగా తన రెండు దంతాలలో ఒక దంతాన్ని ఊడబెరికి ఉపయోగించాడనీ, అందువల్ల వినాయకుడు 'ఏకదంతుడ' య్యాడనీ అంటారు.*
*ఇలా విఘ్నేశ్వరుని విషయంలో అనేక విశేషాలు ప్రాచీన సారస్వతం నుండి తెలుస్తున్నాయి.*
*గణేశోత్సవాలలో వివిధరూపాలతో తయారు చేసిన విగ్రహాలను పూజించి చివరిదినాన ఊరేగిస్తారు. ఆపై ఆ విగ్రహాలను జలాశయాలలో కలిపివేస్తారు. మన శరీరాలు చివరికి పంచభూతాలలో కలిసిపోయేవే అన్న సత్యాన్ని చాటే ప్రక్రియ ఇది. అయితే హానికారకమైన రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలను జలాశయాలలో కలపడం భావ్యం కాదు. ఈ విషయంలో అటు ప్రభుత్వమూ, ఇటు ప్రజలూ జాగరూకత వహించాలి.*
*తుండము నేకదంతమును, తోరపుబొజ్జయు వామహస్తమున్ 'ఇత్యాదిగా గణపతి ఆకారం చూసే వారికి హాస్యం కలిగించే ధోరణిలో ఉంటుంది. దీనికి తోడు ఈ దినాలలో ఆ దేవుణ్ణి నానావిధాల హాస్యాస్పదమైన రీతిలో విగ్రహాలుగా రూపొందించడం, చిత్రించడం చూస్తున్నాం.*
*ప్రాచీన సారస్వతంలో కూడా గణపతి ప్రస్తావన వచ్చినప్పుడు హాస్యస్ఫోరకంగా కవులు గణేశుని వర్ణించారు. ఉదాహరణకు మనుచరిత్రలోని 'అంకము జేరి శైల తనయా స్తన దుగ్ధములానువేళ...' అన్న గణనాయిక ప్రార్ధనలో వినాయకునికి కలిగిన భ్రాంతి వర్ణన పాఠకులలో హాస్యం కలిగేరీతిగా* *ఉంది. కానీ ఈ కాలంలో మరీ ఎబ్బెట్టుగా గణపతి రూపాన్ని చిత్రిస్తున్నారు. గణపతి దైవమైనప్పుడు అందుకు తగినట్లు ఆయనను రూపొందించడం సముచితమని గుర్తించాలి.*
*శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।*
*ప్రసన్న వదనం ధ్యాయే త్సర్వ విఘ్నోపశాంతయే॥*
*అన్న శ్లోకం గణపతి ప్రార్థనగా సుప్రసిద్ధం. ఆబాల గోపాలానికి ఈ శ్లోకం పరిచితమే.*
*ఇందులో చెప్పినట్లు మనం ఆచరించే సత్కార్యాలలో సకల విఘ్నాలూ తొలగిపోవడానికి ఆ గణపతిని ధ్యానించి కృతార్థులమవుదాం. ఆధ్యాత్మిక సామాజిక అభివృద్ధికరమైన కార్యాలలో విజయం సాధిద్దాం.*
*చేసుకొందాం. గణేశోత్సవాలలో ప్రార్థనలతో పాటు దీనజనులపై కనికరం కలిగి దానధర్మాలు కూడా ఆచరించి మన జన్మల్ని సార్ధకం చేసుకుందాం.*
*┈┉┅━❀꧁గణణాత꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🍁🌺🍁 🙏🕉️🙏 🍁🌺🍁
No comments:
Post a Comment