. *🫐18వ సర్గ 1వ భాగం🫐*
*కైకేయి తను కోరిన వరాలను గూర్చి*
*రాముడితో చెప్పడం*
*꧁❀❀━❀🌻🌏🌻❀━❀❀꧂*
*రాముడు మందిరంలోనికి ఒంటరిగా ప్రవేశించాడు. అక్కడ ముఖాన కళాకాంతులు లేకుండా, వాడిపోయిన ముఖంతో పక్కపై పడుకొని ఉన్న దశరథుణ్ణి చూశాడు. వెంటనే ఆయన పాదాలకు నమస్కరించాడు. పిదప కైకేయి పాదాలకు నమస్కరించాడు. దశరథుడు 'రామా” అని మాత్రం అన్నాడు. ఆపై గొంతు పెగల్లేదు. కళ్లు నీటితో నిండిపోయి, బొటబొటా నీరు కారసాగింది. తండ్రిని ఇదివరకెప్పుడూ అంత దీనంగా చూడలేదు. తండ్రి పరిస్థితికి రాముడు కూడా కలత చెందాడు.*
*రాముడు: అమ్మా! తండ్రిగారు సంతోషం లేనివారై కృశించిపోయి ఉన్నారు. గ్రహణం పట్టిన సూర్యునిలా, అబద్ధమాడిన మహర్షిలా కాంతిహీనుడై ఉన్నాడు. తండ్రిగారు ఏదో ఊహించటానికి వీలుకానంత దుఃఖంలో ఉన్నారు. పూర్ణిమ నాటి సముద్రునిలా అమిత అశాంతితో ఉన్నారు.*
*అమ్మా! తండ్రిగారు* *నన్ను చూడటంతోనే సంతోషంగా పలకరించేవారు. అంతకుపూర్వం కోపంగా ఉన్నా నన్ను చూడగానే కోపం అంతా పోయి ప్రశాంతంగా మారిపోయేవారు.*
*అమ్మా! అజ్ఞానంచేత నేను ఏమైనా తండ్రిగారి మనస్సు కష్టపెట్టానా? ఎప్పుడూ నేనంటే ప్రేమగా ఉండే వారు ఈనాడు ఒక్కమాటైనా నోటి వెంట రావడంలేదు. పైగా ముఖమంతా వాడిపోయి ఉంది. శరీరానికిగాని, మనస్సుకుగాని ఏదైనా తీవ్రంగా గాయం అయిందా?*
*అమ్మా! భరత శత్రుఘ్నులు క్షేమంగా ఉన్నారు గదా? నా తల్లులంతా క్షేమంగా ఉన్నారు గదా? నా తండ్రిగారికి నా వల్ల ఏదైనా కోపం కలిగితే, ఆయనను సంతోషపెట్టకుండా, ఆయన ఆజ్ఞలను పాలించకుండా ఒక్క క్షణంకూడా జీవించి ఉండను. తండ్రి అంటే మనిషికి ఇహలోకంలో జన్మ నిచ్చినవాడు కదా! ఆయనను సంతోషపెట్టకుండా ఎట్లా ఉండగలను?*
*అమ్మా! నువ్వు గాని, తండ్రిగారికి కోపం తెప్పించే మాట ఏమైనా అన్నావా? ముందెన్నడూ నా తండ్రిని ఇటువంటి దీనస్థితిలో చూడలేదు. నీవైనా నాకు యథార్థం చెప్పు.*
*కైకేయి: రామా నీ తండ్రికి ఎవరి మీదా కోపం లేదు. ఎటువంటి కష్టమూ కలుగలేదు. అయితే ఆయన నీతో ఒక మాట చెప్పటానికి భయపడుతున్నాడు. నువ్వు ఆయనకు ఎంతో ప్రియమైన వాడివి. అటువంటి ప్రేమపాత్రుడవైన నీతో అప్రియమైన ఒక మాట చెప్పటానికే తటపటాయిస్తున్నారు. ఆ మాట చెప్పటానికి ఆయనకు నోరు పెగలడం లేదు. అది నువ్వు తప్పక తెలుసుకోవాలి.*
{ఇంకా ఉంది}
*┈┉┅━❀꧁జై శ్రీరామ్꧂❀━┅┉┈*
*ఆధ్యాత్మిక అన్వేషకులు*
🐿️🏹🐿️ 🙏🕉️🙏 🐿️🏹🐿️
No comments:
Post a Comment