Saturday, February 1, 2020

ధ్యాన ఫలం

‘🙏 జీవితంలోని అత్యుత్తమ కళల్లో ధ్యానం ఒకటి’ అనేవారు ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి. అదే అత్యంత ఉన్నతమైంది కూడా. బతుకు పయనంలో జరిగే వ్యావహారిక పనులేకాకుండా కళలూ మనిషి చేపట్టే ప్రక్రియలే. జీవనం కోసం చేసే సాధారణ పనులకన్నా కళలు కొంత ప్రత్యేకతను కలిగి ఉంటాయి. చూపరుల దృష్టిని ఇట్టే ఆకట్టుకుని ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంటాయి. అందుకు ప్రధాన కారణం- రోజువారీ పనుల్ని మొక్కుబడిగా, లాంఛనప్రాయంగా చేసి ముగిస్తారు. కళల్ని శ్రద్ధగా, భక్తితో చేసి పూర్తిగావిస్తారు. శిల్పాన్ని చెక్కడం, సంగీత వాయిద్యాలు వాయించడం, మురళీగానం, చిత్రలేఖనం... ఇవన్నీ ధ్యానంతో చేసేవి. అందువల్లే, కళల్ని ప్రత్యేకంగా ప్రేమించిన వ్యక్తికి పట్టరానంత ఆనందం కలుగుతుంది.

భూమి చుట్టూ ప్రాణవాయువు వ్యాపించి జీవరాశిని బతికిస్తున్నట్టుగానే, మనిషిని సాధికారికంగా నడిపించడానికి అతడి జీవితం చుట్టూ ధ్యానం పరచుకుని ఉంటుంది. అది అనాదిగా ఉంటోంది. ఇప్పుడూ ఉంది. ఎప్పటికీ ఉంటుంది. కానీ, మనిషే దాన్ని మరిచిపోయాడు. అందుకనే ‘ఒక్క మనిషి తప్ప ప్రకృతి మొత్తం ధ్యానంతో ఉంటోంది’ అనేవారు సుప్రసిద్ధ తత్వవేత్త ఓషో.

అద్భుతమైన పనికి ఆకర్షితులైన చూపరులు దానికి మెచ్చుకోలు పలుకుతూ ‘ఈ పనిలో కళాత్మకత ఉట్టిపడుతోంది’ అనడం తరచూ వింటూ ఉంటాం. ఒక పనిని చాలా ఇష్టంగా, ధ్యానంతో చేస్తే దాన్ని కళతో పోల్చిచెప్పడం లోకంలో పరిపాటి. చేపట్టిన పని పైన లేదా ఒక విషయం మీద మనసును లగ్నం చేసినప్పుడు అది చంచల స్వభావాన్ని కోల్పోతుంది. అప్పుడిక మిగిలేది- ఎరుకతో కూడిన గమనింపు. ధ్యానమంటే అదే. బహుమూల్యమైన ఆ ధ్యానంతో చేసే ఏ పనైనా బాగా పండుతుంది. ప్రతిఫలంగా, రావాల్సిన ఫలాల మూట- పెద్ద మొత్తంలో అందుతుంది.


‘ఒక వ్యక్తికి కీడు కలిగించి, తన కుటుంబానికి సమాజానికి హాని తలపెట్టే దుశ్చర్యలు, అసాంఘిక కార్యకలాపాలు మంచివి కావు. అవి అత్యంత ప్రమాద కారకాలు’ అని పెద్దలు చెప్పడం వెనకాల తాత్విక నేపథ్యం, ఆధ్యాత్మిక కారణాలూ ఉన్నాయి. చెడు పనిని ఎరుకతో చెయ్యలేరు. అది అసాధ్యం. ఎరుకలేని చోట ధ్యానం కుదరదు. ధ్యానం లేని పని ఆధ్యాత్మికంగా నిస్సారమైంది. గడ్డిపోచ విలువ చెయ్యని చిన్నపనైనా, సింహాసనంపై ఉండి రాజ్యమేలే పెద్ద పనైనా- వాటిపై ప్రేమ లేనప్పుడు ఆ పనులు చేయకుండా ఉండటమే మేలు.

‘ప్రేమతో పనిచేసినప్పుడు మీతో మీరు, ఒండొరులతో, దేవుడితో బంధాలు ఏర్పరచుకుంటారు’ అంటారు లెబనాన్‌ తత్వవేత్త ఖలీల్‌ జిబ్రాన్‌.

ఆకాశాన్ని తాకేంత ఒక పెద్ద భవనం చాలా కాలంపాటు చెక్కుచెదరకుండా నిలబడాలంటే, దాని పునాది బలంగా ఉండాలి. మనిషి జీవితానికీ ఇది వర్తిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి మనసు బాగుండాలి. మనసు మంచిగా ఉండాలంటే అది ఆనందంతో నిండాలి. దానికి ధ్యానమే అంతిమ సోపానం.


గోళ్లను గోళ్లతో రాపిడి చేయడం, ఆహారం సేవిస్తున్నప్పుడు పండ్లతో బాగా నమలడం వల్ల ఆరోగ్య ఫలాలు అందుతాయని యోగా చెబుతుంది. పైగా హింసా ప్రవృత్తి విడనాడి అహింసా మార్గం అలవడుతుంది. అందుకే నెమరువేసే గుణం ఉన్న పశువులు సాధు స్వభావం కలిగి ఉంటాయి. మనిషికి కోపం వచ్చినప్పుడు శక్తి విస్ఫోటం చెంది మనిషిలోని బలం వృథా అవుతుంది. క్రోధం కలిగే క్షణాల్లోనే దాని మూలాన్ని పట్టుకుని గమనించితే, ఆ కోపమంతా ప్రేమగా రూపాంతరం చెందుతుంది. అదే ధ్యానం వల్ల కలిగే రహస్య ప్రయోజనం.

రోజూ ఉదయం, సంధ్యా కాలాల్లో ధ్యాన సాధన సాగుతుంటే జీవితం పట్ల ఒక స్పష్టత వస్తుంది జీవితానికి లక్ష్యమూ ఏర్పడుతుంది. ఎలా జీవించాలో తెలుస్తుంది.🙏

No comments:

Post a Comment