అరిషడ్వర్గాలలో క్రోధం ఒకటి.
క్రోధం అంటే కోపం లేదా ఆగ్రహం.
మన మనసుకు నచ్చని విధంగా... మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా.. లేదా వ్యతిరేకించినా.. లేదా అసలే నచ్చని విధంగా ప్రవర్తించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతిని లేదా ఉద్రేకాన్ని కోపంగా చెప్పవచ్చు!
దీని పర్యవసానంగా ఎదుటివారిపై మాటలతోనో.. చేతలతోనో దాడిచేయటం, వారిని దూషించటం వంటి వికారాలకు లోనై దానివల్ల ఎదుటివారి దృష్టితో పాటు చూసేవారి దృష్టిలో కూడా మన స్థానాన్ని దిగజార్చుకునే అవకాశం ఉంటుంది.
అందుకే కోపం కలిగే సందర్భాలలో ఆవేశానికి లోను కాకుండా మనని మనం స్వాధీనంలో ఉంచుకోవడం అవసరం.
ఎందుకంటే...
స్మృతి తప్పడం వల్ల ఎప్పుడూ నష్టమే! ఈ ఎఱుక నశించడం వల్లనే మనిషి అజ్ఞానంలో పడుతుంటాడని చెబుతుంది శాస్త్రం.
కోపాన్ని నియంత్రించే బదులు కోపమే మనల్ని నియంత్రిస్తుందా?
కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఎలా సాధ్యపడుతుంది ?
కోపం రావడం కరెక్ట్ కాదని మనకు మనం ఎన్నో సార్లు చెప్పుకున్నా, ఆవేశంలో కోపాన్ని అదుపులో ఉంచుకోలేక పోవడం చాలామందికి జరుగుతూనే ఉంటుంది.
కోపాన్ని నియంత్రించడం ఎలా అన్నది ప్రశ్న.
దానికోసం మనం ఏం చేయాలి ?
కోపాన్ని అర్థం చేసుకోవడం
మన చుట్టూ ఎవరైనా సరిగ్గా మనకు నచ్చని పని చేస్తే దాన్ని మనం స్వీకరించలేము . ఏవరైన తప్పుడు పని చేస్తే క్షణంలో కోపం ఒక అల మాదిరిగా వచ్చివెళ్తుంది. మళ్ళీ ఆ సంఘటనలని తలుచుకుంటూ బాధ పడతాము.
కోపంలో మన జాగరూకతని (కాన్సియస్ నెస్ ను) కోల్పోతాము.
మొదటగా తెలుసుకోవలసింది ఏమిటంటే , కోపం ద్వారా భయాన్ని... దు:ఖాన్ని కలిగించగలమేమో కాని ఎప్పటికీ మనసులోని అసంపూర్ణతని తొలగించలేము అంటే శాంతిని కలిగించలేము!
ఎందుకంటే...
కోపం అనేది రజోగుణం.
అది తన స్థాయిలోనే ఉన్న రజోగుణ భావాలనూ లేదా తనకన్న తక్కవ స్థాయి తమో గుణాలైన భయం - దు:ఖం లాంటి భావాలను ప్రేరేపిస్తుందే తప్ప.. తన కన్న ఉత్తమస్థితిలో ఉండే సత్వగుణ స్థాయిలో ఉండే "శాంతి" ని కలిగించలేదు.
మరో విషయం...
ఆథ్యాత్మిక దృక్కోణంలో చూసినపుడు ఒక భయస్తుడు కంటే, ఒక నిత్య దు:ఖితుడు కంటే ఒక కోపిస్టే ఉత్తముడు. ఒక కోపి తనలోని కోపాన్ని తొలగించుకుంటే చక్కని క్రియాశీలవంతుడుగా మారుతాడు.
నిజానికి ఒక వ్యక్తిలో కోపం ఉన్నదంటే వారిలో బయటకు రాని అట్టడుకు నొక్కివేయబడిన విజయశక్తి ఏదో ఉన్నట్లే అర్థం!
ఆ పుణ్యశక్తిని ఇతరులను నిందించడం వల్ల అనవసరంగా వృథా పరుస్తారా? లేక విజయాలను సాధిస్తారా? అనేది వారి వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది.
కోపాన్ని తొలగించు కోవాలంటే తనకు ఎదురైన పరిస్థితిని స్వీకరిస్తూ, జాగరూకతతో (కాన్సియస్ నెస్ తో) సరిదిద్ధుకునే ప్రయత్నం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
"అవసరమైనపుడు కోపాన్ని ప్రదర్శించడం వేరూ- కోపపడడం వేరు అన్నది మనం గుర్తించాలి."
కోపాన్ని ప్రదర్శించినపుడు మనం కాన్సియస్ నెస్ తో ఉంటాము కాని కోపానికి గురియైనపుడు "కోపం" అనే భావంతో తదాత్మ్యం చెంది స్పృహ (కాన్సియస్ నెస్) కోల్పోతాము. అలా స్పృహ కోల్పోవడం సమస్యలు రావడానికి కారణమౌతుంది.
చాలా సందర్భాలలో మనం సరియైన విధంగా ఆలోచించక పోవడం - అవగాహన చేసుకోకపోవడమే కోపం రావడానికి కారణమౌతూ ఉంటుంది.
దీన్ని ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు!
ఒక సాయంకాల సంధ్యా సమయంలో ఒక వ్యక్తి దేవాలయంలో దేవున్ని దర్శించుకుని ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నాడు. అదే సమయంలో ఇద్దరు పిల్లలు అక్కడ విపరీతంగా అరుస్తూ అల్లరి చేస్తున్నారు. ధ్యానం చేసే వ్యక్తి ఎంత సముదాయంచినా పిల్లలు అదే తంతును కొనసాగిస్తున్నారు. ఆ వ్యక్తిలో అసహనం పెరిగిపోతూ ఉంది. ఆ పిల్లలు ఆడుతూ - తిరుగుతూ వుంటే వాళ్ల కాళ్లకు తగిలి అతని పూల బుట్టలో ఉన్న ప్రసాదం దూరంగా పడింది. సరిగ్గా అప్పుడే ఆ పిల్లల తాలుకు వ్యక్తి పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చాడు.ఆ వ్యక్తి పిల్లల పై ఉన్న కోపాన్ని ఆ పిల్లల తాలుకు వ్యక్తిపై చూపిస్తూ చివాట్లు పెడుతూ అరవడం ప్రారంభించాడు. అప్పుడు పిల్లల తాలుకు వ్యక్తి శాంతంగా ఇలా చెప్పాడు.
"అయ్యా! క్షమించండి. ఈ పిల్లలు తల్లి దండ్రి లేని అనాథ శరణాలయం పిల్లలు. నేను ఆ శరణాలయంలో ప్రతి సాయంత్రం ఉచితంగా సేవ చేస్తుంటాను. ఈ పిల్లలిద్దరికి బ్రెయిన్ ట్యూమర్. పిల్లలు ఆనందంగా ఉంటారనే ఉద్దేశ్యంతో ఇలా గుడికి తీసుకువచ్చాను. జరిగిన పొరపాటుకు మన్నించండి " అన్నాడతను.
అప్పుడు ఆ ధ్యానం చేసే వ్యక్తి కోపం అంతా ఒక్కసారిగా జాళి గా మారిపోయింది.
కాబట్టి రజో -తమో గుణ పరిధిలోని భావాలు ఎప్పుడూ శాశ్వతం కావు. అవి మన మనుసును బట్టి వెంటది వెంట మారుతూ వుంటాయి.
ఇదే ఉదాహరణలో ఆ పిల్లల తాలుకు వ్యక్తి ఇప్పటికే పది మర్డర్లు చేసిన ఒక సైకో అన్న విషయం తెలిస్తే ఆ ధ్యానం చేసే వ్యక్తిలో కోపం - జాళి స్థానంలో "భయం"ప్రవేశించేది.
ఆ పిల్లల తాలుకు వ్యక్తి ఒక కర్ర తీసుకుని ఆవేశంతో చెడామడా వాయిస్తే "దు:ఖం" ప్రవేశించేది.
ఆ పిల్లలు యవ్వనంలో తాను చేసిన పొరపాటు వల్ల కలిగిన తన పిల్లలే అని తెలిస్తే "ప్రేమ"కలిగేది.
ఇలా అవగాహనను బట్టి ,మనుసును బట్టి కోపం రకరకాల భావాలుగా మారుతూ ఉంటుంది.
అదే సాత్విక స్థాయిలో ఉండే శాంతి - దయ - నిజమైన ప్రేమ - నిరభిమానం.. మొ॥ భావాలు ఇలా వెంటది వెంట మారిపోయేవి కావు.
నిజానికి ఈ కోపం అనే భావం పుట్టకతో ఉండే భావం కాదు.పుట్టినపుడు సుఖం - దు:ఖం అనే రెండు భావాలు మాత్రమే ఉంటాయి. తరువాత ఆ భావాలు విస్తరించి రకరకాల భావాలుగా మారుతాయి. ఈ కోపం అనేది దు:ఖ జన్యమైనది.
కోపం రావడానికి గల కారణాలను కొంత పరిశీలిద్దాము.
1)శరీరానికి మరియు మనస్సుకు సరైన విశ్రాంతి లేకపోవడం.
2) పాత జ్ఞాపకాలు మనసులో ఇబ్బంది కల్గించడం.
3) తప్పులని లేక అసంపూర్ణతని అంగీకరించలేకపోవడం.
4) సోమరితనం
5) అవగాహన లేదా జ్ఞానం లేకపోవడం
6) భయం
7) విజయశక్తి సన్నగిల్లుతూ పరాజయశక్తి వృద్ధి చెందడం
8) దురభిమానం
9) గర్వం
10 ) మోహం
11) ప్రేమ రాహిత్యం లేదా ఒంటరితనం
12) ఆత్మన్యూనత
13) సమయ పాలన లేకపోవడం
14) తన పట్ల తనకే ఉన్న అసంతృప్తి
15) అనుమానం
.... ఇలా కోపం రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి.
"ఆహారశుద్ధౌ సత్వశుద్ధి సత్వశుద్ధౌ ధృవా స్మృతిః" అని శాస్త్రం.
మనం తీసుకున్న ఆహారం మన శరీరంపై - మనసుపై తప్పనిసరి ప్రభావం చూపుతుంది.
అప్పుడప్పుడు మనం చాలా ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా ఉంటాము.
కొన్ని రోజులలో చాలా అలసిపోయినట్లు ఉంటాము.
తిన్న ఆహారం ..శరీరం మరియు మనోభావాలపై చాలా ప్రభావం చూపుతుంది.
కొన్ని రకాల ఆహారపదార్థాలు మన శరీరం మరియు మనసు అలసిపోయే విధంగా చేస్తాయి. వాటిని తీసుకోవడం తగ్గిస్తే కోపాన్ని అదుపు లో ఉంచవచ్చు.
సాధారణంగా మసాలా మరియు నూనె ఎక్కువగా వున్న పదార్థాలు, అనవసర చిరుతిండ్లు, అపవిత్ర పదార్థాలు... మొ॥వి. అశాంతిని ఎక్కువగా కలిగిస్తాయి!
అలాగే అశాస్త్రీయ -అనవసర ఉపవాసాలూ- అతిగా తినడం కూడా కోపాన్ని ప్రేరేపిస్తాయి.
సరియైన విశ్రాంతి తీసుకోకపోవడం కూడా కోప స్వభావాన్ని పెంచుతుంది.
ఒక రోజు రాత్రి పడుకొన లేదనుకోండి! తర్వాతి ఉదయం ఎలా ఉంటుంది ? తరచుగా కోపం వస్తుంది కదా!? మన శరీరంలోని అలసత్వం మరియు అవిశ్రాంతత వల్ల మనం అసహనానికి మరియు ఆందోళనకి లోనవుతాము. సాధారణ మనుషులందరకు 6 నుంచి 7 గంటల నిద్ర అవసరం. ఇది శరీరానికి మరియు మనసుకు విశ్రాంతిని ఇవ్వడమే కాక ఆందోళనకి గురైయే అవకాశాన్ని తగ్గిస్తుంది.
అలాగే ప్రతీ వ్యక్తికి తగినంత శారీరక పరిశ్రమ అవసరం. అలా తగినంతగా శారీరక పరిశ్రమ చెయ్యని వ్యక్తికి మానసికంగా తనకే తెలియని ఒక అసంతృప్తి పెరుగుతూ పోతుంది.అది దగ్గరి వ్యక్తులపై - కుటుంబ సభ్యులపై కోపం రూపంలో వ్యక్తమౌతూ ఉంటుంది.
అందువల్ల ప్రతీ వ్యక్తి ఒక గంట కాలం వాకింగ్ చేయడం అవసరం. ఇది మనలో సత్తువని పెంచుతూ శారీరక దృఢత్వానికి కారణమౌతుంది. వాకింగ్ విషయంలో నేను గమనించినంత మట్టుకు మనతో మనం గడుపుతూ ఒంటరిగా చేసే వాకింగే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
ఇక కోపం వచ్చిన సమయంలో మనం ఏం చేయాలి?
ఎంత కోపాన్ని అయినా శారీరక పరిశ్రమ వల్ల తొలగించుకోగలము.
సేకరణ. మానస సరోవరం 👏
No comments:
Post a Comment