Saturday, September 17, 2022

వివేకానంద చెప్పిన కథ, సింహాలు మీరు

✍🏽 నేటి కథ ✍🏽

సింహాలు మీరు

అనగా అనగా..... నిండు గర్భిణి అయిన ఒక సింహాం, ఆహారం కోసం తిరుగుతూ, ఒక గొర్రెలమందను చూచి, దాన్లోకి దుమికింది. కానీ ఆ శ్రమకు ఓర్వజాలక, ఈని, అది వెంటనే మరణించింది. దాని బిడ్డ, గొర్రెల పోషణ క్రిందనే పెరిగి, వాటితోపాటు గడ్డిమేస్తూ, వాటిలాగానే గొర్రె అరపు అరుస్తూండినది. పెద్దదైన తర్వాత కూడ, తాను ‘గొర్రె’ అనే దాని తలపు.

మరొక సింహాం ఒకనాడు, ఆ ప్రాంతానికి ఆహారార్ధం వచ్చి, ఆ మందలో సింహాం ఉండడం, గొర్రెలలాగా అదీ పారిపోవడమూ చూసి అశ్చర్యపోయింది. దాని దగ్గరకు వెళ్లి, అది గొర్రెకాదనీ, సింహామనీ తెలుపడానికి ప్రయత్నించింది కాని, అది అందకుండా పారిపోసాగింది.

సమయం కోసం వేచి ఉండి, ఒకరోజు ఆ ‘గొర్రె – సింహం’ నిద్రిస్తూండగా, దగ్గరకు వెళ్ళి, “నువ్వు సింహనివి” అని దానికి చెప్పింది. “కాదు, నేను గొర్రెనే” అంటూ అది గొర్రెఅరుపు అరిచింది. అంతట ఈ సింహం దాన్ని ఒక చెరువు దగ్గరికి లాక్కునిపోయి, తమ ఉభయుల ప్రతిబింబాల్ని చెరువు నీటిలో చూపిస్తూ, "బాగా చూడు, నువ్వు ఎవరివో యిప్పటికైనా తెలుసుకో” అన్నది సింహం.

అంతట, ఆ ‘గొర్రె – సింహం’ నీళ్లలో కనిపించే తన ప్రతిబింబాన్ని, ఆ సింహాన్ని పోల్చిచూసుకొన్నది. క్షణమాత్రంలో తాను సింహామనే సత్యం దానికి స్ఫురించింది. వెంటనే దాని గొర్రె అరుపు మాయమై, సింహగర్జనం వెలువడింది.

మనం అపరిశుద్ధులం అని ఎన్నడూ అనకండి. పరిశుద్దులమనే అనండి. మనం స్వల్పులమనీ, జన్మిస్తామనీ, మరణిస్తామనీ గాఢభ్రాంతిని ఒక దాన్ని కల్పించుకొని ఉన్నాం. అందువల్ల మనల్ని ఎప్పుడూ అకారణ భీతి వెన్నాడుతోంది. సింహాలు మీరు! నిత్యం పరిశుద్ధం, పరిపూర్ణం అయిన అత్మయే మీరు. విశ్వశక్తి మీలో అణగి ఉంది.

’మిత్రమా! ఏడుస్తున్నా వెందుకు? నీకు జననమరణాలు లేవు, వ్యాధి దుఃఖాలు లేవు. అనంతమైన అకాశం వంటివాడివి నువ్వు. రంగు రంగుల మబ్బులు దాని నావరించి, ఒక క్షణ మాత్రం క్రీడించి మాయమౌతూ ఉంటవి. కానీ, అకాశ మెప్పుడూ, నిత్యవినీల కాంతిమయమే. దుర్జనత్వం మనకేల కనిపిస్తోంది?’

నేను ఆత్మను. విశ్వంలో ఏదీ నన్ను చంపలేదు’అని మానవుడికి వ్యక్తపరిచే ధైర్యాన్ని అలవరుచుకోండి. అప్పుడు మీరు ముక్తులవుతారు.

[వివేకానంద చెప్పిన కథలు నుండి దీనిని తీసుకొన్నాను.]

No comments:

Post a Comment