Saturday, September 17, 2022

నేటి జీవిత సత్యం. *ఎందుకీ బెంగ?*

 నేటి జీవిత సత్యం. *ఎందుకీ బెంగ?* 

నిజమైన ఆనందం అంటే భవిష్యత్తు గురించి బెంగటిల్లకుండా వర్తమానంలో హాయిగా ఉండడం అంటాడు ప్రముఖ తత్వవేత్త సెనెకా. కానీ మనుషులు అలా ఉండలేకపోవడమే వర్తమాన విషాదం. ఎందుకంటే అనిశ్చితితో కూడిన కాలమిది. ఒకటో శతాబ్దానికి చెందిన తత్వవేత్త సెనెకా  రోమన్‌ సమాజంలో ముందు ఏం జరగబోతుందోనని చింతిల్లే జనావళిని చూసి ఆ మాట చెప్పాడు. శతాబ్దాలు గడిచినా మనుషుల నైజం మారలేదు. ఇవాళ ఇరవయ్యోకటో శతాబ్దంలో బతుకు మరింత సంక్లిష్టమైంది. ఏ పూటకు ఆ పూట వెదుక్కోవాల్సిన వారే కాదు, అన్నీ సమకూరిన వారు కూడా భవిష్యత్తు గురించి యోచిస్తూ వర్తమానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. 
ప్రజలే కాదు పాలకులు కూడా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కుటిల నిర్ణయాలు, కుట్రపూరిత వ్యవహారాలతో గడపడం తెలిసిందే. ఎన్నికలయి గెలిచి అధికారం చేపట్టినవారు తాము చేయాలనుకున్న పనులు చేయాలి. అందుకు భిన్నంగా మరో అయిదేళ్ళ తర్వాత కూడా అధికారంలోకి రావడమెలా అనే ఆలోచనలు చేసే కృతకమైన రాజకీయ వ్యవస్థ మనది. పదవుల్లోకి వచ్చి ఆ పదవులు నిలుపుకోడం, ఆ తర్వాత పదవుల్లో ఉండటం కోసం సంపాయించుకోడమే పనిగా బతికేవారు ప్రజలకు ఏం చేస్తారు. 
ఈ నేపథ్యంలోనే ప్రజలు, పాలకులు నిరంతర అభద్రతలో సతమతమవుతుంటారు. కనుకనే ఇక్కడ బాల్యం, కౌమారం, యవ్వనం సైతం సంక్షుభితమైంది. చదువుల్లో పాసుకాకపోతే, అనుకున్న కోర్సులో సీటు రాకపోతే బతకడం వృధా అనుకునే రీతిన పిల్లల్ని పెంచుతున్నారు. ఫలితంగా ఒత్తిడికి లోనయ్యే పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇరవయ్యేళ్ళకే భవిష్యత్తు మీద భయంతో చచ్చిపోతే బాగుండని తలపోస్తున్నారు. ఈ దురవస్థ గురించే సెనెకా చెప్పాడు. ఎపుడయితే రానున్న రోజులు ఎలా ఉంటాయోనని భీతిల్లుతారో అపుడు వర్తమానంలో హాయగా ఉండలేరు. హాయిగా ఉండటం తెలియకోతే ఆనందంగా జీవించడమూ తెలియదు. 
మన చుట్టూరా సమస్యలు, సవాళ్ళు, సంక్లిష్టతలు ఎన్నో. అయినప్పటికీ హాయిగా ఉండడం ఎలానో తెలుసుకోవాలి. చిన్న చిన్న విషయాలు గొప్ప ఆనందాన్ని ఇస్తాయి. వాటిని అనుభవంలోకి తీసుకునే హృదయం ఉండాలి. సూర్యోదయం, సూర్యాస్తమయం, వెన్నెల రాత్రుల సోయగం పరవశానికి లోను చేస్తాయి. స్థిమితంగా ఉండే మనుషులు మాత్రమే వెన్నెలలోని చల్లదనాన్ని అనుభూతించగలరు. 
మార్కెట్‌ మనుషుల్ని మాయ చేస్తుంటుంది. మార్కెట్‌ కోసం మనం బతకడం లేదు. మనకు ఏం కావాలో మనం నిర్ణయించుకోవాలి. మార్కెట్‌ ప్రలోభాలకు లోను కాకపోతే మనుషులు హాయిగా ఉండే వీలుంది. ఏది ఎంతవరకు అవసరమో యోచించాలి. అవసరాలు, సౌకర్యాలు, విలాసాలకు నడుమ అంతరాన్ని గ్రహించాలి. ఐదు నక్షత్రాల హోటల్‌లో ప్లేట్‌ భోజనం వెయ్యి రూపాయలపైనే. మన వీధి పక్కన మెస్‌లో ఎనభై రూపాయలు. ఎక్కడయినా తాము తినగలిగిన మేరకే తింటారు. తేడా మన ఆలోచనల్లోనే ఉంటుంది. దీన్ని గ్రహించగలిగిన వివేచన ఉంటే ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో తినలేకపోయామే అనే చింత ఉండదు. అక్కడ తినేంత స్థాయికి ఎదగాలనే రంది లేకపోతే మన ఇంట్లో మనం చేసే భోజనమే మనకు ఆరోగ్యాన్నీ, ఆనందాన్నీ ఇస్తుంది.  అందుకని మితంగా, నిరాడంబరంగా బతకడంలోని సహజత్వాన్ని గ్రహించాలి. ఇదే మనిషి ఆనందానికి మూలం.
వర్తమాన జీవితంలో చేసే పాజిటివ్ ఆలోచనలు వల్లనే వర్తమానం మరియు భవిష్యత్ జీవితం అనంద కరంగా ఉంటుంది...వర్తమానంలో ఉన్న ఆనంద ఫలాలు గతంలో చేసిన పాజిటివ్ ఆలోచనలు వలన మాత్రమే సాధ్యం.
     నిరంతర వర్తమాన ఆలోచనలు సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం.
     వర్తమానంలో ఎలా జీవించాలి అనే మార్గం చూపించిన పత్రీజీ గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు

సేకరణ. మానస సరోవరం 👏

No comments:

Post a Comment