Tuesday, April 21, 2020

లాక్ డౌన్ ముగిసింది. కానీ రామారావు పరిస్థితి దిగజారిపోయింది.

లాక్ డౌన్ ముగిసింది.
కానీ రామారావు పరిస్థితి దిగజారిపోయింది.
వెంటిలేటర్ తీసేసారు.
కళ్ళముందు కాంతిపుంజం దగ్గరయ్యింది.
కళ్ళు తెరిచి చూసాడు.
రెక్కలుపట్టుకొని లాకెళ్తున్న వాళ్ళు నర్సులో డాక్టర్లో పోలీసులో కాదు, యమకింకరులు అని అర్ధం కావడానికి అయిదు సెకండ్లు కూడా పట్టలేదు.
చాలదూరం పోతున్నారు.
వెళ్తూ వెళ్తూ మధ్యలో మాట్లాడుకొంటూనే ఉన్నారు.

రామారావూ... దేవుడి పేరుపెట్టారు, బుద్ధులు, సుద్దులూ నేర్పారు, అడిగినవన్నీ ఇచ్చారు నీ తల్లీతండ్రులు. నువ్వు చేసిన పుణ్యం ఏమైనా ఉందా ? గుర్తుకు తెచ్చుకో అని అడిగాడు ఒక కింకరుడు.

తల అడ్డంగా ఆడించాడు రామారావు గుర్తులేదన్నట్లు, లేదన్నట్లు.

పోనీ నీ జీవిత కాలంలో ఎప్పుడైనా దేవుణ్ణి ప్రార్ధించడం, ఆలయాలకు వెళ్లడం, దానాలు చేయడం, గ్రంధాలు చదవడం...ఇలాంటివి ఏమైనా చేశావా ? ఇంకో కింకరుడి ప్రశ్న.

మళ్లీ అడ్డంగా తిరిగిన రామారావు బుర్ర.

పోనీ కొన్ని శ్లోకాలైనా వచ్చా ?
అడ్డంగా తిరిగిన రామారావు బుర్ర.
హనుమాన్ చాలీసా ?
అడ్డంగా తిరిగిన రామారావు బుర్ర.
పోనీ భగవద్గీత ఒక్కసారైనా చదివావా ?
అడ్డంగా తిరిగిన రామారావు బుర్ర.
భగవద్గీతలో ఒక అధ్యాయం ?
అడ్డంగా తిరిగిన రామారావు బుర్ర.
కొన్ని శ్లోకాలు ?
అడ్డంగా తిరిగిన రామారావు బుర్ర.

ఏం ?
ఏడుపుమొహంతో చెప్పాడు... సమయం చాల్లేదు.
సమయం చాల్లేదా ? అంతలా ఏమి ఉద్ధరిస్తున్నావు ?
" ఇంక ఏడ్చేస్తూ చెప్పాడు రామారావు... అవును, నిజంగానే పాపిని. నా భార్య పూజలు చేస్తున్నా అడ్డుకొనేవాడిని. దేవుడిగురించి ఏమి చేద్దామన్నా చీవాట్లు పెట్టేవాణ్ణి. ఇంటిముందర ఆలయం ఉన్నా వెళ్లడం సమయం వృధా అనుకొనేవాణ్ణి. డబ్బు కూడపెట్టడమే ముఖ్యం అనుకొని రోజుకు 18గంటలపాటు సంపాదన వెనుక పడీ పడీ చివరకు వైరస్ బారిన పడ్డాక బాధపడుతూ ఇదిగో... చివరకు మీచేతిలో పడ్డాను..."
ఆ ఏడుపుకు కింకరులే చలించిపోయారు.

" ఇప్పుడు బాధపడి ఉపయోగం ఏముంది రామారావు... నీకు దేవుడు 24గంటలు ఇచ్చాడు కదా... 50ఏళ్ల ఆయుర్దాయం కూడా ఇచ్చాడు. అందులో ఒక పదేళ్ళపాటు వారానికి అరగంట కేటాయించి రెండు శ్లోకాలు చదివినా ఒకసారి భగవద్గీత పూర్తయ్యి సద్గతులు వచ్చేవి కదా రామారావూ..." అంటూ జాలిగా ఒక కింకరుడి మాటకు తల కొట్టుకొంటూ ఇంకా ఎక్కువగా రోదించడం చూసిన రామారావును వదిలి పక్కకు వెళ్లి ఏదో మాట్లాడుకుని వచ్చారు ఇద్దరు కింకరులూ...

" సర్లే రామారావు... ఎడవకు. నీ తల్లీతండ్రులు చేసిన పుణ్యం నీకు ఇన్నాళ్లూ కలిసొచ్చింది కనుక సంతోషంగా గడిపేశావు. ఇప్పుడు నీ ఏడుపులో నిజాయితీ ఉంది. నీకు మళ్లీ అవకాశం ఇద్దాం అనుకొంటున్నాం. ఏమి చేస్తావు ?"
" ఒరేయ్ ఏమి చేస్తావురా ?"
" ఏదైనా చేస్తానురా "
" అదే... ఏమి చేస్తావురా ? డిష్యూమ్...
" నన్నే కొడతావా... ఇప్పుడు చూడు ...డిష్యూమ్...
డిష్యూమ్...డిష్యూమ్...డిష్యూమ్...
రామారావు ముక్కు పగిలిపోయింది. కెవ్వున అరవగానే కళ్ళు పెద్దవి చేసుకొని మీదకెక్కిన ఇద్దరు కొడుకులూ, వంటింట్లోనుంచి అప్పుడే కంగారుగా వచ్చిన భార్యా నోరెళ్ళబెట్టుకొని చూడటం కనిపించి అయిదు నిముషాల తరువాత అర్ధమయ్యింది...
లేవండీ... సోమవారం, మంగళవారాలని లేకుండా కూడా పదకొండింటి వరకూ పడుకోవడమే దరిద్ర్యం. అందుకే ఏదో పీడ కల వచ్చుంటుంది ఇదే లాక్ డౌన్ లేనిరోజుల్లో ఐతే ఏడింటికే లేచేసి ఎనిమిదింటికి కారేసుకుపోయేవారు. అంటూ పక్కబట్టలు సర్దుతున్న భార్యతో అన్నాడు రామారావు....
ఒసేయ్, స్నానం చేసి వస్తాను. పూజాగదిలో భగవద్గీత పైన పెట్టుంచు...అంటూ టాయిలెట్ లోకి పోతున్న భర్తను నోరెళ్ళబెట్టి చూస్తుండగా... టీవీలో మోడీగారు చెబుతున్నారు... లాక్ డౌన్ పొడిగిస్తున్నాం అని.ఫేస్బుక్ నుండి సేకరణ. రచయిత కి వందనాలు 🙏🙏🙏🙏

No comments:

Post a Comment