Friday, July 3, 2026

 రామాయణంలో శతృఘ్నుడు, భారతంలో నకుల, సహదేవులకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వలేదు?
మనం మహా రచనల లక్ష్యం అర్థం చేసుకోవడంలో పొరబడుతున్నాం. దుర్యోధన దుశ్శాసనులు ఒకరిద్దరు తప్ప వందలో మిగిలిన కౌరవులు భారతంలో ఎక్కడా ఎందుకు కనబడరు? ఇది అర్థమైతే పై ప్రశ్నకు సమాధానం అందినట్టే.

మనకు కావ్యాలూ, పురాణాలు చదివేటప్పుడు ఇలాంటి సందేహాలే వస్తాయి.

[రవీంద్ర నాథ ఠాగూర్ గూడా * *కావ్యోపేక్షితలు* అనే వ్యాస సంకలనంలో చాల మందికి కవులు న్యాయం చేయలేదు. పాత్రలను అసంపూర్తిగా నిర్దయగా వదిలేశారు అని సానునయవాక్యాలు పలికాడు. వాల్మీకి ఊర్మిళనూ , కాళిదాసు అనసూయా ప్రియం వదలనూ అసంపూర్తి చిత్రాలుగా వదిలేశారు అని .]

ఇక్కడ ఒక లక్ష్యంతో సాగే సంఘటనలు ప్రధానం..

ప్రధాన కథా గమనంలో కొన్ని పాత్రలు ప్రముఖంగా కనబడతాయి. వాటి అవసరం అది..

మనుచరిత్ర లో ప్రవరుడు మొదటి రెండు ఆశ్వాసాల తర్వాత కనబడడు.

భారతంలో వికర్ణుడు ఒక్క చోట కనిపిస్తాడు.

యుయుత్సుడు యుద్ధభూమిలో ఒక్కసారి కనిపిస్తాడు. . ఆ సంఘటనను బట్టి ఆ పాత్ర ఇలాంటి వాడు '—-అని ఒక ఊహ చేస్తాం.

ముఖ్య సంఘటనలలో వ్యక్తుల ప్రవర్తనను బట్టి వాళ్ల స్వభావం ఊహిస్తాం.

కావ్య కథ ధర్మ అధర్మ సంఘర్షణ ప్రధాన లక్ష్యం గా నడిచేది. అందులో కొందరు అధికంగా పాల్గొంటారు..కొందరు సహాయకులు.

అందరికీ నిత్య జీవితం మామూలుగా నడిచి పోతూ ఉంటుంది. . కొందరి జీవితాలలో సంఘర్షణలు అధికంగా ఉంటాయి.

నకుల సహదేవులు ధర్మ రాజు రాజసూయ యాగం సమయంలో దిగ్విజయ యాత్ర చేశారు.. శ్రీ లంక వరకూ వచ్చారు.

. విరాట పర్వం లో దక్షిణ గోగ్రహణం లో తమ నేర్పు చూపి సుశర్మ ను తరిమి కొట్టారు . మనం భారత కథలో సభా పర్వం, కొన్ని యుద్ధ పర్వాలు మాత్రమే చూస్తూ ఉంటాం. యుద్ధ పర్వాలలో వాళ్ల యుద్ధ నైపుణ్యం వర్ణితమయ్యే ఉంది.

భీముడు వంద మంది కౌరవులకు అంతకుడుగా పుట్టాడు. నర నారాయణుల అవతారం అర్జునుడు, కృష్ణుడు. —కృష్ణుడు నాయకుడై ధర్మ రక్షణ చేశాడని నరుడందుకు సహకరించాడనీ అతనికి ప్రాధాన్యం. నరుడి అస్త్ర శస్త్ర సంపాదన చెప్పడం కథా గమనంలో చెప్పవలసిన అంశం అయింది.

భగవద్గీత లో అర్జున విషాదయోగంలో చూస్తే —

పితరులూ,, పితామహులూ, బావమరదులు ,సంబంధం కలుపుకొన్న వాళ్లు ఆచార్యులూ, అల్లుళ్ళూ, స్నేహితులు, ఉభయ పక్షాలలో కళ్ళ ఎదుట కనిపిస్తున్నట్లు అర్జునుడు చెప్తాడు.. కౌరవులు, పాండవులు, వాళ్ల ఇతర భార్యలలో పుట్టిన సంతానం అందరూ యుద్ధం చేసే ఉంటారు. వాళ్లందరూ ఎవరెవరితో ఎపుడు యుద్ధం చేశారో ఎట్లా పోయారో తెలుసుకోవాలని శ్రోతకు ఉండాలి గదా! అపుడు దానికి సమాధానం చెప్పడం జరుగుతుంది.

ప్రధాన వీరుల యుద్ధం లేదా ఏదైనా విశేషమున్న యుద్ధం ఐనపుడే వినే కుతూహలం ఉంటుంది. అందరి విషయాలూ తెలుసుకొనే ఆసక్తి ఉండదు .

దశముఖ వథ రామాయణం లక్ష్యం. సీతా రాముల 10 సంవత్సరాల వనవాసం హాయిగా గడిచిపోయింది అని ఒకే శ్లోకం లో చెప్పి వదిలేశాడు మహర్షి. అంటే ఆ 10 సంవత్సరాలలో మనకు కుతూహలం కలిగించే విషయాలు లేవు అని.

శత్రుఘ్నుడు భరతుని వెంట ఉన్నాడు. లవణాసుర వధ చేశాడు. లవ కుశులు పుట్టిన వేళలో వాల్మీకి ఆశ్రమానికి వచ్చి (వేరే పని మీద వెళ్లుతూ) ఆగాడు అని మహర్షి చెప్పాడు. రాముడి వంశం తదనంతరం రాజ్యం చేపడుతుంది గాబట్టి లవకుశుల జన్మ విషయం కథకు ముఖ్యం. లక్ష్మణాది సోదరుల సంతతి జన్మ వివరాలు పాఠకులు అపేక్షించేవి కాదు.

No comments:

Post a Comment