Saturday, September 17, 2022

ఆత్మసాక్షాత్కారమనేది శరీరం పోయినపుడు లభించేది కాదు. ఆత్మ ఎప్పుడూ ఉందేదే.

 🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

ఆత్మసాక్షాత్కారమనేది శరీరం పోయినపుడు లభించేది కాదు. ఆత్మ ఎప్పుడూ ఉందేదే. అది లేకపోతే మన జీవితయాత్ర సాగుతుందా? కనుక అట్టి ముక్త స్థితిని శరీరం ఉండగానే సాధించాలి. ఇట్లా సాక్షాత్కరించుకొని మన మధ్యలో తిరిగే వానిని జీవన్ముక్తుడని అంటాం.

అట్టి బ్రహ్మజ్ఞానులలో కూడా ఎందరో భక్తులున్నారు. అంటేవారు ఒక దేవత రూపంలో ఉన్న బ్రహ్మమును అధికంగా ప్రేమిస్తారు. అట్టి వారి భక్తికి హేతువంటూ కనబడడు. అట్టి భక్తిని అభ్యసించడం వల్ల వారు పొందేది ప్రత్యేకంగా ఏదీ ఉండదు. ఎందుకంటే వారేనాడో ముక్త స్థితిలో ఉన్నారు అతీతమైన దానిని అందుకొన్న తర్వాత, ఇంకా అందుకోవలసిందే ముంటుంది? అయినా బ్రహ్మ యొక్క లీలలను పరికిస్తూ ఉంటారు. ఆనందిస్తారు. ఏదీ కోరకుండా ప్రేమను చూపిస్తారు. జీవన్ముక్తుడు, ప్రత్యేకంగా ముక్తి కావాలని కోరడు. ఇదే అహైతుకీభక్తి, శుకుడట్టి బ్రహ్మజ్ఞాని బ్రహ్మనిష్టుడు. హేతువంటే కారణం, కారణం లేనిది అహేతుకం, అదే ముక్తికి సోపానం.

ముక్తికి ముందు భక్తి ఎట్లా ఉంటుంది?

ఒక తండ్రియున్నాడు. అతనికొక ఆడపిల్ల, ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. ఆమెను ఒక అయ్య చేతిలో పెట్టాలి. వరుడు దొరికాడు. వివాహం నిశ్చయమైంది. వివాహమైన తరువాత అల్లుడు ఈమెను తన ఇంటికి తీసికొని వెళ్లబోతున్నాడు. కన్యాదానం చేసే సమయంలో తండ్రి మనస్సు ఎట్లా ఉంటుంది? మంచి సంబంధం దొరికిందని ఒక మూల సంతోషిస్తాడు. ఆ సంతోషాన్ని అణచుకొని ఆమె అత్తింటికి వెడుతున్నపుడు బావురుమంటాడు. సంబంధం వెదికినవాడు, పెళ్లి చేసినవాడూ ఇతడే. అప్పులు చేసైనా వివాహం చేసాడు. అయినా వెళ్లిపోతోందని బాధ.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁 

No comments:

Post a Comment