Monday, September 7, 2026

 *****
                        *అనఘ*
                        ======
                  (మినీ హాస్య కథ)

(నేను రాసిన ఈ హాస్య కథ షార్ వాణి అనే మాస పత్రికలో ఆగస్టు 2026 లో ప్రచురితమైనది)

రచన ::
బుద్ధవరపు కామేశ్వరరావు
హైదరాబాద్.

*****

అనఘ....ఇప్పుడు ముంబై చిత్రరంగంలో మార్మోగుతున్న హీరోయిన్ పేరు. ఆమె చిత్రరంగానికి వచ్చి పది సంవత్సరాలే అయినా,  ఆమె నటించిన డజను సినిమాలు రికార్డుల వర్షం కురిపించాయి. అనఘ డేట్స్ కోసం ఆమె ఇంటి ముందు బాలీవుడ్ నిర్మాతలు క్యూ కడుతున్నారు.

ఎలాగైనా ఆమె చేత ఒక్క తెలుగు సినిమాలో అయినా సరే నటింప చేయాలని
హైదరాబాద్ కు చెందిన ప్రముఖ తెలుగు నిర్మాత రోహణ్ జిత్తు అనఘ ఇంటి ముందు వాలాడు.

     *****     *****     *****     *****

"అమ్మా! మేము విలేజ్ బేక్ డ్రాపులో, తెలుగులో ఓ సినిమా తీద్ధామని ప్లాన్ చేస్తున్నాము. మీ అమ్మాయి గారి డేట్స్ ఇప్పించాలి" అనఘ తల్లి బాపా సన్యాల్ కు వివరించాడు రోహణ్ జిత్తు.

"మాకీ డాటర్ కీ తెల్గూ రాదూ. బహూత్ కష్టం హవుతుందీ జిత్తూ సాబ్" వచ్చీరాని తెలుగులో చెప్పింది అనఘ తల్లి.

"పరవాలేదమ్మా! అవన్నీ డబ్బింగ్ లో చూసుకుంటాం. కాదనకండి" బతిమాలాడు 
జిత్తు.

"హింతకిముందు మీదీ తెల్గూ డైరెక్టర్ బొడ్డు సురేంద్ర సాబ్ కూడా హడిగారు. అయితే హక్కడ క్లైమేటు మాకీ పాపకు సూట్ కాదని హొప్పుకోలేదు" బాంబు పేల్చింది 
బాపా సన్యాల్.

"అబ్బే షూటింగ్ పల్లెటూర్లో కాదమ్మా. మా హైదరాబాద్ లో ఉన్న సోమారాముడు మూవీ సిటీలో కొంత, మిగతాది బ్రహ్మాజీ స్టూడియోలో సెట్టింగులు వేసి తీద్దామమ్మా!"

"హయితే, హింత్కీ మూవీ డైరెక్టర్ కౌన్ హై? జిత్తూ సాబ్?" కొంచెం మెత్తబడి అడిగింది బాపా సన్యాల్.

"డైరెక్టర్ బూరీ రఘనాధ్ అని, చాలా హిట్ పిక్చర్స్ తీసాడమ్మా. కాదనకుండా మీ అమ్మాయిని ఒప్పించండమ్మా!" వేడుకున్నాడు  జిత్తు.

"హోకే జిత్తూ సాబ్. హమ్మాయిని హొప్పిస్తా.
మీరూ అడ్వాన్స్ హిచ్చి వెళ్ళండి" బాపా సన్యాల్ చెప్పడంతో ఆనందంగా వెనుదిరిగాడు రోహణ్ జిత్తు.

     *****     *****     *****     *****

కొద్ది రోజులకే హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో విలేజ్, పంట పాలం సెట్ వేసి 'పల్లెకు పోదాం' అనే సినిమా షూటింగ్ మొదలైంది.

ఆ రోజున షూటింగ్ లో భాగంగా, పొలం పనులు ముగించుకుని, ఏదో కూనిరాగం తీస్తూ ఇంటికి వెళ్తున్న ఓ పల్లె పడుచు పాత్ర మీద షూటింగ్ జరుగుతోంది. 

షూటింగ్ విరామ సమయంలో దర్శకుడు బూరీ రఘనాధ్ వచ్చి,

"అనఘా జీ!  ఈ పల్లె పడుచు పాత్రలో మీరు నటించారు అనడం కంటే జీవించారు అనడం సబబు" హీరోయిన్ అనఘని పొగిడాడు.

"ఇస్ మే క్యాజీ? ఇదీ హంతా మీదీ ట్రైనింగ్, దట్సాల్!" సింపుల్ గా చెప్పింది అనఘ.

"థాంక్సమ్మా, నెక్ట్స్ షాట్ కి ఇంకా టైం ఉంది. ఆ గొడుగు కింద కూర్చోండమ్మా!" అనఘను, ఆమె తల్లి బాపా సన్యాల్ ను ఉద్దేశించి చెప్పాడు బూరీ రఘనాధ్.

    *****     *****     *****     *****

డైరెక్టర్ అటు వెళ్లగానే,

"ఇదిగో, ఒసే అప్పల నరసూ! ఓ పదేళ్ల కితం వరకూ మనం కూడా మన సొంతూరు నూనాకులపాలెంలో ఇలాగే సేలో పనులు సేసుకుంటూ జీవించేటోళ్లమని, ఆ తరువాత రోజుల్లో ఉపాధి కోసం బొంబాయి లోని ఓ సేటు ఇంట్లో పనికి వెళ్లామనీ, అక్కడ నిన్ను సూసిన ఓ నిర్మాత తన సినిమాలో ఛాన్స్ ఇచ్చాడనీ, ఈళ్లకు తెలిత్తే ఎట్టా ఉంటాదంటావ్?" కూతురు అనఘను అడిగింది, బాపా సన్యాల్.

"మన గురించి అందరికీ తెలిసేలా మన పల్లెటూళ్లలో కాకుండా, ఈ స్టూడియోలో షూటింగ్ పెట్టించి మంచి పనే చేసావు కానీ, గట్టిగా మాట్లాడకే అమ్మా! గొడుగులకు చెవులు ఉంటాయి. అదిగో అసిస్టెంట్ డైరెక్టర్ వస్తున్నాడు, నీ బాపా సన్యాల్ పాత్రలోకి వెళ్లిపో" తల్లికి చెప్పింది అనఘ.

ఈలోగా అక్కడికి వచ్చిన అసిస్టెంట్
డైరెక్టర్ తో,

"హేందీవయ్యా! హిక్కడ హింత గరమ్ హుందీ. పాపకి తాగిడాన్కీ హేమైనా ఫారిన్  కూల్ డ్రింక్ జల్దీ లావో!" బాపా సన్యాల్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన తన తల్లి, బాపన సన్యాసమ్మ ఘట్టిపాలను ఆశ్చర్యంగా చూస్తూ ఉండి పోయింది, అప్పల నరసమ్మ ఘట్టిపాల అలియాస్ అ న ఘ.

       *****     **శుభం**     *****

No comments:

Post a Comment