365 రోజులు✈️హార్ట్ ఫుల్ నెస్🌍కథతో
♥️ *కథ* - *81* ♥️
చదివే ముందు... సున్నితంగా కళ్ళు మూసుకోండి... లోతైన శ్వాస తీసుకోండి .... నా కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి నాకు పూర్తి అర్హత ఉందని భావించండి... ఇప్పుడు చదవడం కొనసాగించండి...
*తగిన* *మనిషి* *కోసం* *అన్వేషణ*
ఒకసారి, ఒక ధనవంతుడు గ్రామం మధ్యలో ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. ఆలయం తయారయ్యి, ముస్తాబవడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పూజలు చేశారు. ఆలయ వైభవాన్ని, అందాన్ని చూసి అంతటా జనం కొనియాడారు.
కాలక్రమేణా, ఆలయం బాగా ప్రాచుర్యం పొందింది. సుదూర ప్రాంతాల నుండి ప్రజలు ఆలయానికి చేరుకుని పూజలు చేయడం, దాని అందాలను ఆరాధించడం ప్రారంభించారు. భక్తుల రద్దీని చూసి ఆ ధనవంతుడు ఆలయంలోనే భక్తులకు భోజన, వసతి ఏర్పాట్లు చేశాడు.
ఇప్పుడు ఆ సంపన్నుడికి గుడిలో ఏర్పాట్లన్నీ పర్యవేక్షించే వ్యక్తి కావాలి, అందుకని అతను ఆలయం వెలుపల ఒక ప్రకటనను అంటించాడు - "నిర్వాహకుడు కావలెను."
ఆ ప్రకటన చూసి చాలా మంది ఆయన వద్దకు రావడం ప్రారంభించారు. ఈ ఆలయ కార్యనిర్వహణాధికారి ఉద్యోగం అంటే మంచి జీతం కూడా వస్తుందని ప్రజలకు తెలుసు. కానీ ధనవంతుడు వారితో మాట్లాడిన తర్వాత ప్రతి దరఖాస్తుదారుని వెనక్కి పంపేస్తూ, "నాకు ఈ ఉద్యోగానికి తగిన వ్యక్తి కావాలి, అతను ఆలయాన్ని సరిగ్గా నిర్వహించగలగాలి" అనేవాడు.
అతను ప్రతిసారీ ఇలా ఉద్యోగం కోసం వచ్చిన ప్రతి ఒక్కరినీ తిరస్కరిస్తున్నందున, చాలా మంది అతన్ని మూర్ఖుడు, వెర్రివాడు అని పిలవడం ప్రారంభించారు. కానీ అతను ఎవరి మాటలను పట్టించుకోకుండా ఆలయ నిర్వహణకు సరైన వ్యక్తి కోసం వెతుకుతునే ఉన్నాడు.
అతను రోజూ ఉదయం తన ఇంటి డాబా మీద కూర్చుని గుడికి వచ్చే భక్తులను చూస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక పేదవాడు చిరిగిన, మురికి బట్టలు వేసుకుని గుడికి రావడం చూశాడు.
పేదవాడు గుడి నుండి బయటకు రాగానే ధనవంతుడు అతన్ని పిలిచి "ఈ గుడి ఏర్పాట్లు నువ్వు చూసుకుంటావా?"అని అడిగాడు.
పేదవాడు అది విని చాలా ఆశ్చర్యపోయి, "నేను చాలా పేదవాడిని, నేను చదువుకోలేదు. ఇంత పెద్ద దేవాలయాన్ని ఎలా నిర్వహించగలను..." అని చేతులు జోడించి సమాధానమిచ్చాడు.
ధనవంతుడు నవ్వి, "ఈ ఆలయ నిర్వహణ బాగా చదువుకున్నవారికి ఇవ్వడం నాకు ఇష్టంలేదు, అర్హత ఉన్న వ్యక్తికి దాని నిర్వహణను అప్పగించాలనుకుంటున్నాను." అన్నాడు.
ఈ మాటలకు పేదవాడు కంగారుపడి, "అయితే ఈ భక్తులందరిలో నన్ను మాత్రం ఆలయ నిర్వహణకు తగిన వ్యక్తిగా మీరు ఎందుకు భావిస్తున్నారు?" అని అడిగాడు.
దానికి ధనవంతుడు, "నువ్వు యోగ్యుడవని నాకు తెలుసు. చాలా రోజుల క్రితం గుడికి వెళ్లే దారిలో నేను ఒక ఇటుక ముక్కను పాతిపెట్టాను. ఇటుకను సగం భూమిలోపల ఉంచి, సగం బయటకు ఉండేలా పెట్టాను. చాలా రోజులుగా నేను గమనిస్తూఉన్నాను. చాలా మంది ఆ ఇటుక ముక్క తగిలి తొట్రుపడ్డారు, మరికొంతమంది అది కాలికి తగిలి పడిపోయారు కూడా ... కానీ ఆ ఇటుక ముక్కను అక్కడ నుండి తొలగించాలని ఎవరికీ అనిపించలేదు, దాని గురించి ఎవరూ ఆలోచించలేదు కూడా.
నీవు ఇటుకముక్కను తగులుకోలేదు, కానీ దానిని చూడగానే, అక్కడ నుండి దానిని తొలగించాలని అనుకున్నావు. అక్కడవున్న ఒక కూలీ వద్ద నుండి పార తీసుకుని, ఆ భాగాన్ని తవ్వి అక్కడి నేలను నీవు చదునుచేయడం నేను చూశాను."
ఆ పేదవాడు ఇలా అన్నాడు: "నేనేమీ గొప్ప పని చేయలేదు, ప్రతి మనిషి ఇతరుల గురించి ఆలోచించి, మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగించాలి, నేను నా కర్తవ్యం మాత్రమే చేసాను."
దానికి ధనవంతుడు చిరునవ్వు నవ్వి, “ఎవరైతే తమ కర్తవ్యాన్ని తెలుసుకుంటారో వారే యోగ్యవంతులవుతారు ” అన్నాడు.
దీంతో ఆ శ్రీమంతుడు ఆ పేదవానికి ఆలయ నిర్వహణ బాధ్యతను అప్పగించాడు.
♾️
మనం ఏమి చేసినా, అందులో మనం రాణించాలి అంతే, దానికి అహంతో ఎలాంటి సంబంధం లేదు. 🌼
దాజీ
హార్ట్ ఫుల్ నెస్ ధ్యానం 💌
HFN Story team
No comments:
Post a Comment