Friday, July 3, 2026

 *గానం-పానం*
                  ➖➖➖✍️

‘నేను భాగవతాన్ని వింటున్నాను/చదువుతున్నాను’ అని ఎప్పుడూ అనుకోకూడదంటారు!

మరేమనాలని అడిగేవారికి….                       ‘పిబత భాగవతం’(భాగవతాన్ని తాగండి) అనాలని చెబుతారు భాగవతులు.

చెవులతో వినేదాన్ని తాగడం ఎలా కుదురుతుంది?

కుదురుతుంది. అలా అనడంలో లోతైన అంతరార్థం ఉంది.

ఏదైనా తాగుతున్నప్పుడు మనసు ఎక్కడో ఉన్నా ఆ పదార్థాన్ని నోరు నేరుగా కడుపులోకి పంపిస్తుంది. ద్రవంలో సాధారణంగా తీసిపారేసేది ఏదీ ఉండదు. ఆ దృఢమైన నమ్మకంతో రెండో ఆలోచన లేకుండా తాగేస్తాం.

‘భాగవతమూ అలాంటిదే. దాన్ని రచించినప్పుడే అనేక వడపోతలు జరిగిపోయాయి. (భక్తులు,భగవంతుల కథలు కాబట్టి, వాటివల్ల అనేకమందికి మార్గదర్శనం అవుతుంది కాబట్టి) దీనిలో తీసి పారేయవలసింది ఏదీ ఉండదు’ అని వేదాంత ప్రవచనకర్తల మాట.

భాగవతంలో భగవంతుడు శబ్దరూపిగా వసించడమే అందుకు కారణం. కాబట్టి భావంతో సంబంధం లేకుండా గా(పా)నం చెయ్యవచ్చు.

‘తెలుగు భాషకు ముగ్గురు మకుటంలేని మహారాజులు ఉన్నారు. వారు వరసగా- త్యాగరాజు, పోతరాజు, గోపరాజు. వీరి ముగ్గురి పేర్లలో రాచరికం ఉంది. కానీ వీరు ముగ్గురూ భగవంతుణ్ని సేవించి, ఆ సేవల్లోని మాధుర్యాన్ని గ్రోలి (తాగి), ఆ రుచి మరిగి ‘ఈ రాచరికం వల్ల ఏమీ సుఖంలేదు. కాబట్టి మాకు వద్దు’ అని విడిచిపెట్టేశారు.

ఆ పరంపరలో ఒక రాజు దాసుడయ్యాడు. అతడే రామదాసుగా మారిన గోపరాజు.

ఆయన తన కీర్తనల్లో ‘రామజోగి మందు కొనరే...’ అనే కీర్తనలో ‘శ్రీరామ దివ్య నామస్మరణ అనే పానం చెయ్యండి’ అన్నాడు.

మరోచోట ‘తారక నామమనే రసాన్ని పానం చేసేవారికి అమృతాన్ని తాగే అవసరం లేదు’ అన్నాడు.

మరో రాజు అయ్య (తండ్రి)గా మారి త్యాగయ్య అయ్యారు. ఆయనా తన కీర్తనల్లో చాలాచోట్ల ‘దైవ నామ పానం చెయ్యండి’ అని ప్రయోగించారు.

పోతరాజు ‘పోతన్న’ పేరుతో అందరికీ అన్న అయ్యారు. ఆయన తన భాగవత అనువాదంలో అనేకచోట్ల నామపానం అనే ప్రయోగం చేశారు.

ప్రహ్లాదుడి గురించి చెబుతూ, నారాయణుడి పాదపద్మాల గురించి ఆలోచించడమనే అమృత పానం చేసేవాడు- అని ప్రయోగించారు.

‘మందార మకరంద...’ అనే పద్యంలో విష్ణు పాదాల గురించి ఆలోచనలనే అమృతాన్ని గ్రోలేవాడు అని ప్రయోగించారు.

ఇలా ఆ ముగ్గురూ పరమేశ్వరుడి పాదాల దగ్గర దాస్యాన్నే అభిలషించారు. భక్తి అనే రసం పంచారు.   భక్తి సామ్రాజ్యాలను ఏలారు.

సదాశివ బ్రహ్మేంద్రులవారు ‘పిబరే రామరసం’ అంటూ రామ నామమనే రసాన్ని పానం చెయ్యండన్నారు.

ఇలా విష్ణునామ సంకీర్తనలు చేసినవారంతా పానం చెయ్యమనే చెప్పారు.

వేదాలనే కల్పవృక్షాల శాఖల చిట్టచివర పండిన పళ్లు ఉపనిషత్తులు. అవి జ్ఞాన రసాత్మకమైనవి. దాన్ని చిలక కొరికింది. పండు బాగా పక్వానికొచ్చినప్పుడే చిలక కొరికి రుచి చూస్తుంది. చిలక రుచి చూసిన పండ్లను ఎంగిలిగా భావించరు.

ఇక్కడ చిలక ఎవరు? శుకబ్రహ్మ. శుకుడు తన నోటిద్వారా ప్రవచనం చేశారు. అదే భాగవతం.

దేనిమీదా ఆపేక్ష లేని మహాపురుషుడు శుకుడు. అటువంటి శుకబ్రహ్మ నోట్లోంచి వచ్చింది కాబట్టి భాగవతం ఎంగిలికాని, మధురమైన పానద్రవ్యం అయింది. అందుకని ఆ భాగవతాన్ని రెండో ఆలోచన లేకుండా తాగెయ్యవచ్చు అంటారు.

నాలుక లాగానే చెవి, కన్ను లాంటి ఇంద్రియాలు సైతం రుచిని ఆస్వాదించగలుగుతాయి. భగవన్నామం అన్నా, విన్నా, కన్నా మధురమే కదా!

అంత గొప్పదైన రసాన్ని, అమృతసమమైనదాన్ని గానం చేస్తుంటే, ఆ గానం ఏ అడ్డంకీ లేని పానం కావాలి.

కాబట్టి భాగవతాన్ని వినడం అనేకన్నా పానం చెయ్యడం అనడమే అన్నిందాలా సబబు.

No comments:

Post a Comment