Saturday, September 17, 2022

నేటి చిట్టి కథ

 ✍️......... 🌻 *నేటి చిట్టి కథ🌻*


🥀సిరిపురంలో వుండే మీనాక్షమ్మ చాలా మంచిది. అందరికీ సహాయపడేది. కానీ ఆమె కొడుకు రాము మాత్రం ఏ పని చేయకుండా జులాయిగా తిరిగేవాడు. తల్లి ఎంతో కష్టపడి డబ్బు సంపాదించి కొడుకును చదివిస్తుంటే, రాము మాత్రం చదువు కోకుండా అల్లరి చిల్లరిగా తిరిగేవాడు.

🥀పైగా ప్రతి ఒక్కరి తోను.." నా గురించి మీకేం తెలుసు? నేను ఎంత తెలివైన వాడినంటే, నాకు పదవతరగతిలో జిల్లా ఫస్టు ఖాయం. చూస్తూండండి, ఆ తర్వాత నేను ఐఎఎస్సాఫీసర్నవుతాను- అప్పుడుగానీ మీ అందరినోళ్ళూ మూతపడవు" అని బుకాయించి తన దారిన తను పోయేవాడు.

🥀రాను రాను రాము వాస్తవాల్ని మరచిపోయి, ఎప్పుడూ పగటి కలల్లోనే విహరించటం మొదలైంది.

🥀ఊరికే కూర్చొని 'నేను ఇట్లా అవుతాను గదా, అప్పుడు చాలా బాగుంటుంది; ఆ తర్వాత ఇట్లా అవుతుంది- ఇంకా చాలా బాగుంటుంది!' అని అనుకుంటూ ఆనందపడేవాడు.

🥀ఒక రోజున ఇట్లాగే పగటి కలలు కంటూ కూర్చున్న రాముని వచ్చి పలకరించాడు ఒక రైతు. "నాకు 25 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ  చెట్లు ఎక్కి, కొబ్బరికాయలు కోసి క్రిందకు దించితే- చెట్టుకు 25 రూపాయలు చొప్పున ఇస్తాను" అన్నాడు. 

🥀రైతు మాట వినగానే రాము "సరే" అని బయలుదేరాడు. అయితే ఒక వైపున కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగానే వాడి ఆలోచనలు పరుగులు తీసాయి 

🥀చెట్టుకి 25రూపాయలు వస్తాయి, నాకు. ఈ డబ్బుల్ని నేను మా అమ్మకు ఇస్తే, నా పుట్టిన రోజుకు బట్టలు, కేకులు కొనిపెడుతుంది. అప్పుడు నేను కేకును కోసి అమ్మకు తినిపిస్తాను. అమ్మ 'నాకెందుకురా' అంటూనే తింటుంది-'నీకు నేనంటే ఎంత ఇష్టంరా' అంటుంది. అప్పుడు నేను ఇట్లా నవ్వి, 'ఇంత!' అని చూపిస్తాను-" అనుకుంటూ తన చేతులు రెండూ వదిలిపెట్టాడు. అంతే!

🥀ఆ తర్వాత తెలివి వచ్చి చూసేసరికి రాము కింద పడి ఉన్నాడు. ముందరి పళ్ళు రెండూ ఊడిపోయాయి. అమ్మ వచ్చి, వాడిని బాగా తిట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళింది.

🥀పగటి కలలు ఎన్ని కష్టాల్ని కొని తెస్తాయో అనుభవం కొద్దీ గ్రహించిన రాము, ఆ తరువాత వాస్తవంలో బ్రతకటం అలవరచుకున్నాడు.

అల్పుడెపుడు పల్కు నాడంబరముగాను
సజ్జనుండుఁ బల్కుఁ జల్లగాను
కంచుమ్రోగునట్లు కనకంబు మ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.

🥀నీచుడు డంబములు చెప్పుచుండును. మంచివారు మెల్లగా మాటలాడుచుందురు. తక్కువ ఖరీదైన లోహము అయిన కంచు దడదడమని మ్రోగునట్లు, ఎక్కువ ఖరీదైన బంగారము అను లోహము మ్రోగదు కదా...


☘️☘️🌼🌼🌼🌻🌼🌼🌼☘️☘️
సేకరణ

No comments:

Post a Comment