వృద్ధాప్యం -
జీవితం చివరి దశ కాదు, తెలివిగా బతకాల్సిన దశ.
వృద్ధాప్యంలో ఒంటరిగా మిగిలిపోకుండా, ఎవరికీ భారం కాకుండా గౌరవంగా బతకాలంటే ఈ 10 సత్యాలు గుర్తుంచుకోండి:-
1. వివాదాలకు దూరం...
పొరుగువాడికి గుణపాఠం నేర్పుతానని కోర్టు గుమ్మాలు ఎక్కకండి. కేసు ముగిసేలోపు మనమే ముగిసిపోవచ్చు. గెలిచినా కూడా మనకన్నా ముందు లాయర్లే స్థిరపడతారు.
2. పాత వాహనాల మోజు వద్దు.....
5 లక్షలు మిగులుతుందని సెకండ్ హ్యాండ్ కార్లు ఇంటికి తెచ్చుకోకండి. అది రోడ్డు మీద కంటే గ్యారేజీలోనే ఎక్కువ ఉంటే, బాధ కారుకు కాదు మనకే.
3. ఆస్తులు రాసివ్వకండి....
పిల్లలు ఇప్పుడు దేవుళ్లలా కనిపించినా, ఆస్తి రిజిస్టర్ చేసిన మరుక్షణం మనం ఆ ఇంట్లో "అక్కర్లేని, పనికిరాని, భారమైన వస్తువు" అవ్వొచ్చు. పిల్లలు చెడ్డవారు కాదు, కానీ పరిస్థితులు క్రూరం. ఆస్తి మీ చేతిలోనే ఉంచుకోండి.
4. చివరి పొదుపును కాపాడుకోండి....
30 ఏళ్ల పెన్షన్ మొత్తం పిల్లల చదువులకు ఇచ్చేయకండి. రేపు మందులకు కూడా వారి మీదే ఆధారపడాల్సి రావొచ్చు.
5. పిల్లల జీవితంలో అతిగా జోక్యం వద్దు....
"మా పిల్లలే కదా" అని వారి వ్యక్తిగత జీవితంలోకి వెళ్లకండి. మన ప్రేమే వారికి ఇబ్బందిగా మారొచ్చు. మీకంటూ ఒక చిన్న స్థలం ఉంచుకుని స్వతంత్రంగా బతకండి.
6. యాత్రలు వాయిదా వేయకండి....
"పిల్లలు సెలవుల్లో తీసుకెళ్తారు" అని ఎదురుచూడకండి. వారికి టైం దొరికేసరికి మనం నడవలేకపోవచ్చు. ఓపిక ఉన్నప్పుడే మీకు నచ్చిన చోటికి వెళ్లిరండి.
7. ఈరోజే తినండి, ఈరోజే జీవించండి....
భార్య/భర్తకు ఇష్టమైనది ఈరోజే కొనివ్వండి. చనిపోయాక శవం దగ్గర పెట్టి "ఆయనకు చాలా ఇష్టం" అని ఏడవడం హాస్యాస్పదం.
8. విశ్రాంతి తీసుకోండి.....
చచ్చేవరకు పని పోగు చేసుకోకండి. ఉదయం నుంచి రాత్రి వరకు పరిగెడితే మిగిలేది అలసటే. శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వండి.
9. నిద్రే పెద్ద ఔషధం....
అనవసరంగా మేలుకుని ఆరోగ్యం పాడు చేసుకోకండి. అనారోగ్యం వస్తే బాధను మనమే భరించాలి, ఎవరూ పంచుకోరు.
10. ఒంటరితనంతో స్నేహం చేయండి.....
మనం ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వెళ్తాం. ఎవరో ఏదో చేస్తారనే ఆశ తగ్గించుకోండి. మన నీడ కూడా చీకట్లో తోడు రాదు. ఒంటరిగా సంతోషంగా ఉండడం నేర్చుకోండి.
సంతోషం ఎవరో ఇచ్చేది కాదు, మనమే సృష్టించుకోవాలి.
No comments:
Post a Comment