Friday, July 3, 2026

 ప్రహ్లాద చరిత్ర వలన మనం ఏవిషయం గ్రహిచాలి ?
ప్రహ్లాద శ్చాస్మి దైత్యానాం —అని భగవద్గీత.

భగవంతుని తేజోంశలలో ప్రహ్లాదుడు ఒకటి. దైత్యులలో ప్రహ్లాదుణ్ణి నేను— అని విభూతి యోగం లో భగవానుడు చెప్పాడు.

పితృదేవో భవ —అని చెప్పే వేదవాక్యానికి విరుద్ధంగా పితృవధకు ఆయన కారకుడు కావడం ప్రహ్లాద జీవితంలో ముఖ్య విషయం.

పుత్రేణ లోకాన్ జయతి — పుత్రుడి వల్ల పుణ్య లోకాలను అందుకొంటారు..తాము ప్రారబ్ధ వశాన దుష్కార్యాలు చేసి అందువల్ల దుర్గతిని పొందినా— పుత్ర పౌత్రాదులు తమకోసం చేసే తీర్థయాత్రాది విధులచేత వాళ్లు బంధవిముక్తి పొందగలుగుతారు.

అందుకు — సగరపుత్రులు చేసిన అకార్యానికి మనుమడు భగీరధుడు భువికి , పాతాళానికి, గంగను తెచ్చే ఉపాఖ్యానం— మంచి నిదర్శనం.

జయ విజయులు తాము చేసిన పాపానికి విష్ణులోకం నుంచి భువిలో పడ్డారు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడుగా తొలి జన్మ.

ఇందులోని చర్యలు అతిదారుణమైనవి.

"ఆత్మా వై పుత్ర నామాసి" అని తెలిసి గూడా అనేకపర్యాయాలు— కేవలం తన మాట వినలేదని సుగుణఖని ఐన కొడుకును చిత్రవధ చేశాడు హిరణ్యకశిపుడు.

( కంసుడు మేలేమో ఇతనికంటే . తన ప్రాణం తీసేవాడు అని మేనల్లుణ్ణి కృష్ణుణ్ణి చంపించే యత్నం వాడిది)

ఈ ప్రహ్లాదుడివల్ల హిరణ్యకశిపుడికి ఆ జన్మనుండి విముక్తి కలిగింది అనుకోవచ్చు.. భగవత్ సంకల్పం అది.

అందుచేతనే నారదుడు గర్భవాసకాలంలోనే నారాయణమంత్రం ఉపదేశం చేసి , అతనిని అందుకు సిద్ధం చేశాడు.

భాగవతంలో — కంసుడి పనుపున అక్రూరుడు బలరామ కృష్ణులను ధనుర్యాగానికి తీసుకొనిపోయే ఘట్టం ఉంది.

విచిత్రమేమంటే ఆ అక్రూరుడికి శేషశాయియైన విష్ణువు జలాలలో కనిపించాడు.

ఆయనను స్తుతిస్తూ, సనక సనందనాది ఋషులతో పాటు — ప్రహ్లాదుడు గూడా ఆయనకు కనిపించాడు.

ప్రహ్లాదుడు ఆ పార్షదుల స్థాయికి చేరిపోయాడు.

నృసింహావతార కాలం దాటుకొని— కృష్ణావతారకాలానికి ఆ స్థాయిలో స్థిరపడ్డాడు ప్రహ్లాదుడు..

" శాస్త్రచోదితమైన మార్గంలో నడవని — దారితప్పినవాళ్లను అపమార్గంలో పోయేవాళ్లను …ఆత్మ శ్రేయస్సు కోరేవాడు ఎవరినైనా సరే వదలివేయవలసినదే" —అనే విశేషధర్మం ఈ కథ బోధిస్తుంది.

తండ్రికి ఆ పూర్వపు" వైకుంఠలోక నివాసం" ప్రాప్తించడానికి — దారి సుగమం చేశాడు ప్రహ్లాదుడు.

పితరుల అనుచిత కర్మలకు —చెల్లుచీటీ వ్రాయించే ఋణానుబంధం పుత్రులది.

అది పితరుల మృతి తర్వాత జరిగేది.

కానీ , ఆ అవకాశం ప్రహ్లాదుడు తండ్రి జీవిత కాలంలోనే వినియోగించుకొన్నాడు .

" తండ్రి! హరిఁ జేరుమనియెడి తండ్రి తండ్రి." అని ఆయన నిర్ధారణ.

అట్లని — హరిని ద్వేషించిన జనకుణ్ణి , "నీవు తండ్రివే కాదు పొమ్మ"నలేదు.

తన తమ్ముణ్ణి ( హిరణ్యాక్షుణ్ణి ) చంపినవాడు మన విరోధి, అంటూ విష్ణువుపై ద్వేషం పెంచుకున్నాడా తండ్రి హిరణ్యకశిపుడు.

జన్మతః లోకాన్ని అశాంతిమయం చేయడం తనకు అబ్బిన లక్షణం.

దాన్ని నిగ్రహించి , లోకాలు సవ్యంగా తమతమ విధులలోకి వచ్చేట్టు చేయడం విష్ణువు విధి..

రాక్షసజన్మ అది. చదువైనా సంస్కారం కలిగిస్తుందా? అంటే

"సర్వే జనాః సుఖినో భవంతు ! సమస్త లోకాః సుఖినో భవంతు" కు బదులుగా—

"సురలన్ ద్రోలుటయో సురాధిపతులన్ స్రుక్కించుటో"..

ఈ విధంగా జీవులందరినీ హింసించి, వాళ్ల బాధలో— సంతోషించడం వాళ్ల చదువుల పరమగమ్యం..

గురువులైన చండామర్కులకు నిజమైన చదువులేవో తెలుసు.

వాళ్లు శుక్రాచార్యుల సంతతి గదా! సర్వశాస్త్ర ప్రవక్త ఆ ఆచార్యుడు . అమృతత్వం అనుగ్రహించే గొప్పచదువు (మృతసంజీవని) ఆయన సొంతం.

*సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః

సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాక్ భవేత్ *

అనే నిజమైన చదువులు ఆ గురువులు చదవక పోలేదు.

కానీ — ఉద్యోగ ధర్మంగా వాళ్లు చెప్ప వలసిన పాఠాలు అవి కావు.

రాక్షసలోకంలో ఆ పాఠాలు పనికి రావు.

(ఇపుడూ నిజమైన పాఠాలు మన ఇళ్ళల్లో నేర్పుకోవలసిందే )

హిరణ్యకశిపుడు అంటాడు— అవి విరోధి పాఠాలురా నాయనా! నీ కెవరు చెప్పారు?

వేరే చదువొకటుంది — అని ఆయనకూ తెలుసు.

ఆ పాఠాలు రహస్యంగా ఈ గురువులు నన్ను సాధించడానికి చెప్పేస్తున్నారా? వీళ్ళు నా కొంప ముంచేట్టున్నారు— అని ఆ గురువులను అనుమానిస్తాడు. ఆ తండ్రి. వాళ్ళు పాపం ఈ తండ్రి కోరిన పాఠాలే చెబుతూ వచ్చారు.

వాడూ నేనూ వేర్వేరు — అనే భేదబుద్ధి కలిగించే చదువు మనకవసరం — అని ఆ తండ్రి,

మీరు మేము— అనే భేదబుద్ధి మతిభ్రమణం వల్లనే ఏర్పడుతుంది,

నిజానికి అంతా ఒకటే. "సర్వమున్ అతని దివ్య కళామయము."

వైవిధ్యంతో కనబడేట్టు చేయడం —ఏకం అనేకంగా కానబడడం ఆయన మాయ .

కానీ అన్నిటా వ్యాపించి ఉన్నది" ఆయన దివ్య కళే " అనే అభేదదృష్టి సత్యమని,

ఆ భావన అందరూ పొందవలెనని ఎవరూ చెప్పకే ఆ కొడుకు ఎరిగిన సత్యం..

ఎన్ని రకాల చదువులు చదివినా , గురువు చక్షురున్మీలనం చేయకపోతే సమ్యక్ దృష్టి ఏర్పడదు.

ఎంత రాక్షససంస్కాలు పొంది అందులో పెరిగినా— గర్భవాసకాలంలోనే ఏర్పడి, భూ పతనంతో తనవెంట వచ్చిన సంస్కారం బలీయమై,…

ఇహంలో— రక్కెస గీము (రాక్షస గృహం)లో ఏర్పడ్డ అనాగరిక అవరోధాలను అతిక్రమించుకొని పోగలిగింది.

వినయ విధేయతలలో ఎవరైనా ప్రహ్లాదుడి తర్వాతే అనిపించుకొన్నాడతడు.

( దైత్యులలో పుట్టినా లీలావతీ గర్భంలో ఉన్నపుడే నారద మహర్షి, .నారాయణ మంత్రం ఉపదేశించినందువల్ల ఆ జీవుడిలోని ఉత్తమసంస్కారాలు బహిర్గతమయ్యాయి.)

సహన మొక్కటబ్బ చాల కష్టంబురా ! అంటాడు వేమన. తనను ఎంత బాధించినా , యోగి మాదిరిగా అన్నిటినీ నవ్వుతూ భరించాడు ప్రహ్లాదుడు.

విష్ణువును ఎపుడూ చూస్తూ ఆనందిస్తాడాయన.

" ఏమో అనుకున్నా . విష్ణువు అంటే ఇంతేనా? " అని తనలో నవ్వుకుంటాడు.

సత్యాన్ని బహిరంగ పరచడంలో ఆయన ఎపుడూ వెనుకంజ వేయడు

ఆ విష్ణువు ఎక్కడ ? అని తండ్రి గద్దిస్తే నిర్భయంగా

"ఎందెందు వెదకి చూచిన అందందే కలడు" . అంటాడు,

ఈ సంసార చక్రంలో తగులుకొని ఉండకుండా—

తారు అడవినుండుట మేలు నిశాచరాగ్రణీ ! అని తపోమార్గం తండ్రికి సూచించాడా పిన్నవయసులోనే. (తారు= తాము )

ఏ జాతిలో జన్మించినా" గుణాః పూజా స్థానం" అన్నట్లు తన సుగుణాలతో విష్ణు పార్షదుడై కేవల ఆనందంలో అతడు నిల్చి పోగలిగాడు. లోకారాధ్యుడైనాడు.

No comments:

Post a Comment