Friday, July 3, 2026

 _[విశ్వనాథ్ పటేల్ గారి పుస్తకం పేరు: "జీవితం జీవితానికే"]_ 
_ఈరోజు అంశం పేరుకూడా:_
*_“జీవితం జీవించడానికే...”_*
😊😄😊😄😊😃😊 

*మనం ఈ ప్రపంచంలో ఆనందంతోనే జన్మించాం. ఒక పసిబిడ్డను మీరు చూడండి... ఆ బిడ్డను మీరు చూస్తూనే మీకు మొదట అందే సంకేతం చిరునవ్వు, ఒక మనిషిని పలకరించండి. మాట కన్నా ముందు పెదాలపై చిరునవ్వు కదులుతుంది. దీనివల్ల ఏమి తెలుస్తోంది? మన అంతస్సారం ఆనందమే..! నవ్వే లేని మనిషి అసలైన దురదృష్టవంతుడు.*

 *ఆచారాలు, నమ్మకాలు, బాధ్యతలు, బరువులు అతని నవ్వును అణిచిపెడుతూ ఉంటాయి. ఆ కారణంగా అతను నవ్వలేడు.*

*జీవితాన్ని దానంతట దాన్ని ఎదగనిస్తే ప్రతి మనిషి ఒక పాటలా ఎదుగుతాడు. పువ్వులా వికసిస్తాడు. ఒక నాట్యంలా ఆకర్షిస్తాడు. పువ్వుకు ఆదర్శముంటుందా? పువ్వు దానంతట అదే ఆదర్శం. మనిషి తనకు తానే ఆదర్శం. ఎవరో కోరితే పువ్వు వికసించదు. ఎవరో అభ్యర్థిస్తే అది పరిమళాన్ని నలుదిశలా వెదజల్లదు. దాని సహజలక్షణమది. మనిషి ఎదుగుదల కూడా అలాగే జరుగుతుంది. జరగాలి.* 

*కానీ మనిషిని మతాలు, ఆదర్శాలు, సంప్రదాయాలు, అనుబంధాలు ఎక్కడికక్కడ అణగదొక్కుతాయి. తమకు ఇష్టంగా మనిషిని మలచుకుంటాయి. మనిషిని, సహజంగా ఎదగనియ్యవు.*

*మనిషి ఏ ప్రత్యేకతనీ సాధించాల్సిన పనిలేదు. మనిషి పుట్టుకే ఒక ప్రత్యేకత. జీవితానికి అది చాలు. జీవితానికి అదనంగా ఏమీ అంటగట్టాల్సిన పనిలేదు.* 

*ప్రతి మనిషీ పుట్టుకతోనే రాజులాంటివాడే. అందుకే ప్రతి మనిషీ ఆనందంగా జీవించడాన్ని వాయిదా వెయ్యాల్సిన పనిలేదు. _'రేపటి నించీ హాయిగా జీవిస్తాను'_ అన్న వాడు ఎప్పటికీ... ఎప్పటికీ... హాయిగా ఉండలేడు.*

*మహా తాత్వికుడు 'బెర్ట్రాండ్ రస్సెల్' తన అనుభవాన్ని గురించి ఒక చోట చాలా చక్కగా రాశాడు. రస్సెల్ ఒక సత్యాన్వేషి, నిర్భయస్తుడు. తన అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా చెప్పేవాడు. నిర్బంధ సైనికుడిగా చేరడాన్ని వ్యతిరేకించి, మొదటి ప్రపంచయుద్ధంలో జైలుకు కూడా వెళ్లాడు. జీవితాంతం శాంతికోసం పోరాటాలు చేశాడు. ప్రభుత్వాల్ని వ్యతిరేకించాడు. గొప్ప నాగరికతకు చెందిన ఇంగ్లాండ్లో ఆయన పుట్టాడు. మనిషి స్వేచ్ఛకోసం, సహజత్వం కోసం, స్వాతంత్య్రం కోసం తపించాడు. ఆయన ఒకచోట ఆదిమవాసులతో తన అనుభవం గురించి ఇలా రాశాడు.*

 *_"నాగరికతకు దూరంగా, సాంకేతికతకు అందని కొండకోనల్లో, అడవుల్లో జీవించే ఒక ఆదిమవాసుల జీవితాన్ని ఆయన పరిశీలించాడు. వాళ్ళు జీవించే విధానాన్ని చూసి ఆయనకు అసూయ కలిగింది. ఈర్ష్య కలిగింది. వాళ్ళకు కార్లు లేవు. బిల్డింగులు లేవు. బ్యాంకులు లేవు. బేలెన్స్లులేవు. కానీ వాళ్లు ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా జీవించడం చూశాడు. వాళ్లు మనోహరంగా నాట్యం చేసేవాళ్లు. వాళ్లకు ఖరీదయిన వస్త్రాలు లేవు. కానీ వాళ్లకు దాని గురించి పట్టింపు లేదు. వాళ్లకు కిరీటాలు లేవు. ఆకులతో, పూలతో కిరీటాల్ని చేసి అలంకరించుకున్నారు. వాళ్లు పరవశంగా, ఆనందంగా ఉన్నారు. వాళ్ళల్లో ఉన్న ప్రతి స్త్రీ రాణిలా ఉంది. ప్రతి పురుషుడూ రాజులా ఉన్నాడు. వాళ్ల దగ్గర వజ్రాలు లేవు. పూలే వాళ్ల దగ్గర ఉన్న వజ్రాలు. వాళ్ళల్లో తమకి ఇంకా కావాలన్న ఆశ ఎక్కడా లేదు. తమకు ఏదో తక్కువయిందన్న దిగులు ఎక్కడా కనిపించదు. వాళ్లు ఎంతగా నాట్యం చేశారంటే గంటల తరబడి నాట్యం చేసి అలసిసొలసి అక్కడే మైదానం మీద పడుకుని గాఢంగా నిద్రపోయారు. మళ్లీ తెల్లవారి లేచి పనులకు వెళ్లిపోయారు. చీకూ చింతా లేని వాళ్లని చూసి నేను ఈర్ష్య పడ్డాను”_ అన్నాడు.*

*రస్సెల్ చెప్పిన ఆ ఆదిమతెగ జనాలకు మనకు ఉన్న తేడా చూడండి. మనం ఎంత ఆరాటంతో జీవిస్తామో? వాళ్లెంత ఆనందంగా జీవిస్తారో తెలిసి మనకు కూడా ఈర్ష్య కలుగుతుంది.*

 *_“మనిషి వ్యవసాయం కనిపెట్టిన నాటినుంచే జీవితంలో ఆనందాన్ని, స్వేచ్ఛను కోల్పోయాడు”_ అంటాడు రస్సెల్. స్వేచ్చగా అడవిలో వేటాడి జీవించే రోజుల్లోనే మనిషి ఆనందంగా ఉండేవాడంటాడు.* 

*మనిషి సహజంగా ఉంటే స్వేచ్చగా ఉంటే, స్వాతంత్య్రంతో ఉంటే ఆనందంగా ఉండగలడు. అని మనం అంటే... _“మనిషికి స్వేచ్ఛ, అలవిమీరిన స్వాతంత్ర్యం ఇస్తే ప్రపంచం అరాచకమవుతుంది"_ అంటారు చాలామంది. అది పొరపాటు. మనిషి నిజమైన స్వాతంత్య్రం అతను చైతన్యంగా, స్పృహతో ఉండడంలో ఉంది. నిత్య చైతన్యంతో నిగనిగలాడే మనిషి ఎవరికీ అపకారం చెయ్యడు. ఆనందంగా ఉంటాడు.*
——————————
*_--{జీవితం ఎలా జీవించాలో సింపుల్ గా, చక్కగా వివరించిన తీరు నాకు నచ్చింది..: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు & స్టూడెంట్ మోటివేటర్, ఆత్మకూరు పట్టణం, నెల్లూరు జిల్లా}--_* 
🪷🪷🪷🪷🪷🪷🪷

No comments:

Post a Comment