భారతం లో ఎవరు ఎక్కువ దురదృష్ట వంతులు?
మహాభారతం లాంటి మహాకావ్యంలో ఎవరిని అడిగినా దురదృష్టవంతులు అనగానే ముందుగా కర్ణుడి పేరో, ద్రౌపది పేరో లేక గాంధారి పేరో చెప్తారు. కానీ, మన పురాతన గ్రంథాల లోతుల్లోకి వెళ్లి, మానసిక విశ్లేషణ చేసి చూస్తే... భారతంలో అందరికంటే పెద్ద దురదృష్టవంతుడు మరొకరు ఉన్నారు. ఆయనే "అశ్వత్థామ".
కర్ణుడు లేదా ద్రౌపది పడిన కష్టాలకు, అవమానాలకు ఒక ముగింపు ఉంది. కానీ అశ్వత్థామ అనుభవించిన, అనుభవిస్తున్న దురదృష్టానికి ముగింపే లేదు. హా.. మరి..
అశ్వత్థామ పుట్టడమే దరిద్రంలో పుట్టాడు. తండ్రి ద్రోణాచార్యుడికి కనీసం పిల్లాడికి పాలు కొనిచ్చే స్తోమత లేక, బియ్యప్పిండిని నీళ్లలో కలిపి ఇస్తే... దాన్నే పాలు అనుకుని తాగి పెరిగాడు. సరే, పెరిగాకైనా సుఖపడ్డాడా అంటే అదీ లేదు. మహాభారత యుద్ధం ముగిసే సమయానికి కసి, పగతో నిద్రపోతున్న ఉపపాండవులను (ద్రౌపది పిల్లలను) నరికేశాడు. ఆ పాపానికి, క్రూరత్వానికి శిక్షగా శ్రీకృష్ణుడు అతనికి ఇచ్చిన శాపం ఏమిటో తెలుసా? "ఉత్తరా గర్భంలోని శిశువుపై బ్రహ్మాస్త్రం వేసినందుకు... ఈ భూమిపై ముప్పై వేల సంవత్సరాల పాటు ఒంటరిగా, కుష్టు వ్యాధితో బాధపడుతూ, ఒళ్లంతా రక్తం, చీము కారుతూ చావు రాక బతకాలి!"
ఒక్కసారి సైకలాజికల్ గా ఆలోచించండి. లోకంలో ఎంతటి కష్టమైనా ఒక యాభై ఏళ్లో, వంద ఏళ్లో ఉండి జీవుడు మరణిస్తే తీరిపోతుంది. కానీ చావాలని ఉన్నా చావు రాకపోవడం, కంటికి కనిపించని నొప్పితో వేల సంవత్సరాలు కాలగర్భంలో కొట్టుమిట్టాడటం... అంతకంటే పెద్ద నరకం, అంతకంటే పెద్ద దురదృష్టం ఇంకొకటి ఉంటుందా? మన పురాణాల ప్రకారం ఆయన ఇప్పటికీ చిరంజీవిగా తిరుగుతూనే ఉన్నాడు.
ఇహ ఒక్కసారి ఆలోచించండి.. రోజుల్లో చాలామంది చిన్న చిన్న కష్టాలకే "నాకంటే దురదృష్టవంతుడు లేడు, నాకే ఎందుకు ఈ దేవుడు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు" అని చిన్న పిల్లల్లా కంగారు పడిపోతుంటారు. వాళ్లంతా అశ్వత్థామ స్టోరీని ఒక్కసారి చదువుకోవాలి. మన కష్టాలు ఎంత? ఈరోజు వస్తాయి, రేపు పోతాయి.
అశ్వత్థామకు అంత జ్ఞానం ఉంది, తండ్రి ద్వారా అన్ని విద్యలు నేర్చుకున్నాడు, సాక్షాత్తు శివాంశ సంభూతుడు అని పేరు తెచ్చుకున్నాడు. కానీ సరైన సమయంలో విచక్షణ కోల్పోయి, అధర్మం వైపు నిలబడి కసితో చేసిన తప్పుల వల్ల... ఆ చదువు, ఆ శక్తి అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది.
జీవితంలో సంపాదన, శక్తులు ఉండటం ముఖ్యం కాదు సార్. పరిస్థితులు మారినప్పుడు, పరీక్షలు ఎదురైనప్పుడు మన మనస్సును, నైతికతను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఆదర్శాలను వదిలేసి అధర్మ బాట పడితే... ఎంతటి వాడైనా అశ్వత్థామలా చరిత్రలో దురదృష్టవంతుడిగానే మిగిలిపోతాడు. లోకం ఎలాంటి పోకడలు పోయినా, నిఖార్సయిన ధర్మం, నిజాయితీ అనే మేలిమి బంగారం ఎప్పటికీ మనల్ని రక్షిస్తుంది!
— ✍️TMS RAO
No comments:
Post a Comment