నారద మహర్షిని తెలుగు సినిమాల్లో హాస్యం పుట్టించే పాత్రగా రూపొందించారు? కలహ భోజనుడని వ్యవహరిస్తారు? నిజానికి పురాణాల్లో ఆయన పాత్ర ఎలా వ్యవహరిస్తుంది?
" నారం దదాతి ఇతి నారదః " - నారం అంటే జ్ఞానం. నారదులు జ్ఞానస్వరూపులు. ఆయనను తలచుకుంటే చాలు అజ్ఞానం/మాయ నశిస్తుంది.
నారదులవారు దేవర్షి. ఋషివ్యవస్థ అంటే ఈశ్వరసంకల్పాన్ని భూమిమీద ప్రవర్తింపచేసే వ్యవస్థ. ఋషుల్లో దేవర్షులు, బ్రహ్మర్షులు, రాజర్షులు ఉంటారు.
ఈయన పార్వతీదేవికి గురువు. పరమేశ్వరుడిని వివాహం చేసుకునే కోరికతో గురువుగా నారదులను ఆశ్రయించారు అమ్మవారు.
పరమాత్మ " దేవర్షులలో నారదుడను నేను " అన్నారు గీతలో.
వేటగాడు రత్నాకరుడిని వాల్మీకిగా మార్చి పరమపవిత్రమయిన రామాయణాన్ని లోకానికి అందించారు.
ఈయన సనకసనందనాదులతో చేసిన సంవాదమే " నారదపురాణం " గా ప్రసిద్ధిచెందింది. దీనిలోనిదే సంకటహరణ గణపతి స్తోత్రం.
ధృవుడికి " ఓం నమోభగవతే వాసుదేవాయ " మహా మంత్రాన్ని అందించారు. ప్రహ్లాదుడికి " ఓం నమోనారాయణాయ " మహామంత్రాన్ని ఉపదేశించారు. ఆ నామజపాలతోనే వారు చిరస్మరణీయులు అయారు.
ఆయన " మహతి " అనే వీణని ధరించిన సంగీతవిద్వాంసుడు. త్యాగయ్యగారు శ్రీరామజపపారాయణం చేస్తే నారదులవారు ప్రత్యక్షమయారు. అప్పుడే ఆయన:
" శ్రీనారదముని గురురాయ కంటి, ఏనాటి తపమో గురురాయ............." కీర్తన చేసారు.
1000 ఏళ్ళు పైగా పరాయిపాలనలో ఉండడంవల్ల మన సంస్కృతిని భ్రష్టుపట్టించేసారు కుహనా మేధావులు అందరూ కలిసి. పురాణపురుషుల్ని వ్యంగ్యంగా చూపించడం వల్ల సినీమాలు బాగా ఆడుతాయని ఫిక్స్ అయిపోయారు.
వీటిలో ఒకటి సనాతనధర్మానికి పునాదిరాయివంటి నారదులవారిని తగవులు పెట్టేవానిగానూ, హాస్యపాత్రగానూ చూపెట్టడం.
నారదులు ఇప్పుడూ ఎప్పుడూ ఉంటారు. జ్ఞానులు మాత్రమే ఆయన్ని దర్శించగలరు.
మన సనాతనధర్మం విశిష్టతను సమాజానికి తెలియచేస్తూ మన పురాణపురుషులను, సనాతనధర్మాన్ని పరిరక్షించేవారిని మనం గౌరవించుకుందాం.
శుభమస్తు
No comments:
Post a Comment