Saturday, September 6, 2025

 *🌺🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺*
  *ఓం నమో భగవతే వాసుదేవాయ*
🍁📿🍁 📿🍁📿 🍁📿🍁
         *నిన్న గతం... నేడే నిజం*

*నరజన్మ దుర్లభమనీ ఎంతో పుణ్యం చేస్తే గాని లభ్యం కాదని పెద్దల వాక్కు. దేహధారణ మొదలు దేహాంతం వరకు ఉన్న సమయంలో మేధను ఉపయోగించి సత్కర్మలు చేసేది మనిషి మాత్రమే. మనిషి జీవితం క్షణికం. బుద్బుదప్రాయం. ఎప్పుడు ఏ రీతిలో ఎలా మలుపులు తిరిగి ముగుస్తుందో ఎవరికీ తెలియదు. నిన్నటిలా ఈ రోజు ఉండదు. నేటిలా రేపు కనిపించదు. భవిష్యత్తు అగమ్యగోచరం.*

*శిలలాంటి జీవితాన్ని శిల్పంగా చెక్కే ప్రతిభ, ఆలోచన మనిషికే ఉన్నాయి. అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శించి సర్వాంగసుందరంగా రూపుదిద్దగలడు, ముందుచూపు కరవై అనాలోచితంగా ఉలి దెబ్బలతో శిలను ఛిన్నాభిన్నం చేయగలడు. అతడి సృష్టికి బయల్పడేది సుందర శిల్పం కావచ్చు, నిరుపయోగమైన రాళ్లముక్కలు కావచ్చు. అంతా అతడి ఆలోచన పైనే ఆధారపడి ఉంది. జీవితం* *చిత్రాతిచిత్రమైనది. నిన్నటి లక్షాధికారి నేడు భిక్షాపాత్రతో కనిపిస్తాడు. నేటి మతిమంతుడు రేపు మతిభ్రష్టుడిగా దర్శనమిస్తాడు. ఆరోగ్యవంతుడు అంతుచిక్కని వ్యాధులతో రోగగ్రస్తుడవుతాడు.*

*దృఢమైన శరీరం, సక్రమంగా ఆలోచించే బుద్ధి, బాధ్యతల పట్ల అవగాహన- అన్నీ పదునుగా ఉన్న తరుణంలోనే నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలి. పరహిత కార్యాలకు నడుం కట్టాలి. కాలంతీరి మనిషి మాయమయ్యాక కూడా అతణ్ని జ్ఞప్తికి తెచ్చుకొని అతడి గుణగణాలను శ్లాఘించేలా బతుకును పండించుకోవాలి. విలువలు లేని జీవితం వ్యర్థమని భావించి మనిషి ముందుకు సాగాలి. ఆ నడక సక్రమంగా సాగాలే తప్ప వక్రగతిలో పడితే పతనం తప్పదు. ఆర్తులను శక్తిమేరకు ఆదుకోవడమే జీవితసారం అంటారు అరవిందులు.*

*మనిషిని నడిపించే ఇంధనం ధనం. కాసులున్నవారికే కనకాభిషేకమని నమ్మి ఆర్జన కోసం ఎంచుకున్నది న్యాయమార్గమా కాదా అని ఆలోచింపక ధనాగారాన్ని నింపి సంబరపడతాడు మనిషి ఈ సంపాదనలో కొంత సంక్షేమం కోసమని ఆలోచిస్తే అతడికి సముచిత రీతిలో గౌరవం లభిస్తుంది. స్వార్ధంతో బతికితే వారసత్వ కుమ్ములాటలు పెచ్చరిల్లి అర్థం వ్యర్థమయ్యే ప్రమాదముంది. ధనం కన్నా కాలం గొప్పదని గుర్తించక దుర్వినియోగపరచే వ్యక్తికి భవిష్యత్తు ఎండమావే. నిన్న గతం. నేడు నిజం, రేపు ఆశ అన్నాడో కవి. గతాన్ని వదిలి రేపటిపై ఆశతో నేడు ఆనందంగా బతికేవాడే తెలివైనవాడు. బలమైన ఆలోచనలకు సువాసనలద్ది పుష్పించి ఫలించేలా చేస్తుంది ఆరోగ్యవంతుడి శక్తి. ఆరోగ్యాన్ని అలక్ష్యం చేస్తే మనిషి బతుకు ప్రశ్నార్థకమే. విత్తం, బలం, విలువలు, కాలం- సమృద్ధిగా ఉన్నప్పుడే వినియోగించాలి.*

*పరిపూర్ణ జీవితానికి ఆధ్యాత్మిక చింతన పువ్వుకు తావి లాంటిది. మనసుకు శాంతినిచ్చి మోక్షానికి దారి చూపే ఆ మార్గాన్ని దూరం చేసుకొని అంత్యకాలంలో విచారిస్తే ప్రయోజనం శూన్యం. యమదూతలు పాశం విసిరేవేళ, కఫ వాత పైత్యాలు ప్రకోపించి తెలివి సన్నగిల్లే సమయంలో కాకుండా ఆరోగ్యం, జ్ఞానం, తెలివి ఉన్నప్పుడే నీ నామస్మరణ చేసేలా నన్నుద్ధరించు స్వామీ అని విన్నవించుకుంటాడు నరసింహ శతకకర్త శేషప్ప కవీంద్రుడు.*
🍁📿🍁 📿🍁📿 🍁📿🍁
*🙏సర్వేజనాః సుఖినో భవంతు🙏*
🌴🌳🌴 🌳🌴🌳 🌴🌳🌴

No comments:

Post a Comment