*🌺 దైవభక్తి అంటే ఏమిటి? 🌺*
దైవభక్తి ఉన్నచోట మంచితనం ఉంటుందంటారు. మరి నేడు చాలా మోసాలు జరుగుతున్నాయి ఎందుకు? దైవభక్తులమని చెప్పుకొనేవారూ పాపాలు చేస్తున్నారు. భక్తి ఉంటే పాపాలు చేసినా ఫరవాలేదా?
దేవుడికి పూజలు చేసే వారంతా దైవభక్తులైపోరు. నిజంగా దేవుడి మీద ప్రేమ ఉన్నవారే దైవభక్తులు. భక్తి ఉన్నవాడు పాపం చేయడు, చేయలేడు. ఎందుకంటే దైవం ధర్మప్రియుడు. ధర్మాన్ని విడిచిపెడితే అది భక్తి అనిపించుకోదు. భక్తికి ధర్మమే ప్రాణం.
గుళ్లు, గోపురాలు తిరిగేవారు, దేవుడికి పూజలు చేసేవారు అందరూ భక్తులేనని చెప్పలేం. తమ కోరికలను తీర్చుకోవడానికి ఎవరికి వీలైన మార్గాన్ని వారు ఆశ్రయిస్తారు. అలా కొందరు దేవుడిని కూడా కొలుస్తారు. వారికి దేవుడి పట్ల నిజమైన శ్రద్ధ ఉండదు. అలాంటి వారందరినీ "భక్తులు" అనే వర్గంలో చేర్చకూడదు.
అలాగే ప్రజల్లో తమ కోరికల కోసం దేవుడి పట్ల చూపించే ఆసక్తిని అవకాశంగా మార్చుకొని సొమ్ము చేసుకునే వ్యాపారులు కూడా ఉంటారు. వారినే భక్తులుగా భావించడం పొరపాటు.
పాపం ఉన్నచోట భక్తి పండదు. దైవశక్తి జాగృతం కాదు. దేవాలయాల దగ్గర చేరే గుంపులందరికీ దైవతత్త్వం పట్ల నిజమైన ఆసక్తి ఉండదు.
భక్తుడు భగవంతుని నామ, గుణ, మహిమల పట్ల ప్రేమ కలిగి, నిరంతరం ఆ చింతనలోనే కాలం గడుపుతూ, సత్యం, అహింస, శుచి, దయ వంటి సద్గుణాలను అలవరచుకుంటాడు.
నిజంగా భగవంతుని అనుగ్రహం ధర్మపరునికే లభిస్తుంది. ధర్మం, ప్రేమ ఈ రెండూ కలిసినప్పుడే అది భక్తి అవుతుంది.
'మంది' చేరే చోట సొమ్ము చేరుతుంది. ఆ సొమ్మును స్వాహా చేయడానికి అక్రమార్జనపరులు కూడా చేరతారు. అదే విధంగా దేవుడి సొమ్మును స్వాహా చేసే మహాపాపాత్ములు కూడా ఉంటారు.
అలాంటి కొంతమంది దేవాలయాల్లో ఉన్నంత మాత్రాన వారు భక్తులైపోరు. వారి పాపాలు కూడా పరిహరింపబడవు. పైగా, బయట చేసే మోసాలకన్నా దైవసంబంధమైన సంపదను దుర్వినియోగం చేయడం మరింత ఘోరమైన పాతకంగా శాస్త్రాలు పేర్కొంటాయి. అందువల్ల వారు, వారి తరువాతి తరాలు కూడా తమ కర్మఫలాలను అనుభవించక తప్పదు.
తాత్కాలికంగా వారు లాభపడినట్లు కనిపించినా, భవిష్యత్తులో వారు తీవ్రమైన బాధలను అనుభవిస్తారనే విషయంలో సందేహం లేదు.
అటువంటి వారిని చూసి "ఇదే భక్తి", "ఇదే ఆధ్యాత్మికత" అని పొరపడకండి. పాపం ఉన్నచోట పరమాత్మ ఉండడు. ధర్మం ఉన్నచోటే దైవానుగ్రహం ఉంటుంది. 🙏🌺
📿శుభమస్తు📿
*హిందూ ధర్మచక్రం సూక్తి*
!!శ్లో!!
*దరిద్రాయ కృతం దానం*
*శూన్యలింగస్య పూజనం!*
*అనాథప్రేత సంస్కారం*
*అశ్వమేధసమం విదుః!!*
అర్థం,,,ఈ శ్లోకం సమాజంలో అత్యంత పుణ్యప్రదమైన మూడు పనుల గురించి వివరిస్తుంది.
*దరిద్రాయ కృతం దానం*
పేదవారికి లేదా అత్యంత
నిరుపేదలకు చేసే దానం.
*శూన్యలింగస్య పూజనం*
ఎవరూ పూజించని, నిర్జన ప్రదేశంలో లేదా అడవులలో ఉన్న శివలింగానికి (లేదా పూజకు నోచుకోని దైవానికి) పూజ చేయడం.
*అనాథప్రేత సంస్కారం*
దిక్కులేని, అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు (క్రియలు) నిర్వహించడం..
ఈ మూడు పనులను ఎవరైతే భక్తితో, నిస్వార్థంగా చేస్తారో, వారికి అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది.
*స్వగృహే పూర్ణ ఆచార పరగేహా తదర్ధక.. తదర్థం చే పరగ్రామే..*
అనగా నిత్య నియమ వ్రత పూజాదికాలను నియమబద్ధంగా చేయాలి. అయితే ఒక్కోసారి ఏవో ఒక మానవజీవన సంబంధిత విషయాలు అడ్డువస్తాయి. అప్పుడు పూజలు, మొక్కులు ప్రదక్షిణలు చెయ్యాల్సిన విధుల గూర్చి పరాశర స్మృతి ఇలా చెబుతోంది...
*తమ గృహంలో అయితే సంపూర్ణంగా చేయాలి. అయిన వారింటికి వెళ్ళినప్పుడు సగం చేసినా చాలు. దూరప్రాంతాలకి వెళ్ళవల్సివస్తే అర్థభాగం చేసినా చాలు. ఇక పుణ్యతీర్థక్షేత దర్శనాలప్పుడు సదాచార నియమాలని పాటించకున్నా దోషం లేదు.
*పూజాఫలం*
*మనం చాలా మంది దగ్గర వింటుంటాం నేను ఎన్నో పూజలు చేశాను ఎంతో సాధన చేశాను ఏమీ ఫలితం లేదు అని బాధపడుతుంటారు అలా ఎప్పుడు ఎవరు బాధపడొద్దు.*
*మనం చేసే పూజలు చేసే సాధన అంత వరకు ఎందుకు అసలు ఒకటి చెప్పనా మనం మనస్ఫూర్తిగా పెట్టే నమస్కారం కూడా చివరకు వట్టిగాపోదు ఏదో ఒక రోజు కచ్చితంగా మనకు మంచి చేస్తుంది.*
*మనం ఇప్పుడు పడే బాధలు కష్టాలు కన్నీళ్లు అన్ని గత జన్మలో మనం తెలిసీ తెలీక చేసిన పాప కర్మల ఫలితాలు. ఇప్పుడు మనం చేస్తున్న ఈ పూజలు సాధన ఇవన్నీ కూడా వాటిని తట్టుకునే శక్తిని ఇస్తాయి. కాకపోతే మనం తెలుసుకోలేం ఏ రకంగా మనలను అవి కాపాడాయో ఎలా ఉపశమనం కలిగించాయి అని. అది మనం నమ్మకంతో ఆలోచిస్తే తెలుస్తుంది*.
*ఎన్ని ధార్మిక ప్రయత్నాలు చేసినా, కొన్ని ఫలితాలు వెంటనే కనిపించకపోవచ్చు. అప్పుడు ప్రయత్నం కంటే ప్రారబ్ధం బలీయంగా ఉందని తెలుసుకోవాలి..*.
*చిత్తం శుద్ధి అయితేనే పరిపూర్ణత. మనలోని అంతఃకరణ చైతన్యమే చిత్తం. ఏ కర్మచేత మనం పవిత్రమవుతామో ఆ కర్మను 'పుణ్యం' అంటారు. దోషాచరణ పాపం.*
*దుఃఖాలు తటస్థించినప్పుడు వాటి పరిష్కారానికై పలు ప్రయత్నాలు చేస్తాం. కొన్ని భౌతికమైనవి- ఇంకొన్ని ధార్మికమైనవి. ధార్మిక ప్రయత్నాలు జపతపాలు పూజలు దానాలు మొదలైనవి. ఇవి చేయడంవల్ల నిజంగా ఫలితం ఉంటుందా అని కొందరికి సందేహం కలగడం సహజం. రోగాలకు వైద్యపరమైన చికిత్సలు చేసినప్పుడు- అవే చికిత్సలకు కొందరు బాగుపడుతున్నారు, కొందరికి వైఫల్యం ఎదురవుతోంది. అయినా మనం ఆ చికిత్సను 'మూఢ విశ్వాసం' అనలేం కదా! అలాగే ఎన్ని ధార్మిక ప్రయత్నాలు చేసినా ఒకోసారి ఫలితాలు వెంటనే కనిపించక పోవచ్చు.*
*ఇక్కడ మరో ధర్మసూక్ష్మం కూడా ఉంది. దైవీయమైన జపతపాది ధార్మిక ప్రయత్నాలు ఎప్పటికీ వృథాకావు. అవి ఈ జీవితంలోనే కాలాంతరంలో ఏనాటికైనా ఫలించే అవకాశముంది.*
*ఈ విషయమై మన శాస్త్రాలు చక్కని వివరణలనిచ్చాయి. విత్తనం, వేరు (మూలం) కనబడకపోయినా వృక్షం, ఫలం కనిపిస్తాయి. అలాగే కారణమైన కర్మలు గోచరించకున్నా, వాటి ఫలాలు అనుభవాలుగా వస్తాయి. ఈ 'కర్మ-ఫల' సంధానకర్త ఈశ్వరుడు.*
*ఈ జన్మకు ఆధారమైన ప్రారబ్ధకర్మలలో ప్రతి కర్మకు- 1. బీజాంశ, 2. వృద్ధ్యంశ, 3. భోగాంశ... అని మూడు భాగాలుంటాయి.*
*జపతపాది సాధనాల ద్వారా 'వృద్ధ్యంశ'ను నివారించవచ్చు. అంటే- దుఃఖాది అనుభవాల తీవ్రతను పెరగకుండా చేయవచ్చు. తప్పించుకోలేనిది 'భోగాంశ'. ఇది అనుభవంతోనే క్షయమవుతుంది. కానీ దేవతారాధనచేత, తపోదానాదుల చేత సాధకుడికి ఈ అనుభవాన్ని తట్టుకోగలిగే శక్తి కలగడమేకాక, కాలపరిణామ క్రమంలో ఆ అనుభవం విజ్ఞాన హేతువవుతుంది. వ్యక్తిత్వ వికాసానికి కారణమవుతుంది. ఇక మిగిలినది 'బీజాంశ'. ధార్మిక సాధనవలన, ఆత్మవిచారణవలన చిత్తశుద్ధి, జ్ఞాన వైరాగ్యాలు కలిగి- ఈ బీజాంశ నశిస్తుంది. అప్పుడతడు పూర్తిగా కర్మమాలిన్యం నుండి బయటపడతాడు. కనుక పాపనాశనం కోసం ఈ ధార్మిక సాధనలను అవశ్యం అవలంబించాలి.*
*పాపమనేది మనస్సుతో, మాటతో, శరీరంతో, ధనంతో (సంపాదించిన సామగ్రితో) చేస్తాం. జప, స్తోత్రాదుల చేత వాచిక(మాట) పాపం పోతుంది. అసలు గట్టి పాపం మానసికం. అది ధ్యానంవలన నశిస్తుంది. పూజ, క్షేత్ర తీర్థయాత్ర, శౌచం- శారీరక పాపాలను తొలగిస్తాయి. దానం ద్వారా- సంపాదనగత పాపాలు నశిస్తాయి. అందుకే త్రికరణాలతో, ధనాలతో సత్కర్మలను ఆచరించాలి*.
*మనం చేసే పూజలు సాధన ఏ రకంగా ఉపయోగపడతాయి అనేది. కాబట్టి ఇప్పటికే పేరుకున్న పాపాలను తొలగించుకొనేవి పావనకర్మలు.*
*అంతేగానీ.......ఈ పరిహారాలు ఎలాగూ సిద్ధంగా ఉన్నాయని కొత్త పాపాలను ఆచరించడం తగదు. మందు సిద్ధంగా ఉందని రోగాన్ని ఆహ్వానించలేం కదా! ఉన్న చెడును తొలగించుకొని చిత్తం శుద్ధమైతేనే ఆత్మజ్ఞానం, సత్యప్రాప్తి చేకూరుతాయి.*
No comments:
Post a Comment