*శ్రీ వకుళామాత సన్నిధిలో శాస్త్రోక్తంగా ప్రారంభమైన “అక్షర గోవిందం – అన్నప్రాశనం”*
*చిన్నారుల విద్యారంభానికి దైవానుగ్రహంతో టీటీడీ వినూత్న కార్యక్రమం*
*ప్రతి హిందూ కుటుంబం ఈ దివ్య అవకాశాన్ని వినియోగించుకోవాలి – టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు*
తిరుపతి, 2026 జూలై 03:: చిన్నారుల విద్యారంభం, జీవితారంభం శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో మంగళప్రదంగా సాగాలనే సంకల్పంతో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని శ్రీ వకుళామాత ఆలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన “అక్షర గోవిందం – అన్నప్రాశనం” కార్యక్రమాన్ని శుక్రవారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ బీఆర్ నాయుడు, ఈవో శ్రీ ఎం. రవిచంద్ర పాల్గొని చిన్నారులకు ఆశీర్వచనాలు అందించారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ, అక్షరాభ్యాసం, అన్నప్రాశనం ప్రతి చిన్నారి జీవితంలోని అత్యంత పవిత్ర సంస్కారాలు అని పేర్కొన్నారు. తొలి అక్షరం “గోవింద” నామంతో ప్రారంభమైతే విద్యాభ్యాసం దైవానుగ్రహంతో విజయవంతంగా సాగుతుందనే విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించిందన్నారు. ప్రతి హిందూ కుటుంబం ఈ దివ్య అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
*‘అక్షర గోవిందం కిట్’ ఉచిత పంపిణీ*
ప్రత్యేక పూజల అనంతరం చిన్నారులకు ‘అక్షర గోవిందం కిట్’ ఉచితంగా అందజేశారు. ఇందులో రాతపలక, బలపాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ, శ్రీవారి కంకణం, ఫటిక బెల్లం, శ్రీ వేంకటేశ్వరస్వామి, శ్రీ వకుళామాత, శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి చిత్రపటాలు, గోవింద నామాలు, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, పెద్దబాలశిక్షతో పాటు పూజా, విద్యా సామగ్రి ఉన్నాయి.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
No comments:
Post a Comment