ఘజిని మహ్మద్ భారతదేశంపై 17 సార్లు దండెత్తాడు.. దొంగతనం చేసి డబ్బులు అయిపోయాక మళ్ళీ డ్యూటీ ఎక్కి దొంగతనం చేసే దొంగలా, తన రాజ్యంలో డబ్బులు అయిపోయినప్పుడల్లా అతనికి భారత దేశం అక్షయ పాత్రలా కనిపించేది.. నిల్వలు లేనట్లు అనిపించిన వెంటనే సైన్యంతో బయల్దేరి భారత్ లో ఏదొక ప్రాంతాన్ని కొల్లగొట్టి ఇక్కడి ధనరాసులను, వెండి, బంగారాలను తన దేశానికి తరలించేవాడు.. ఈ విధంగా క్రీ.శ. 1000 నుండి 1027 మధ్య కాలంలో భారతదేశంపై 17 సార్లు దండెత్తాడు.. కానీ ఘజిని మహ్మద్ చేసిన దండయాత్రలన్నింటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ్ ఆలయంపై చేసిన దండయాత్ర అత్యంత క్రూరమైనదిగా చరిత్రలో నిలిచిపోయింది.. ఎంతో ధనరాసులతో తులతూగే సోమనాథ్ ఆలయం కాస్త ఘజిని మహ్మద్ వల్ల వెలవెలపోయింది..
సోమనాథ్ ఆలయంలో గాలిలో తేలే శివలింగం ఉండేది.. శివుడి మహిమ వల్ల ఆ శివలింగం తేలియాడేదని భక్తులు, పూజారులు నమ్మేవాళ్ళు.. శివుడి శక్తి ఆలయంపై ఉండటం వల్ల ఆలయ రక్షణ మొత్తం శివుడే చూసుకుంటాడన్న నమ్మకం ఉండేది.. అప్పట్లో అత్యంత ధనిక ఆలయంగా పేరున్న సోమనాథ్ పై ఘజిని మహ్మద్ కన్ను పడటంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి..
సోమనాథ్ ఆలయంలో అడుగుపెట్టిన ఘజిని మహ్మద్ గాల్లో తేలే శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయాడు.. లింగం ఎలాంటి తాళ్ళూ, స్తంభాల ఆధారం లేకుండానే గాల్లో తేలుతుందని నిర్ధారించుకున్నాడు... ఇలా తేలియాడటం వెనుక దైవ శక్తి లేదని బలంగా నమ్మిన ఘజిని, ఆ రహస్యాన్ని చేధించాలనుకున్నాడు.. గాల్లో తేలే శివలింగానికి, చుట్టుపక్కల ఉన్న గోడలను, ఆలయ పైకప్పును నిశితంగా పరిశీలించాడు.. తన సైన్యానికి ఆలయ పైకప్పులో ఉన్న రాళ్లను తొలగించమని ఆజ్ఞ ఇచ్చాడు.. దాంతో సైనికులు ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు..
ఘజినీ మహ్మద్ సోమనాథ్ ఆలయంలోకి చొరబడ్డాడనే వార్త చుట్టుపక్కల గ్రామాల్లోకి వేగంగా పాకింది.. వెంటనే చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు, భక్తులు ఆలయాన్ని కాపాడుకునేందుకు త్వరితగతిన తరలివచ్చారు.. వాళ్ళు వచ్చే సమయానికి ఆలయ పైకప్పులో రాళ్లు తీసివేయడం వల్ల శివలింగం కాస్త పక్కకి ఒరిగి, కింద పడిపోయింది.. ఆ పరిణామం చూసిన భక్తులు మానసికంగా కృంగిపోయి బిక్కచచ్చిపోయారు.. గాల్లో శివలింగం తేలడం వెనుక శివుడి శక్తి లేదని, కేవలం శిల్పకళా నైపుణ్యం మాత్రమే ఉందని ప్రపంచానికి తెలిసిన రోజది.. ఆలయ నిర్మాణంలో నాటి వాస్తు కళ నిపుణులు సహజ అయస్కాంత శిలలను వాడారు.. పై కప్పులో, గోడల్లో, భూమిలో నాలుగువైపులా అయస్కాంత ఆకర్షణ సమానంగా ఉండేలా ఆలయ నిర్మాణం సాగించారు.. శివలింగాన్ని ఇనుము వంటి పదార్ధంతో చేయడంతో, అయస్కాంత శిలల ప్రభావంతో ఎలాంటి ఆధారం లేకుండా శివలింగం గాల్లో తేలింది.. అయస్కాంత శక్తిని ఒకేలా నాలుగువైపులా సమానంగా ప్రసరింపచేసే నిర్మాణం చేపట్టడం దాదాపు అసాధ్యం.. కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన భారతీయ వాస్తు నిపుణుల ఇంజనీరింగ్ సామర్ధ్యాన్ని మెచ్చుకుని తీరాలి..
శివలింగం కింద పడటంతో మానసికంగా దెబ్బతిన్న భక్తులు, పూజారులను ఘజిని సైన్యం ఊచకోత కోసింది.. అప్పుడు మొదలైన నరమేధం మూడు రోజుల పాటు కొనసాగింది.. ఈ మూడు రోజుల్లో సుమారు 50000 మందిని వధించి ఆలయాన్ని పూర్తిగా దోచుకున్న ఘజిని, ఆలయంలోని శివలింగాన్ని ముక్కలు చేసాడు.. దానితో పాటు దేవత మూర్తుల విగ్రహాలను కూడా పగలగొట్టి ఆ ముక్కలను తనతో పాటు తీసుకెళ్లాడు.. అప్పట్లోనే సుమారు2 కోట్లు దిన్హార్ల విలువైన సంపదను దోచుకున్నాడు.. ఇప్పటి విలువతో లెక్కిస్తే వేలాది కోట్ల రూపాయల సంపద అది.. అంతేకాకుండా ధ్వంసం చేసి తనతో పాటు తరలించిన శివలింగం, దేవతా మూర్తుల విగ్రహ అవశేషాలను, ఘజిని నగరంలో నిర్మించిన మసీదు మెట్ల నిర్మాణంలో ఉపయోగించాడు.. ఆ విధంగా అత్యంత ధనిక ఆలయం ధ్వంసమైంది..
అత్యంత ధనిక ఆలయంగా పేరొందిన సోమనాథ్ ఆలయంపై దాడులు జరగడం కొత్త విషయం కాదు.. క్రీ.శ. 725లో జునాయద్ ఇబ్న్ అబ్దుల్ రెహమాన్ తొలిసారిగా సోమనాథ్ ఆలయంపై దాడి చేశాడు.. తరువాత ఘజిని మహ్మద్, అల్లా ఉద్దీన్ ఖిల్జీ, ముజఫర్ షా1, మహమూద్ బేగడ చేతుల్లో ధ్వంసమైంది.. చిట్టచివరిగా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1706లో ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేయించాడు.
నేడు మనం చూస్తున్న ఆలయం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ సంకల్పం వల్ల తిరిగి ప్రాణం పోసుకుంది.. జునాగఢ్ విముక్తి తర్వాత సోమనాథ్ శిథిలాలను సందర్శించిన పటేల్, అక్కడి సముద్రపు నీటిని చేతిలోకి తీసుకుని, "సోమనాథ్ ఆలయాన్ని మళ్లీ వైభవంగా నిర్మిస్తామని" ప్రతిజ్ఞ చేశారు.. మహాత్మా గాంధీ సూచన మేరకు, ఈ ఆలయ నిర్మాణానికి ప్రభుత్వ నిధులు వాడకుండా, కేవలం ప్రజల నుండి సేకరించిన విరాళాల ద్వారా నిర్మాణం జరిగింది.. పటేల్ మరణానంతరం కె.ఎమ్. మున్షీ ఈ ప్రాజెక్టును ముందుకు నడిపించారు. భారతదేశపు తొలి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా 11 మే 1951న నూతన ఆలయంలో జ్యోతిర్లింగ ప్రతిష్ఠాపన జరిగింది... ఎన్నిసార్లు విదేశీ దండయాత్రలకు గురై, ముక్కలు ముక్కలుగా ధ్వంసమైనా... ప్రతిసారీ ఫీనిక్స్ పక్షిలా తిరిగి ప్రాణం పోసుకున్న ఈ ఆలయం "శాశ్వతమైన ఆలయం" గా పేరు పొందింది..
No comments:
Post a Comment