కొందరు సినిమా చూస్తే అందులోనే లీనమవుతారు
కొందరు ఆటలాడితే అందులోనే లీనమవుతారు
కొందరు ముచ్చట్లు పెడితే అందులోనే లీనమవుతారు
కొందరు పనిచేస్తే అందులోనే లీనమవుతారు
కొందరు ప్రేమలో పడితే అందులోనే లీనమవుతారు
చాలామంది సంసారంలో మునిగితే అందులోనే లీనమవుతారు
జీవుడు కూడా మాయలో లీనమయ్యాడు
జీవుడు ప్రకృతి సంపర్కం వల్ల మాయలో చిక్కుకున్నాడు
ఉపనిషత్తులు, భగవద్గీత వేదాంతం సత్యం ఒకటే
ఆత్మకు జన్మ లేదు, మరణం లేదు,
సుఖం లేదు, దుఃఖం లేదు.
ఆత్మ ఎప్పుడూ సాక్షిగా ఉంటుంది. కానీ జీవుడు ప్రకృతి సంపర్కం వల్ల మాయలో చిక్కుకొని జనన–మరణ చక్రంలో తిరుగుతూ సుఖదుఃఖాలను అనుభవిస్తుంటాడు.
ఈ విషయాన్ని ఒక చిన్న ఉపమానం ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు.
ఒక తల్లి తన చిన్న బిడ్డతో కలిసి దారిలో వెళ్తోంది. మార్గమధ్యంలో ఒక పెద్ద సర్కస్ కనిపించింది.
తల్లి ఒక్కసారి చూసి, "ఇది కేవలం వినోదం మాత్రమే" అని ముందుకు వెళ్లాలని అనుకుంది.
కానీ చిన్న బిడ్డకు ఆ సర్కస్ చాలా ఆకర్షణీయంగా కనిపించింది. రంగురంగుల లైట్లు, సంగీతం, జంతువులు, విన్యాసాలు, నవ్వులు, చప్పట్లు చూసి బిడ్డ లోపలికి పరుగెత్తింది.
లోపల ఒక చోట నవ్వుతుంది, ఇంకో చోట భయపడుతుంది, మరొక చోట ఏడుస్తుంది, ఇంకొక చోట ఆశ్చర్యపోతుంది. ఒక్కో ఆటను చూస్తూ "ఇంకొంచెం చూస్తాను", "ఇంకో ఆట అయిపోగానే వస్తాను" అని బయటకు రావడానికి ఇష్టపడదు.
రాత్రంతా సర్కస్‌లోనే గడిపినా బిడ్డకు ఇంకా బయటకు రావాలనే కోరిక కలగదు.
అయితే తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది?
తల్లి అన్నీ చూస్తుంది. కానీ ఆ ఆటలతో ఆమెకు ఎలాంటి బంధం లేదు. నవ్వాల్సిన అవసరం లేదు, ఏడవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవన్నీ కేవలం ఆటలేనని ఆమెకు తెలుసు.
ఇదే భగవద్గీత చెప్పే రహస్యం.
సర్కస్ అంటే ఈ జగత్తు.
బిడ్డ అంటే జీవుడు.
తల్లి అంటే అత్మ
సర్కస్‌లో జరిగే ఆటలు అంటే జీవితంలో జరిగే సుఖదుఃఖాలు.
బిడ్డ సర్కస్‌ను నిజమని భావించింది. అందుకే ప్రతి సంఘటనతో ఆనందించింది, బాధపడింది.
అలాగే జీవుడు ప్రకృతి, శరీరం, మనస్సు, ఇంద్రియాలతో తాదాత్మ్యం పొందినప్పుడు మాయలో చిక్కుకుంటాడు. "నేనే ఈ శరీరం", "నాకే ఈ సుఖం", "నాకే ఈ దుఃఖం", "ఇది నాది", "వాడు నావాడు", "ఇది నా సంపద", "ఇది నా కుటుంబం" అని భావించడం ప్రారంభిస్తాడు.
ఈ భావమే బంధనానికి మూలం.
కోరిక తర్వాత ఇంకో కోరిక సుఖం తర్వాత ఈకో సుఖం ఇలా కోరికలతో సుఖాలనుభవిస్తూ అందులోనే ఉండిపోతున్నాడు జీవుడు
ఈ సుఖాలు అనుభవించాలి అంటే శరీరం కావాలి
అందుకే జీవుడు శరీరాన్ని వదల లేక పోతాడు సుఖాలు వదల లేక పోతాడు
అందుకే జీవుడు దేహం పై మమకారంతో
ఒక జన్మ తర్వాత మరొక జన్మ ఎత్తుతూ కర్మఫలాలను అనుభవిస్తూ తిరుగుతుంటాడు.
కానీ ఆత్మ మాత్రం ఎప్పుడూ సాక్షిగా ఉంటుంది
సర్కస్‌కు తల్లితోనే వచ్చింది. కానీ ఇప్పుడు తల్లి మాట వినడం లేదు.
అదేవిధంగా జీవుడు కూడా పరమాత్మ నుండే ఉద్భవించాడు. కానీ మాయ ప్రభావం వల్ల తన మూలాన్ని మరచిపోయాడు.
బిడ్డకు ఇంటి జ్ఞాపకం వస్తేనే సర్కస్ నుండి బయటకు వస్తుంది.
అలాగే జీవుడికి "నేను శరీరం కాదు. నేను ఆత్మను" అనే వివేకం కలిగితేనే మాయ నుండి బయటపడే ప్రయాణం ప్రారంభమవుతుంది.
అయితే ఆ జ్ఞాపకం ఎలా వస్తుంది?
అక్కడే గురువు అవసరం వస్తుంది.
సర్కస్‌లో మునిగిపోయిన బిడ్డకు తల్లి "రా బిడ్డా! ఇది నీ శాశ్వత నివాసం కాదు. మన ఇల్లు వేరే ఉంది" అని గుర్తు చేస్తుంది.
అలాగే సద్గురువు జీవునితో ఇలా చెబుతాడు:
"నీవు ఈ శరీరం కాదు."
"నీవు మనస్సు కాదు."
"నీవు ఇంద్రియాలు కాదు."
"నీవు పుట్టలేదు. చనిపోవు."
"నీవు పరబ్రహ్మ స్వరూపుడివి."
గురువు ఇచ్చే ఉపదేశం వల్ల జీవుడిలో వివేకం కలుగుతుంది. వైరాగ్యం పుడుతుంది. మాయపై మమకారం తగ్గుతుంది. భోగాల కంటే భగవంతుని వైపు మనస్సు తిరుగుతుంది
ఒక పిల్లవాడు సినిమా చూస్తూ హీరో ఏడిస్తే తాను కూడా ఏడుస్తాడు. కానీ సినిమా ముగిసిన తర్వాత అది కేవలం కథ అని తెలుస్తుంది.
కలలో రాజ్యాన్ని అనుభవించినవాడు మేల్కొన్న వెంటనే అది నిజం కాదని గ్రహిస్తాడు
నీటి బొట్టు ఉన్నా తామరాకు తడవదు. అలాగే జ్ఞానికి లోకవ్యవహారం ఉన్నా మాయ అంటదు.
జీవుడు ప్రకృతితో ఐక్యమైతే బంధనం.
ఆత్మతో ఐక్యమైతే ముక్తి.
మాయలో ఉన్నంతకాలం జననం, మరణం, సుఖం, దుఃఖం, భయం, ఆశ, నిరాశ, మోహం, కర్మ, పునర్జన్మలు కొనసాగుతూనే ఉంటాయి.
గురువు చూపిన జ్ఞానమార్గంలో నడిచి, వివేకం మరియు వైరాగ్యాన్ని పెంపొందించుకొని, భగవంతుని స్మరిస్తూ జీవించినప్పుడు జీవుడు తన అసలు స్వరూపాన్ని తెలుసుకుంటాడు.
అప్పుడు సర్కస్ ముగుస్తుంది. మాయ తొలగిపోతుంది. జీవుడు తన అసలు నిలయమైన పరమాత్మను చేరుకున్నానని గ్రహిస్తాడు.
అదే ఆత్మజ్ఞానం.
సముద్రం నుండి ఆవిరైన నీరు సముద్రం చేరాలి
సముద్రం నుండి నీరు అవిరవుతుంది
మేఘముగా తయారవుతుంది
వర్ష రూపంలో కిందికి వస్తుంది
అ నిటి బోట్లు సముద్రాన్ని చేరాలి కాని
మళ్లీ మధ్యలో నీరు ఆవిరి అయిపోతే
మళ్లీ మేఘం తయారవుతుంది
మళ్ళీ వర్షం రూపంలో కిందికి వస్తుంది
నీటి బొట్టు సముద్రం చేరేవరకు ఇలా ఆవిరి అవుతూనే ఉంటుంది మేఘంలా తయారవుతూనే ఉంటుంది
ఒక వ్యక్తి ఇంటి నుండి తీర్థయాత్రకు బయలుదేరాడు అక్కడ స్వామీజీలతో పరిచయం పెంచుకున్నాడు ఆయనకు అక్కడే ఉండాలి అనిపించింది
ఇంటికి రావడం లేదు
చాలాకాలం తర్వాత ఒకఆయన కలిశాడు
మీ భార్య పిల్లలు నీ కొరకు ఎదురుచూస్తున్నారు అని గుర్తు చేశాడు
అప్పుడు తీర్థయాత్ర నుండి ఇంటికి బయలు దేరాడు
సముద్రంలో ఆవిరైన నీరు సముద్రాన్ని చేరాలి
సర్కస్ కు వెళ్లిన బిడ్డ తల్లిని చేరాలి
తీర్థయాత్రకు బయలుదేరిన మనిషి మళ్లీ ఇంటికి చేరాలి
దేవుడిని విడిచిన జీవుడు దైవం చేరాలి
ఇదే భగవద్గీత వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ప్రవచనకర్తలు వేదాంతం బోధించే పరమసత్యం.
తాను ఎక్కడ నుండి వచ్చాడో అక్కడికి చేరాలి
ఆదమరసి ఉన్నవారికి
తన యదస్థానంగుర్తు చేసేవారే గురువులు
.
No comments:
Post a Comment