శ్రవణుడి కధలో శబ్దభేది విద్య గురించి విన్నా..వివరంగా చెబుతారా ఎవరైనా ?
శబ్దాన్ని విని బాణం వేయడాన్ని శబ్దభేది విద్య అంటారు. సాధారణంగా రాజులు వేటకు వెళ్ళేవారు. వేటకు అంటే 10 గంటలకు వెళ్లి 5 గంటలకు తిరిగి రావడం కుదరదు. 7/10 రోజుల కార్యక్రమం. జంతువులు అంత తేలిగ్గా దొరకవు. పగలు దొరకకపోతే రాత్రి ప్రయత్నించేవారు.
పగలు వేటాడటం వేరు. రాత్రి పూట వేటాడటం అంత సులభం కాదు. రాత్రి జంతువులు నదులు, సరస్సుల వద్దకు తప్పకుండా వస్తాయి. నీరు త్రాగడానికి. గుంపులు గుంపులుగా వస్తాయి. ఎదురుగా వెళ్ళి వేటాడడం కష్టం.
అందుకని దగ్గరలోని చెట్టుపై కూర్చునో, చెట్టుచాటున నుంచునో వేటకు ప్రయత్నిస్తారు. చీకటిలో ఏమీ కనబడదు. కాని జంతువులు నీరు త్రాగుతూన్నప్పుడు కొన్ని చప్పుళ్ళు వినబడతాయి. ఆ శబ్దం సరిగ్గా ఏ వైపు నుంచి, ఏ ప్రదేశం నుంచి వస్తూందో ఊహించి బాణం వేస్తారు వేటాడడానికి. సాధారణంగా అర్ధరాత్రి జంతువులు వచ్చే సమయానికి మనుషులు ఎవరూ రారు, తిరగరు. అందుకని ఈ విద్య వల్ల ప్రమాదమేమీ లేదు.
భూలోకానికి స్వర్గలోకానికి తేడా ఏమిటంటే భూలోకంలో సుఖానికి దుఃఖస్పర్శ, దుఃఖానికి సుఖస్పర్శ ఉంటాయి. స్వర్గంలో దుఃఖస్పర్శ ఉండదు.
దశరధమహారాజు వేటకి వెళ్ళాడు. ఆయనకు శబ్దభేది విద్య తెలుసు. అంటే దూరంగా శబ్దం వినబడితే శబ్దం వచ్చినవేపు బాణంవేసి దానిని చంపగలగడం. సరయూ నది వడ్డున చెట్టు చాటున నుంచుని ఉన్నాడు. నదిలో ఏదో నీరు తాగుతూన్నట్లుగా " గుడ గుడ " మని శబ్దం వినబడింది. జంతువనుకుని బాణం ప్రయోగించాడు. మనిషి ఆర్తనాదం వినబడింది. గబగబా అక్కడికి వెడితే ఓ మునికుమారుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు. నీళ్ళ కోసం చెంబు ముంచడంతో అలా శబ్దం వచ్చింది. అతను ( శ్రవణుడు) చనిపోతూ " ఈ చెంబులోని నీళ్ళను నా తల్లిదండ్రులకు వెంటనే ఇవ్వండి " అని చెప్పి మరణించాడు. చాలాబాధతో ఆ నీళ్ళను తీసుకొనిపోయి అతని తల్లిదండ్రులకు ఇచ్చి వారి కుమారుడి మరణవిషయం చెప్పాడు. ఆ తండ్రి బాధను తట్టుకోలేక నువ్వు కూడా పుత్రవియోగంతో మరణిస్తావని దశరధుణ్ణి శపిస్తాడు.
ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆ శాపం దశరధుడికి బాధకు బదులుగా పరమసంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే అంతవరకూ ఆయనకి సంతానం లేదు, ఈ శాపంతో తెలిసినదేమిటంటే " పుత్రవియోగంతో మరణిస్తావు " అన్నారు కనుక తప్పకుండా కొడుకు పుడతాడని.
చిన్నప్పుడు సోషల్ స్టడీస్ లో పృధ్వీరాజు అద్భుత కధ ( నిజమో కాదో సందేహం మన కుహనా మేధావులకు ) ఉండేది. చివరికి ఘోరీ పృథ్వీరాజుని ఓడించి, బంధించి కళ్ళు పీకించేసాడు ఎందుకయినా మంచిదని. చాంద్ బర్దాయి అని కవి, మిత్రుడు పృథ్వీరాజుకి. అతను ఘోరీ వద్దకు వెళ్ళి " పృధ్వీరాజ్ కి శబ్దభేది విద్యలో అద్భుత పాటవం ఉంది. పరీక్షించి ఆనందించండి మీరు " అని చెబుతాడు. నిండు సభలో ఏర్పాటు చేసారు కార్యక్రమం. గంట కొట్టగానే గంటను బాణంతో కొట్టడం వంటివి కొన్ని చేయగానే ఘోరీ ఆశ్చర్యపోయి " శహబాష్ " అని చప్పట్లు కొట్టడం మరుక్షణంలో పృధ్వీరాజ్ వదిలిన బాణం ఘోరీ గుండెలో దిగడం, ఘోరీ మరణించడం జరిగింది అని చదివాం అప్పుడు.
రాజులు ఈ విద్యను కూడా నేర్చుకునేవారు ఆ కాలంలో.
దుఃఖానికి సుఖస్పర్శ, సుఖానికి దుఃఖస్పర్శ అలా ఉంటాయి. అమ్మవారి లీలలు అద్భుతం.
ఏతత్ సర్వం శ్రీపరదేవతార్పణమస్తు.
శుభమస్తు
No comments:
Post a Comment