Wednesday, September 14, 2022

వైరాగ్యం

చూడడం, వినడం వలన శరీరం మొదలు విశ్వమంతా వ్యాపించి ఉన్న అశాశ్వతమైన భోగ విలాసాల పట్ల విరక్తి భావం కలగడమే వైరాగ్యం.
మనలో చాలా మందికి వైరాగ్యమంటే భయం. ఎంతసేపూ సంపదలు, సంసారం అంటూ తాత్కాలిక సుఖాల వెంట పరుగుతీస్తారు. వైరాగ్యమిచ్చే  సుఖాన్ని, సంతోషాన్ని మరేదీ అందించలేదని గీతాచార్యుడు బోధించినప్పటికీ , అది  తెలుసుకుని మసలు కోవాలంటే  తగిన పరిపూర్ణత రావాలి.

సుకుమారంగా అంతఃపుర గోడల మధ్య పెరిగిన బుద్ధుడు,  శవాన్ని, రోగిని, ఊత కర్ర సాయంతో ఊగుతూ  నడుస్తున్న ముదుసలిని చూసి ‘మనుషులంతా  రోగ పీడితులు, ముసలివాళ్ళు కావాల్సిందేనా? మరణించాల్సిందేనా ?’   అన్న ఆలోచనలతో  మానవుల బాధలకు పరిష్కారం అన్వేషించడానికి బయల్దేరాడు.అదే ఆయనలో వైరాగ్యానికి తొలిమెట్టు వేసింది.    
“నా  మీద చూపించిన ప్రేమను,  అనురాగాన్ని జగదాభిరాముడి మీద చూపించి ఉంటే మీకు మోక్షం వచ్చేదని” పలికిన భార్య  దెప్పిపొడుపులకు సంసార సుఖాల మీద వ్యామోహం పోయింది తులసీదాసుకు. జగానికి రామచరిత మానస్ దక్కింది.  

మృతుల, యుద్ధవీరుల రక్తం ఏరులై  ప్రవహించడాన్ని కళింగ యుద్ధంలో చూసిన అశోక చక్రవర్తిలో  ‘ఇంతమందిని చంపితే  వచ్చే రాజ్యాన్ని ఎలా  పరిపాలిస్తామనే’ భావన ప్రవేశించింది. ఆయనలో వైరాగ్యం మొదలయింది.

‘దేహము శాశ్వతం కాదు, నశిస్తుంది, మోహాలను  వదిలేసి సన్యసించడానికిదే తగిన సమయమని’  విదురుడు చెప్పగానే ధృతరాష్ట్రుడిలో  వైరాగ్యం ప్రవేశించింది. భార్యా సమేతుడై హిమాలయానికి వెళ్ళిపోయాడు.

పశువులు, పత్ని, సంపద , సుతులు , గృహాదులన్నీ  ఋణవశాన ప్రాప్తిస్తాయి.  ఋణం తీరిన మరుక్షణం  ఏదీ వారితో ఉండదని గ్రహించేవాళ్ళు నిత్యసంతోషులై జీవిస్తారు.   

ఇతిహాసాలు, పురాణాలు తెలిపిన   దైవవాక్కులను మననం చేసుకుంటూ ఆచరించడం మొదలెడితే పునర్జన్మ  వాసనలు నాశనమై,   వివేకం పెరుగుతుంది. వైరాగ్య భావనలు ప్రవేశిస్తాయి.ఇదే ప్రశాంత జీవనానికి మార్గం చూపుతుంది.
     ఇంతమంది వైరాగ్యం గురించి చెప్పినా పత్రీజీ గారు చెప్పిన అధ్యాత్మిక సత్యం సంసారంలోనే నిర్వాణమని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడమే కాకుండా అందరికీ ద్యానం గురించి ద్యానం ద్వారా జ్ణానం,జ్ఞానంలోనే ముక్తి మోక్షం అని చెప్పి అన్ని సమస్యలకు మూల కారణం జన్మ జన్మల చెడు కర్మలనీ, జన్మ జన్మల చెడు కర్మలు సరైన సాధన ద్వారా ఎలా దగ్దం చేసుకోవచ్చో తదనంతరం దుఃఖ రహిత జీవితం అనుభవిస్తూ దుఃఖ రహిత సమాజం కొరకు కూడా పాటు పడవచ్చు అని అందరికీ అర్థమయ్యేలా వివరంగా విపులంగా వివరించారు.
       అందరికి రాచబాట చూపించిన పత్రీజీ గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతలు.
పసుపుల పుల్లారావు ,ఇల్లందు 
9849163616

No comments:

Post a Comment